Suryaa.co.in

Andhra Pradesh

వేపాడలో గిరి‘జన గర్జన’

– గిరిజనాగ్రహానికి అదానీ సిబ్బంది పీఛేముడ్
– అదానీ హైడ్రో పవర్‌ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలి
– మేం ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించిన గిరిజనులు
– అధికారులను రానీయకుండా పొలిమేర్లలోనే అడ్డగింత
– మాకు మీ సహాయం వద్దంటూ నిరసన
– ఒక దశలో అధికారులు, అదానీ సిబ్బందిపై దాడికి సిద్ధం
– వేపాడలో మోహరించిన పోలీసులు
( చల్లా జగన్నాధం)

విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గ్రామంలో అదానీ స్థాపించబోయే పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన గిరిజనగర్జనకు అధికారులు, అదానీ సిబ్బంది తోకముడిచి వెళ్లిపోవలసి వచ్చింది.

‘మేం ఇక్కడే ఉంటాం. ఇంచి కూడా కొండపైనుంచి కదిలేది లేదు. మీకు చేతనయింది మీరు చేసుకోండి. మీరు మమ్మల్ని బాగుచేయాల్సిన అవసరం లేదు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ గిరిజనం తిరగబడిన ఘటన సంచలనం సృష్టించింది. ఒకదశలో గ్రామ పొలిమేర్లలోనే అధికారులు, అదానీ సిబ్బందిని కొట్టేందుకు గిరిజనులు సిద్ధమయ్యారు. దీనితో పోలీసులు గ్రామంలో మోహరించాల్సిన పరిస్థితి.

35 రోజులుగా మారిక గిరిజనులు మా భూములను మా గ్రామాన్ని అదానీకి అప్పగించవద్దని కలెక్టర్ దగ్గర నుంచి సచివాలయం వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తాజాగా జరిగిన తిరుగుబాటు, అదానీ సిబ్బందిని వెనక్కిపంపేలా చేసింది.

ఉదయం మండల అధికారులు అదానీ సిబ్బందిని, పోలీస్ సిబ్బంది సహకారంతో తీసుకొని మారిక వెళ్లి సర్వేచేసి సమావేశం పెట్టి.. సామాజిక అధ్యయనం సర్వే అయిపోయింది అనిపించాలని చేసిన ప్రయత్నాన్ని మారికే గిరిజనులందరూ మూకుమ్మడిగా అడ్డుకున్నారు. అవసరమైతే వారిని పొలిమేరలోనే తరిమేసేందుకు తాలును సిద్ధం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ముందుగా చేరుకున్న పోలీస్ సిబ్బందిని ఎంపీడీవోను , ఎమ్మార్వో తో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది ఆ సిబ్బందితో వస్తున్న అదానీ సిబ్బందిని , సామాజిక అధ్యయనం పేరుతో వస్తున్న వారిని ఇంచు కూడా కదలనివ్వకుండా సుమారు మూడు గంటలకు పైనే రోడ్డుపై అడ్డుకున్నారు.

మారిక యువకులు మాట్లాడుతూ, మా గ్రామాన్ని,, మా పొలాలను మా భూములను ఆదానీకు ఇచ్చే ప్రసక్తే లేదు. మాకు ఎటువంటి సర్వేలు, సమావేశాలుపెట్టొద్దు. వచ్చిన అధికారులందరూ కొండ దిగి వెంటనే వెళ్లి పోవాలని మూడు గంటల పాటు నినాదాలు చేశారు. మా గిరిజనుల మనోభావాలను అర్థం చేసుకోవాలని, అధికారులను ముక్తకంఠంతో కోరారు. గిరిజనను కొండపైనే బతకగలమని.. ప్రకృతి వనరులే మాకు సంపదని, ఈ ప్రకృతిని కొండను విడిచి పెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

సర్వే సిబ్బంది, అదానీ సిబ్బంది, ఎమ్మార్వో, ఎంపీడీవోలు
మీకు న్యాయం చేస్తామని బుజ్జగించగా.. పులి మేకలకు న్యాయం చేస్తుందా అని గిరిజనులు ఎదురు ప్రశ్నించారు.

ఎలాగైనా సమావేశం నిర్వహించాలని అదానీ సిబ్బందితోపాటు, ప్రభుత్వ అధికారులు పట్టుపట్టారు. ఒక దశలో గిరిజనులను గద్దించగా.. రెచ్చిపోయిన గిరిజనులు అంతకు రెట్టింపు గొంతుతో తిరగబడ్డారు. దానితో విధిలేక అధికారులు, అదానీ సిబ్బంది కొండ దిగి వెళ్లాల్సివచ్చింది.

ఈ ఆందోళనలో మారిక గ్రామ నాయకులు జాలరి వీర్రాజు , గెమ్మెల బాబురావు, అప్పలనాయుడు, సోమేశ్ , శ్రీను,ఆసు వెంకటరావు గణేష్, దేవుడు కిలో ఆనంద్ , శోభన్ బాబు బుజ్జి బాబు తదితరులు పాల్గొన్నారు.

అదానీ తరఫున ఎమ్మార్వో రాములమ్మ, హెచ్ డి టి సన్యాసినాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎంపీడీవో సూర్యనారాయణ, వల్లంపూడి ఎస్సై ఏ ఎస్ ఐ తో పాటు అదానీ సిబ్బంది, సామాజిక అధ్యయనం పేరుతో వచ్చిన సిబ్బంది మారిక కొండపైకి వెళ్లారు.

LEAVE A RESPONSE