Suryaa.co.in

Editorial

‘తెలుగుదేశం తిమ్మరసు’.. తొండెపు దశరధ జనార్దనుడు!

– విపక్షమైనా.. అధికారపక్షంలో ఉన్నా ఆయనదే కీలకపాత్ర
– అధినేత చంద్రబాబుకు నమ్మినబంటు
– పదవులతో పనిలేకుండా పనిచేసే అనుసంధానకర్త
– గత ఎన్నికల ముందు తెరవెనక పాత్రధారి ఆయనే
– మైనారిటీ, మాదిగ, బీసీ, పెన్షనర్లు-ఉద్యోగ సంఘాలతో సమన్వయం
– ఎన్టీఆర్ అభిమానులకు శతజయంతి సభలతో మేల్కొలుపు
– బాబు అరెస్టు సమయంలో ఆందోళనల వెనక ఆయనే సూత్రధారి
– హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులను రోడ్డెక్కించిన వ్యూహకర్త
– అయినా లోప్రొఫైల్ లీడర్‌గానే కొన సాగే ‘కార్యకర్తల నేత’
– మళ్లీ విజయసాయితో మంతనాల పేరుతో తెరపైకి
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘జగన్ పక్కన టిడి జనార్దన్ లాంటి వాళ్లు ఒక్కరున్నా సరిపోతుంది’’- ఇది ఎవరో జనార్దన్ మేలుకోరే వ్యక్తుల కామెంట్ కాదు. వైసీపీవిపక్షంలో ఉండగా ఆ పార్టీని-జగన్‌ను జనంలోకి తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించిన ‘గ్రేట్‌ఆంధ్ర’ అనే పత్రిక రాసిన విశ్లేషణ.

చాలామంది రాజకీయ నాయకులు రవ్వంత పనిచేసి కొండంత పబ్లిసిటీ చేసుకుంటారు. మరికొందరు కొండంత పనిచేసి, కొంచెం కూడా పబ్లిసిటీ కోరుకోకుండా గుంభనంగా తమ పని తాము చేసుకుపోతుంటారు. అంటే పూర్తి లోప్రొఫైల్‌లో ఉంటారన్నమాట. ఈ జాబితాలో ‘తెలుగుదేశం తిమ్మరసు’.. తొండెపు దశరధ జనార్దన్ ఒకరు. టీడీ జనార్దన్.. టీడీగా తమ్ముళ్లు పిలుచుకునే జనార్దన్ పేరు ఇప్పుడు.. విజయసాయిరెడ్డి-ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మంతనాల్లో తెరపైకి వచ్చి, టీవీ చర్చలతో హాట్‌టాపిక్‌గా మారింది. ఎప్పుడూ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటుగా తెరవెనక ఉంటూ, సమన్వయం నెరిపే టీడీ జనార్దన్ పేరు, ఇలా బహిరంగంగా చర్చకు రావడం ఇదే తొలిసారి.

సోలిపేట రామచంద్రారెడ్డి, చొక్కాపు సూర్యనారాయణ తర్వాత పార్టీ ఆఫీసు ఇన్చార్జి ఎవరన్న కసరత్తు నేపథ్యంలో, ఆప్కాబ్ చైర్మన్‌గా పనిచేసిన టిడి జనార్దన్‌ను చంద్రబాబునాయుడు ఎంపిక చేసుకున్నారు. పార్టీ ఆఫీసు ఇన్చార్జి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య సమన్వయం, జిల్లా పార్టీల్లో పంచాయతీల పరిష్కారం, విపక్షాలపై ఎదురుదాడికి సమర్ధులైన నేతలను ఎంపిక చేసి వారిని మీడియా ముందుకు పంపించడం, సీనియర్లతో సమన్వయబాధ్యతలు. వీటికిమించి.. ప్రతిరోజూ అధినేత చంద్రబాబు వద్దకు ఉదయమే హాజరయి, ఆరోజు వ్యూహాలను రచించాల్సిన బాధ్యత. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోంది అన్న సమాచారంతోపాటు.. అధినేత ఆదేశాలను కింది స్థాయి వరకూ చేర్చాల్సిన బాధ్యత కూడా పార్టీ ఆఫీసు ఇన్చార్జిదే.

