Suryaa.co.in

Editorial

కూటమిలో కొత్త ‘ఉప’ద్రవం!

  • లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రిపై లేనిపోని లొల్లి

  • లోకేష్‌కు డిప్యూటీ ఇవ్వాలన్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి

  • బాబు సమక్షంలోనే మనోగతం వెల్లడించిన పొలిట్‌బ్యూరో సభ్యుడు

  • డీసీఎంకు లోకేష్ అర్హుడేనన్న సీనియర్ నేత సోమిరెడ్డి

  • రఘునమారకృష్ణంరాజుదీ అదే మాట

  • వారికి భిన్నంగా మాట్లాడుతున్న జనసేన నేతలు

  • పవన్‌కు పోటీ పెడితే ఒప్పుకోమంటూ జనసైనికుల పోస్టులు

  • చానెళ్లలో ‘ఉప’ద్రవంపై చర్చల రచ్చ

  • అనవసర అంశమంటూ సీనియర్ల ఆందోళన

  • వైసీపీకి అస్త్రం అందిస్తున్నారంటూ టీడీపీ ‘సోషల్’ సైనికుల విమర్శల వర్షం

  • కూటమి విచ్ఛిన్నానికి బాటలు వేస్తున్నారా అంటూ పోస్టింగులు

  • పొలిట్‌బ్యూరోను దూరం చేయడం వల్లనే ఈ అనర్ధాలంటూ తమ్ముళ్ల విశ్లేషణ

  • చర్చల సంప్రదాయాన్ని రద్దు చేసినందుకే ఈ క్రమశిక్షణా రాహిత్యమంటున్న సీనియర్లు

  • అసలిప్పుడు ఈ చర్చ అవసరమా అంటూ మండిపడుతున్న కూటమి నేతలు

  • పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వేజోన్, అమరావతి సాయం అంశాలను పక్కదారి పట్టిస్తారా అని మండిపడుతున్న కూటమి కార్యకర్తలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

నిలువెల్లా గాయాలయి.. అంపశయ్యపై ఉన్న వైసీపీకి, కూటమి సంజీవని అందిస్తోందా? ఇప్పటికే వెంటిలేటర్‌పై ఉన్న వైసీపీని బతికించేందుకు.. తమకు తెలియకుండానే డజన్ల కొద్దీ ఆక్సిజన్ సిలెండర్లు తెస్తున్న కూటమి, ఇప్పుడు అదే వైసీపీని ఐసియుకి చేర్చి.. రేపు జనరల్‌వార్డులో చేర్పించి, ఆ తర్వాత జగన్‌ను జనక్షేత్రంలో తిరిగే మహదవకాశం కల్పించబోతోందా? అంటే కూటమి నాయకులే స్వయంగా వైసీపీకి అస్త్రాలు అందిస్తున్నారా? ఇదీ.. ఇప్పుడు కూటమి శ్రేణుల సోషల్‌మీడియాలో జరుగుతున్న వాడి వేడి చర్చ.

దానికి కారణం.. లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న కొత్త వాదన. దానిపై జనసైనికుల ఎదురుదాడి. మరయితే మాకేం తక్కువ? కేంద్రం చేతికి ఎముక లేకుండా నిధుల వరద పారిస్తోంది కాబట్టి, మాకూ ఒక డీ సీఎం ఇచ్చేయాలంటూ కమలదళాల కొత్త కోరిక. కూటమి కలహాలు కొని తెచ్చుకుంటున్న సమస్యలని, ప్రశాంతంగా ఉన్న కూటమిలో చిచ్చు రేపేవేనన్నది మూడుపార్టీ శ్రేణుల ఆందోళన. ఈ అనవసర చర్చ, వైసీపీకి బ్రహ్మాస్త్రమేనన్నది వారి వాదన. కలసి వెరసి.. కూటమిలో కొత్త ‘ఉప’ ద్రవం.

‘లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. జగన్ హయాంలో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న క్యాడర్‌లో పాదయాత్ర ద్వారా సమరోత్సాహం నింపిన లోకేష్ డిప్యూటీ సీఎంకు అన్ని విధాలా అర్హుడు. ఆయనకు డీసీఎం ఇస్తే పవన్‌కు ఇబ్బంది అన్నది అర్ధరహితం’’- మహాసేన రాజేష్ రాజేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అవును.. లోకేష్ ఉప ముఖ్యమంత్రికి అర్హుడేనని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలోనే ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానిస్తే.. మాజీ మంత్రి, మరో పొలిట్‌బ్యూరో సభ్యుడ యిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అందుకున్నారు. దానిపై చంద్రబాబు మౌనం వహించడంతో, మౌనం అర్ధాంగీకారం అని గ్రహించిన సోమిరెడ్డి తన మనోభావం వ్యక్తం చేశారు. అవునవును.. లోకేష్‌కు ఏం తక్కువ? ఆయన డీసీఎంకు అన్ని విధాలా అర్హుడేనని ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సైతం, లోకేష్ డీసీఎంకు అర్హుడేనని చెప్పారు. ఈ జోరు చూస్తుంటే.. ఇక రేపటినుంచి రోజుకో సీనియర్-జూనియర్ నేతలు, రేసులో వెనుకడకూడదన్న ఆత్రుతతో, లోకేష్‌కను డీసీఎం చేయాలని గళమెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది సీనియర్ల అంచనా.

