– 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేస్తాం
– ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం మాది
– నాణ్యమైన విద్యుత్ ను రాష్ట్రంలో సరఫరా చేస్తున్నాం
– సోలార్ పవర్ ద్వారా రాష్ట్రంలోని రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజలకు ఆదాయం సమకూరే లా చర్యలు చేపట్టాం
– బిఆర్ఎస్ నేతలు రుణమాఫీ పై మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది
2 లక్షల రుణమాఫీ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయము
– రైతు బీమా, పంటల బీమాకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది
– భూ నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి నిధులు మంజూరు
పెద్దపల్లి జిల్లా ధర్మారం బహిరంగసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
పెద్దపల్లి: 2029-30 వరకు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అన్న వాళ్లకు చెంప దెబ్బ కొట్టిన మాదిరిగా రెప్పపాటులో కూడా కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్తును రాష్ట్రంలో అందిస్తున్నామని తెలిపారు.
ధర్మారం పరిసర ప్రాంతాల్లో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మొత్తం 18 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం ఆనందకరమైన విషయం అన్నారు. రైతులకు భూమితో విడదీయరాన్ని సంబంధం ఉంటుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడం ఒకటే కాదు.. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారిని త్యాగధనులుగా గుర్తిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 25 నుంచి 30 గ్రామాల వరకు పైలట్ పద్ధతిన సాచిరేషన్ మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతుల పంపుసెట్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంటలతోపాటు పవర్ తో కూడా కొంత ఆదాయం వచ్చేలా.. రైతులు ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం, కొద్ది రోజుల్లో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ పెట్టి ఇళ్లకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడమే కాకుండా.. అదనపు విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలుపుతామన్నారు. గత పాలకులు మూలన పడేసిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ను సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పదివేల కోట్ల పెట్టుబడితో.. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తో త్వరలోనే రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ కు భూమి పూజ చేయనున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల కోసం పనిచేస్తుందన్నారు. రైతు రుణమాఫీ కోసం 15 రోజుల వ్యవధిలోనే 18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది అన్నారు. దేశ చరిత్రలోనే ఈ సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు.
రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయమని అన్నారు. అవసరమైతే రెండు లక్షలకు పైగా ఋణం ఉన్న రైతులు ఆ పై మొత్తాన్ని కట్టుకుంటే, రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత పాలకులకు ఐదేళ్లు కాదు .. పదేళ్లు పాటు అధికారం ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. వారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.
మా ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ కే పరిమితం కావడం లేదు.. రైతు బీమా, పంటల బీమా పథకాలను ఆచరణలోకి తెస్తుందన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి పక్షాన ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లిస్తుంది అన్నారు. ప్రకృతి వైపరీత్యం సంభవించి పంట నష్టం జరిగితే.. రైతును కంటికి రెప్పలా కాపాడుకునేందుకు, ప్రభుత్వం పంటల భీమా పథకాన్ని చేపట్టిందన్నారు. రైతుల పక్షాన పంటల బీమా ప్రీమియం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు.
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కావాలని పాదయాత్ర సమయంలో అడిగారు తాజా బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు చోటు కల్పించినట్టు తెలిపారు. మందల వాగు- ఎల్లంపల్లి మధ్య ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడానికి సబ్ స్టేషన్ మంజూరు చేయాలని కోరారు. ఆ సబ్ స్టేషన్ ను వెంటనే మంజూరు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కోరిక మేరకు నియోజకవర్గంలోని మేడారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలం చూపించినందున స్థానికంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31.69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 5 సబ్ స్టేషన్ లకు శనివారం డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.