ప్రతిరోజూ అధినేతతో వీడియా/టెలీకాన్ఫరెన్సుల్లో పాల్గొనడ ం, మళ్లీ జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలతో సొంతంగా టెలీకాన్ఫరెన్సులు.. ప్రతిరోజూ తన వద్దకు వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల సమస్యలకు స్పందించి అధికారులకు నేరుగా ఫోన్లు చేయటం. ఇలా ఊపరిసలపనంత పని ఆఫీస్ ఇన్చార్జిది. అలాంటి ఆఫీసు ఇన్చార్జి పాత్రను టీడీపీ చరిత్రలో ఎక్కువకాలం పోషించిన ఏకైక నాయకుడు టీడీ జనార్దన్ ఒక్కరే.

రాష్ట్రంలో టిడి గురించి తెలియని టీడీపీ కార్యకర్త లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన పార్టీ ఆఫీసులో ఉన్నారంటే సమస్యల చిట్టాతో వచ్చే కార్యకర్తల సంఖ్యకు లె క్కలేదు. కలెక్టర్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ వరకూ, ఎవరికైనా కార్యకర్తల కోసం ఫోన్ చేస్తుంటారు. పార్టీ కోసం పోరాడే కార్యకర్తల కోసం, వారిని అధినేత వద్దకు సైతం తీసుకువెళతారాయన. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఆయన మధ్యాహ్నం ఒక అరగంట టేబుల్‌పైనే పడుకుంటూ కనిపించేవారు. అంతబిజీ.

అలాంటి టిడి.. అధినేత ఆదేశాలతో గత ఎన్నికల ముందు సవ్యసాచిలా పనిచేశారు. చకచకా పావులు కదిపారు. రెండో కంటికి తెలియకుండా వివిధ మత పెద్దలు, కులసంఘాల నేతలతో వారి ఇంటికి వె ళ్లి మంతనాలు సాగించారు. ఎవరికి ఇవ్వాల్సిన హామీలు వారికి ఇచ్చి, పార్టీకి మద్దతు కూడగట్టారు. మళ్లీ వారిని అధినేతతో రహస్యంగా భేటీ వేయించి, సంతృప్తిపరిచేవారు. బయట అయితే ఇది మంత్రసానితనం. రాజకీయాల్లో అయితే సమన్వయం!

ఎన్నికల ముందు ముస్లిం వర్గాలు 70శాతం వైసీపీ వైపే ఉన్నారన్నది నిష్ఠుర నిజం. దానితో జాతీయ స్థాయిలో ఆ వర్గంపై ప్రభావితం చూపే కీలక నాయకులతో మంతనాలు జరిపి.. వారిని ఎన్నికల ముందు అన్ని జిల్లాలు పంపించి, బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీకి ఓటు వేయించేలా సమన్వయం నెరిపిన ఘటన టీడీదే. బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించే ముస్లిం సంఘాలతో, అదే బీజేపీ ఉన్న కూటమికి ఓటు వేయించడం చిన్న విషయం కాదు. దానికి చాలా ఓర్పు, నేర్పు, చాణక్యం, లౌక్యం కావాలి.

ఆలిండియా తన్జీం ఏ ముప్తియాన్, ఉలేమా కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జమాత్ ఏ ఉలేమా, సౌతిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆలిండియా సుఫి కౌన్సిల్, జమియత్ ఉలేమా ఏ హింద్, జాతీయ ఇమామ్ కౌన్సిల్ వంటి ఏడు కీలక సంస్థల ప్రతినిధులతో.. జగన్ సర్కారు నిఘా దళాల కన్నుపడకుండా, బాబుతో భేటీలు వేయించిన కార్యదక్షుడు టిడి.
ఇక గత ఎన్నికల ముందు మాదిగలు టీడీపీ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, వారికి నాయకుడు లే డు. అంతకుముందు వివిధ కారణాలతో దూరమై, టీడీపీ సర్కారుపై యుద్ధం చేసిన మందకృష్ణమాదిగ దూరమై.. మాలలు పూర్తిగా వైసీపీ వైపు మొగ్గుచూపిన పరిస్థితి.

