Suryaa.co.in

Andhra Pradesh

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో బహుముఖ విధానం

– వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు

అమరావతి: శిశు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అనుసరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన ఎంపిసిడిఎస్ఆర్ సమీక్షా సమావేశం, కన్సల్టేషన్ వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి డిఎంహెచ్వోలు,డిసిహెచ్ఎస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసూతి, శిశు సేవలపై వివరణాత్మక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ప్రసూతి మరణాలు, ఐదేళ్లలోపు శిశు మరణాల రేటును 2030 నాటికి గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో బహుముఖ విధానాన్ని రూపొందించామన్నారు. తాజా అంచనాల ప్రకారం ఐదేళ్ళలోపు శిశు మరణాల రేటు 2019లో నమోదైన వెయ్యికి 31 నుండి 2020లో వెయ్యికి 27కు తగ్గిందన్నారు.

ఎర్లీ నియోనాటల్ మోర్టాలిటీ మరియు నియోనాటల్ మోర్టాలిటీ భారాన్ని ఏపీ గుర్తించిందన్నారు. ఈ సవాలును పరిష్కరించడానికి ప్రసూతి సంరక్షణ, ఇంట్రానాటల్ కేర్ మరియు తక్షణ ప్రసవానంతర సంరక్షణను బలోపేతం చేయడం, నవజాత శిశువు ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా బహుముఖ విధానాన్ని ఏపీ అనుసరిస్తోందన్నారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఎస్ ఎన్ సియుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, అధిక భారంతో వున్న ఎస్ ఎన్ సియులలో మందులు, కన్జుమబుల్స్ కు బడ్జెట్ కేటాయింపులను పెంచడం, నాణ్యమైన సంరక్షణను అందించడం, తద్వారా నవజాత శిశు మరణాల్ని తగ్గించి, ఫలితాలను మెరుగుపరచడం ద్వారా నియోనాటల్ కేర్ సేవలను మరింత బలోపేతం చేశామన్నారు.

తద్వారా ఎస్ ఎన్సియు మరణాల రేటులో గణనీయమైన తగ్గుదల నమోదయిందన్నారు. అధిక మరణాలు నమోదవుతూ మాతా శిశు ఆరోగ్యానికి ప్రభావితం చేసే ప్రాంతాల్ని గుర్తించామన్నారు. సౌకర్యాల-స్థాయి, సమాజ-స్థాయి సంరక్షణ రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా అనారోగ్యం, మరణాలను తగ్గించడానికి దిద్దుబాటు చర్యల్ని చేపట్టామన్నారు.

గిరిజన ప్రాంతాలలో, అధిక నవజాత శిశు మరణాలు నమోదయ్యే ప్రాంతాలలో 23 ఐదు పడకల, అలాగే 5 పది పడకల ఎస్ ఎన్ సియులను ఏపీలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎస్ ఎన్ సియు ల ద్వారా సేవల్ని మరింత విస్తరింపజేసి, నవజాత శిశువుల మరణాల్ని తగ్గించడానికి, అలాగే జబ్బుపడిన నవజాత శిశువులకు నాణ్యమైన సంరక్షణ అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్‌లను (ఎన్ బిఎస్యులు) బలోపేతం చేసి, జబ్బుపడిన, తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించటానికి, ఎస్ ఎన్ సియులు, ఎన్బిసిసిలకు బలమైన రిఫరల్ లింక్‌లను ఏర్పాటు చేయడం కోసం పునర్వ్యవస్థీకరణ దిశగా చర్యలు తీసుకున్నామన్నారు.

నవజాత శిశువుల అనారోగ్యం, మరణాలను తగ్గించడానికి, పుట్టినప్పుడు అవసరమైన నవజాత సంరక్షణను అందించడానికి డెలివరీ పాయింట్ల వద్ద మొత్తం 1364 నవజాత శిశువు సంరక్షణ కార్నర్‌లు (ఎన్ బిసిసిలు) ఏర్పాటు చేశామని, 2024-25లో 37 కొత్త ఎన్బిసిసిలు మంజూరు చేశామని వివరించారు. బోధనాసుపత్రులలో మార్చి 2024లో 12 ఎస్ ఎన్ సియులు, 5 నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఎన్ఐసియులు) ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం మొత్తంమీద నవజాత శిశు సంరక్షణను అందించడానికి 1055 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, అధికభారంతో వున్న ఎస్ ఎన్సియులలో నవజాత శిశువుల అనారోగ్యం మరియు మరణాలను మరింత తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ ఎంఎన్సిఎహెచ్ విధానాన్ని అనుసరిస్తూ భారతదేశ నవజాత కార్యాచరణ ప్రణాళిక (ఐఎన్ఎపి) అమలులో కీలక సవాళ్లను గుర్తించడానికి 2024-25లో విశ్లేషణతో కూడిన ప్రణాళికను రూపొందించామన్నారు.

ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డిఎంఇ ఎకడమిక్ డీన్ డాక్టర్ జి.రఘునందన్, యునిసెఫ్ స్పెషలిస్ట్ (హైదరాబాద్ ఫీల్డాఫీస్ ) డాక్టర్ శ్రీధర్, అన్ని జిల్లాల డిఎంహెచ్ ఓలు మరియు డిసిహెచ్ ఎస్ లు, రాష్ట్ర నోడలాఫీసర్లు, యునిసెఫ్, ఎయిమ్స్ మంగళగిరి, ఫెర్నాండెజ్ ఫౌండేషన్, నూరా హెల్త్ కు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE