– రాజకీయాలు కమ్మవారిని కాపాడలేకపోతున్నాయి
– ఏ విపత్తు వచ్చినా సింహభాగం విరాళాలు కమ్మవారివే
– రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
– కొసరాజు వారి ఆత్మీయ సమావేశంలో మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు
విజయవాడ: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కమ్మ ద్వేషి. ఆయన కమ్మ వ్యతిరేక పాలిసీని తీసుకువచ్చారు. అప్పట్లో వైఎస్ నాటిన కమ్మ వ్యతిరేక మొక్క.. జగన్ సీఎం అయ్యేనాటికి విషవృక్షంగా మారింది. జగన్ కమ్మ అధికారులను టార్గెట్ చేశారు. నాకు పోస్టింగ్ లేకుండా వేధించారు. 2004 నాటి నుంచి కమ్మవారిని రాజకీయాలు కాపాడలేకపోతున్నాయి. వారిపై అభిమానం ఉన్నా భయంతోనో, మొహమాటంతోనే న్యాయం చేసేందుకు భయపడుతున్నాయి. ఇదీ కమ్మవారి పరిస్థితి. కాబట్టి మేలుకోండి. కమ్మవారిని ఎవరూ కాపాడరు. మీ కష్టమే మీకు శ్రీరామరక్ష’’
– ఇవీ.. రిటైర్డ్ డీజీ, మాజీ సీఎం జగన్ బాధితుడయిన ఏబీ వెంకటేశ్వరరావు చేసిన సంచలన వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
విభజన తర్వాత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించారన్న కక్షతో, ఏబీకి ఐదేళ్లు పోస్టింగ్ లేకుండా చేసిన నాటి సీఎం జగన్‌పై ఏబీ చేసిన న్యాయపోరాటం ఫలించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాధితుడైన ఏబీకి పిలిచి పెద్దపీట వేస్తారని భావించిన వారిని నిరాశే మిగిలింది.
ఎన్నికల సమయంలో ఏబీ సహ బాధితుడయిన, నాటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠాకు విజిలెన్స్ కమిషనర్ పదవి ఇవ్వగా.. జగన్ ఐదేళ్ల జమానాలో, టీడీపీసేవ చేశారన్న ఆగ్రహంతో బలిపశువును చేసిన ఏబీకి మాత్రం, ఇప్పటిదాకా ఎలాంటి పదవి ఇవ్వకపోవడం టీడీపీ వర్గాలను అసంతృప్తికి గురిచేస్తోంది. అటు ఏబీ కూడా ఇటీవలి కాలంలో కమ్మ సంఘాల వేదికలపై, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టడం చర్చనీయాంశమయింది.
తాజాగా విజయవాడ అమ్మ కల్యాణమండంలో జరిగిన కొసరాజు వారి ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఏబీ వెంకటేశ్వరరావు ఇంకా ఏమన్నారంటే.. నా 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేశా.
2004 లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీని తెచ్చి , దాన్ని స్టేట్ పాలసీ గా మార్చారు. రాజశేఖర రెడ్డి నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారింది. అప్పటి నుంచి కమ్మ అధికారులు టార్గెట్ గా అణచివేతకు గురి చేశారు.
కమ్మ వారి పై యుద్ధమే ప్రకటించినట్లు వైసీపీ అధినేత వ్యవహరించాడు. 2019 లో అధికారంలోకి వచ్చిన మర్నాడే నాకు ఉద్యోగం లేకుండా చేశారు. పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారు. నా కెరీర్ లో నేను ఊహించని మచ్చ ను నాకు వేయాలని చూశారు, కానీ చట్టం, న్యాయం రెండు నన్ను నిప్పుగా నిలబెట్టాయి.
కరోనాకు, వాక్సిన్ కు, ఎలక్షన్ కమిషనర్ కు కులం రంగు పూసి విచక్షణా రహితంగా వ్యవహరించారు.2004 నుంచి రాజకీయాలు కమ్మ వారిని కాపాడ లేక పోతున్నాయి. కమ్మ వారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నా కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావు.
వరదలు వచ్చినా, వైపరీత్యాలు వచ్చినా 75 శాతం విరాళాలు కమ్మ వారివే. సామాజిక వర్గంతో పాటు సమాజానికి సైతం అందరూ తోడ్పడాలి.