అలాంటి సంకట పరిస్థితిలో.. స్వయంగా చంద్రబాబునాయుడునే మంద కృష్ణ మాదిగ ఇంటికి తీసుకువెళ్లటం.. అక్కడి నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతు.. అది టీడీపీకి బహిరంగ మద్దతుకు దారితీయడం వంటి పరిణామాలకు తెరవెనక పాత్రధారి టీడీనే. అదే సమయంలో మాల సంఘాలనూ సమన్వయ పరిచి, వారిని జిల్లాలకు పంపి పార్టీ ప్రచారం చేయించిన సవ్యసాచి.

ఇక దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాను బాబు ఇంటికి తీసుకురావడం నుంచి.. ఆయనను జిల్లా పర్యటనలు చేయించిన సమన్వయకర్త కూడా టీడీనే.

జగన్ సర్కారు ప్రతినెల సక్రమంగా జీతం- పెన్షన్ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో అప్పటివరకూ ఉన్న అసంతృప్తిని ఆగ్రహంగా మార్చి, వారిని జగన్ సర్కారుపై అస్త్రంగా సంధించిన చంద్రబాబు వ్యూహానికి అనుసంధానకర్త టీడీనే. ఈవిధంగా గత ఎన్నికల ముందు కులాలు, మతాలకు చెందిన ప్రతినిధులను అస్త్రంగా సంధించి.. వారి సేవలను పార్టీకి వినియోగించడమే కాదు. గెలిచిన తర్వాత పార్టీకి పనిచేసిన అలాంటి వారిని చంద్రబాబుకు వద్దకు తీసుకువెళ్లి, కృతజ్ఞతలు చెప్పించిన మానవతావాది. చాలామంది పనిచేయించుకుని అవసరం తీరిన తర్వాత వదిలేస్తారు. టిడి వైఖరి అందుకు విరుద్ధం. ఇక టీడీపీ విజయాన్ని మలుపు తిప్పిన చంద్రబాబునాయుడు అరెస్టు అనంతర పరిణామాల్లో, లోకేష్ న్యాయపరమైన ప్రక్రియలో బిజీగా ఉంటే.. ఆందోళన కార్యక్రమాలు, సోషల్‌మీడియా సైన్యాలను కదిలించి, బాబుకు దేశ విదేశాల్లో సానుభూతి తెప్పించిన యుద్ధానికి తెరవెనక సైన్యాధ్యక్షుడు జనార్దనుడే.

నిజానికి అంతకుముందు నాలుగేళ్లు జగన్‌ను విమర్శించేందుకు ఎవరికీ దమ్ము లేని పరిస్థితి. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో తెలియని భయాందోళన. ఆ భయంతో రాష్ట్రం వదిలి వ్యాపారాలు చేసుకున్న వారిలో ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలయిన వారూ లేకపోలేదు. అలాంటి విషమ పరిస్థితిలో జగన్‌పై యుద్ధానికి తొడగొట్టి సవాల్ చేసిన నాటి ఎంపి రఘురామకృష్ణంరాజు మినహా, వైసీపీని ఎదిరించిన మొనగాడెవరూ లేరు. సూటిగా చెప్పాలంటే.. టీడీపీ-జనసేనలు జనక్షేత్రంలోకి వెళ్లేందుకు ఊపిరిలూది, చివరకు తన ప్రాణాలనే పణంగా పెట్టి, కూటమికి మనోధైర్యం కల్పించిన సిపాయి రఘురామరాజే అన్నది మనం మనుషులం అన్నంత నిజం.