అయితే ఇది జనసైనికుల్లో వ్యతిరేక సంకేతం వెళ్లడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహాసేన రాజేష్, శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను.. టీవీ చర్చలకు హాజరైన ఏ జనసేన నేత ఆహ్వానించకపోవడం గమనార్హం. పైగా సోషల్‌మీడియాలో మా పవన్‌కు పోటీ పెడతారా? ముందు ఒక్క డీసీఎం అని చెప్పి, ఇప్పుడు పవనన్నకు పోటీగా లోకేష్‌ను తీసుకువస్తారా? అంటూ ఆగ్రహంతో పోస్టింగులు పెడుతున్న తీరు, కూటమిలో ఆందోళనకు కారణమవుతోంది.

కూటమిలో సఖ్యత వర్ధిల్లుతూ, కలసి సాగుతున్న ఈ సమయంలో ఇలాంటి అనవసర చర్చ అవసరమా? అన్న భావన కూటమిలో మొదలయింది. అసలు ఇలాంటి చర్చకు తెరలేపడమంటే, వైసీపీకి బ్రహ్మాస్త్రం అందించడమేనంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత వ్యాఖ్యలతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ బాగానే పనిచేస్తున్నారు. ఆయన తన అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నారు. ఆయన పనితీరుతో అధికారుల్లో భయం మొదలయింది. పవన్ వైఖరిని టీడీపీ క్యాడర్ కూడా బలపరుస్తోంది.

తమ పార్టీ చెప్పలేని విషయాలను కూడా పవన్ చెబుతున్నారని సంబరపడుతోంది. అటు పవన్ సైతం బాబు సమర్థను పొగుడుతున్నారు. ఈ పరిస్థితిలో లోకేష్‌కు డీసీఎం పద విపై చర్చకు తెరలేపడమంటే, వైసీపీకి అస్త్రాలు అందించడమేనని టీడీపీ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి.

కూటమిలో మనస్పర్ధలు రేపి, ఎప్పుడు దానిని విచ్చిన్నం చేద్దామా అని కాచుకుకూర్చున్న వైసీపీకి, తాజా పరిణామాలు అనుకూలంగా మారిందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘‘ఇప్పుడు వైసీపీ సోషల్‌మీడియాకు మా పార్టీకి-జనసేనకు మధ్య అగ్గిరాజే అవకాశం వచ్చింది. మా రెండు పార్టీ నేతల పేరుతో వారిష్టం వచ్చిన పేర్లు-కులాలతో పోస్టింగులు పెట్టినా ఆశ్చర్యం లేదు. అందుకే వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నదే మా కోరిక’’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

యువనేత లోకేష్ రాణించేందుకు ఇంకా సమయం ఉందని, ఆయన పార్టీ అధినేత-డిప్యూటీ సీఎం పదవికి అర్హుడైనప్పటికీ ఇది సమయం కాదంటున్నారు. జనసేనతో కలసినందున విజయం వరించిందన్న భావన సర్వత్రా ఉన్న సమయంలో, లోకేష్‌కు పవన్‌కు పోటీగా డీసీఎంను చేస్తారన్న ప్రచారం, జనసైనికులకు వేరే సంకేతాలు పంపిస్తాయని విశ్లేషిస్తున్నారు.

‘‘నిజానికి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ బాబు జనసేన అధిపతి పవన్‌కు గౌరవం ఇచ్చేందుకు, ఆయన ఫొటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టిస్తున్నారు. గతంలో ఇదే హోదాలో పనిచేసిన సీనియర్ నేత కెఇ కృష్ణమూర్తి, చినరాజప్పకు ఇలాంటి గౌరవం దక్కలేదు. మహారాష్ట్రలో ఫడ్నవీస్, తెలంగాణలో భట్టి విక్రమార్క, కర్నాటకలో డికె శివకుమార్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. జగన్ ఐదుగురిని నియమించినా, వారికి ఎలాంటి ప్రాధాన్యం లేదు. లోకేష్ ఆ హోదాకు కచ్చితంగా అర్హుడే. కానీ అది కూటమిలో చర్చించి తీసుకోవలసిన నిర్ణయం. అలాంటిదేమీ లేకుండానే, పొలిట్‌బ్యూరో సభ్యులే మాట్లాడటం వల్ల అది టీడీపీ నాయకత్వ కోరిక. వారితో కావాలే మాట్లాడించారన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతాయ’‘ని మాజీ మంత్రి ఒకరు విశ్లేషించారు.

