– మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్: ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం కుమ్మరిగూడ కు పండితులతో కలిసి వెళ్ళి బస్తీ వాసులతో మాట్లాడారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన బస్తీ వాసులు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి విగ్రహం ద్వంసం చేయడం చాలా బాధాకరమని, దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో సంఘటన జరిగిన నాటి నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. తనాకు ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు ముగింపు చెప్పాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవినం సాగించాలనేది తమ ఉద్దేశం అని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
బస్తీవాసుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పండితుల సూచనలు, సలహాల మేరకు నూతన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, మూడు రోజుల పాటు శాంతి పూజలు, హోమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. బస్తీ వాసులు ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలకు అవకాశం లేకుండా పూర్తిస్థాయిలో బస్తీవాసుల సమక్షంలోనే పూజా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమ్మవారి విగ్రహం ప్రతిష్ట, పూజల తేదీలను త్వరలోనే నిర్ణయించి ప్రకటించడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, ఆలయ ట్రస్టీ సభ్యులు కిరణ్, కిషోర్, మహేష్, ఎల్లేష్, సాయి, బస్తీ వాసులు మురళి, రవి, సునీత, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కై లాబ్ యాదవ్, నాగులు, రాములు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, జయరాజ్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీహరి తదితరులు ఉన్నారు.