బాబు జైలులో ఉన్న సమయంలో ప్రపంచంలోని తెలుగువారందరిలో చైతన్యం రగిలించిన సోషల్‌మీడియాకు, మార్గదర్శిగా వ్యవహరించిన టీడీ.. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులను రోడ్డెక్కించడమేకాదు.. మెట్రోరైళ్లలో ఆందోళనలు జరిపించడంలో కీలకపాత్ర పోషించారు. గచ్చిబౌలిలో ఎవరూ జన సమీకరణ చేయకుండానే వేలాదిమంది ఐటి నిపుణులు రావడం అప్పటి కేసీఆర్ సర్కారుకూ షాకిచ్చింది. ఆ ఆందోళనలకు వ చ్చిన స్పందన చూసిన చంద్రబాబుకు.. తను ఇంత శక్తివంతుడనన్న విషయం బహుశా ఆయనకే తెలియకపోవచ్చు.

అదే ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమానులను ఏకం చేసిన ఘనత జనార్దనుడిదే. ఎన్నికల ముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరుతో.. రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి రజనీకాంత్ రావడం కీలక మలుపు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన పుస్తకాలు.. బాలకృష్ణ ఇచ్చిన దన్నుతో, దేశ విదేశాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభించింది. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన 57 మందిని, ఒకే వేదిక మీదకు తీసుకురావడం జనార్దన్‌కే చెల్లింది.

ఇలా కొన్నేళ్లపాటు పార్టీ కోసం గుంభనంగా ఇన్ని తెరచాటు మంతనాలు నిర్వహించినప్పటికీ.. పార్టీలోని కొందరు కీలకనేతలకు మినహా, టిడి పేరు ఎప్పుడూ బయటకు రాలేదు. అయితే తాజాగా వైసీపీలో జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేసి బయటకొచ్చిన విజయసాయిరెడ్డితో, టిడి జనార్దన్ మంతనాలు చేసిన తర్వాతనే.. విజయసాయి మీడియా వద్ద తొలిసారి విమర్శల వర్షం కురిపించారన్న చర్చతో.. ఇప్పటివరకూ తెర వెనక పనిచేసే టిడి జనార్దన్ పేరు, ఒక్కసారి తెరపైకొచ్చేందుకు కారణమయింది.

దానిపై వైసీపీ అధికార ట్విట్టర్ ఖాతా నుంచే రాద్ధాంతం చేసింది. ‘‘విజయసాయి-టిడి జనార్దన్ కలిసి హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరావు ఇంట్లో మంతనాలు సాగించారు. ముందు విజయసాయిరెడ్డి ఫలానా సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికి టిడి జనార్దన్ వచ్చారు. తర్వాత విజయసాయి ఫలానా సమయంలో బయటకు వస్తే, టిడి జన్దారన్ ఫలానా సమయంలో బయటకు వచ్చారు. టిడి జనార్దన్‌ను కలిసిన తర్వాతనే విజయసాయి జగన్‌పై మీడియాతో మాట్లాడారు’’-ఇదీ వైసీపీ చేసిన ట్వీట్.

అందులో విజయసాయి-టిడి వచ్చి వెళ్లిన వీడియో కూడా ఉంచారు. దీనితో టిడి జనార్దన్ కేంద్రంగా చానెళ్లలో చర్చల రచ్చ మొదలయింది. ఫలితంగా తెరవెనక ఉండే జనార్దన్, తెరపైకి రావాల్సి వచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే… అధికారంలోకి వచ్చి ఏడాది అయినా తనకు ఎలాంటి పదవి రాకపోయినా, పట్టించుకోకుండా మహానాడులో ఎన్టీఆర్ ఎగ్జిబిషన్‌ను తొలిసారిగా డిజిటలైజేషన్ చేయించడం, సమన్వయంలో బిజీ అవడం!

LEAVE A RESPONSE