ఇప్పుడు లోకేష్ సూచించిన వారికే పదవులిస్తున్నారన్న ప్రచారం ఉన్నందున, కొత్తగా తెరపైకి వచ్చిన డిమాండును దృష్టిలో ఉంచుకున్న నేతలంతా.. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు, కొత్త డిమాండును పోటీలు పడి బలపరుస్తున్నారన్న భావన కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదంటున్నారు. అయితే గత ఎన్నికల ముందు నుంచి పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యం లేకుండా చేసినందుకే, ఇలాంటి పరిస్థితి ఏర్పండిదన్న అభిప్రాయం సీనియర్లలో వ్యక్తమవుతోంది. గతంలో పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పొలిట్‌బ్యూరోలో చర్చించి తీసుకునే వారని గుర్తు చేస్తున్నారు.

కానీ గత ఎన్నికల ముందు నుంచి తమ పార్టీ కూడా ైవె సీపీ, టీఆర్‌ఎస్ బాటలో నడుస్తోందన్న వ్యాఖ్యలు సీనియర్లలో వ్యక్తమవుతోంది. నిర్ణయం తీసుకున్న తర్వాతనే తమకు తెలుస్తోందన్న అసంతృప్తి కనిపిస్తోంది. అదే మునుపటి మాదిరిగా సమిష్టి నిర్ణయాలు-చర్చల వాతావరణం ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, ఒకవేళ వచ్చినా దానిని ఎలా అధిగమించాలో పొలిట్‌బ్యూరో దిశానిర్దేశం చేసేదంటున్నారు.

ఇలాంటి కొత్త సమస్యల వల్ల కూటమిలో అభిప్రాయబేధాలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనసైనికుల పోస్టింగులు.. ఇప్పటికే జనక్షేత్రంలో చర్చనీయాంశమవుతున్నందున, ఈ అంశానికి తార్కిక ముగింపు పలకకపోతే, అది నిస్సందేహంగా కూటమిపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. కూటమి మరో పదేళ్లు అధికారంలో కొనసాగి.. యువనేత లోకేష్ పార్టీ పగ్గాలు అందుకుని, బాబు వారసుడిగా ఉండాలంటే.. ఇలాంటి గందరగోళ వాతావరణానికి తెరదించాల్సిందేనంటున్నారు.

పైగా లోకేష్‌కు డిప్యూటీ సీఎం డిమాండ్ తెరపైకి వచ్చిన సందర్భంలో.. తమ పార్టీకీ డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న కొత్త కోరికను, బీజేపీ నేతలు బయటపెడుతున్నారు. నిజానికి అసలు తొలుత పవన్ కంటే ముందు బీజేపీకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒప్పందం ఉండేది. కానీ పవన్ పట్టుపట్టడంతో, బీజేపీ వెనక్కి తగ్గిన ఫలితంగా పవన్‌కు ఆ హోదా దక్కిందని బీజేపీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ లోకేష్‌కు డీసీఎం ఇస్తే, కేంద్రం నుంచి రెండులక్షల కోట్లు సాయం చే స్తున్న బీజేపీకి ఎందుకు డీసీఎం పదవి ఇవ్వరన్న వాదన కమలదళాల్లో మొదలయింది. ఇదో సంకట పరిస్థితి.

అయితే.. ఇలాంటి చర్చ-డిమాండ్ల వల్ల కేంద్రం నుంచి వచ్చిన నిధులు-ప్రాజెక్టుల ప్రచారం, పక్కదారి పడుతోందన్న ఆందోళన కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ‘‘ అమరావతి నిర్మాణాలకు కేంద్రం నిధులిచ్చింది. విశాఖను రైల్వేజోన్‌గా ప్రకటించింది. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్యాకేజీ ఇచ్చింది. వీటిని జనంలోకి తీసుకువెళ్లే సమయంలో, ఇలాంటి అనవసర చర్చ పెట్టడం అవసరమా? గతంలో కూడా మేం చేసినవి చెప్పుకోకుండా, కేవలం జగన్‌ను తిట్టడానికే ప్రాధాన్యం ఇచ్చి ఓడిపోయాం. ఇప్పుడూ అదే దారిలో వెళ్లడం మంచిది కాద’ని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.

LEAVE A RESPONSE