అగ్రిగోల్డు వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– ఒక్క నయా పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా?
– సీఎం జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

విజయవాడ : అధికారంలోకి వచ్చిన అరుమాసాల్లో అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.మూడున్నర సంవత్సరాలు దాటినా ఎందుకు పరిష్కరించలేదు.అగ్రిగోల్డ్ సంస్ధ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లింపు చేయక పోవడంతో 142 మంది మృతి చెందారు. అప్పటి ముఖ్యమంత్రి మూడు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానంటే ఆనాడు మీరు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క నయా పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా?పదివేలు లోపు పరిధి ఉన్న బాండ్లుకు 2019 సంవత్సరంలో 250 కోట్లు, 2021 ఆగస్టులో 667 కోట్లు మేరకు మాత్రమే బాండ్లు పరిష్కారం జరిగింది. ఆ తర్వాత ఒక్కరికి కూడా బాండ్లు పరిష్కారం కాలేదు.అగ్రిగోల్డ్ భాదితులు సుమారు 14 లక్షల మంది తమ బాండ్లకు ఎప్పుడు నగదు పరిష్కారం జరుగుతుందని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు చూస్తున్నారు.

20 వేల లోపు అగ్రిగోల్డు బాండ్లను కూడా పూర్తిగా పరిష్కారం చేయక పోవడంతో, బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.అగ్రిగోల్డ్ సంస్ధ నడుపుతున్న ఇతర సంస్ధలు యధావిధిగా నడుస్తున్నాయి. వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడంలేదు. మరో వైపు అగ్రిగోల్డులో నగదుమదుపు చేసి బాండ్లు తీసుకున్న వారి సమస్య పై మీ ప్రభుత్వం నోరుమెదపడం లేదు. మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ వ్యవహారం పై ఎంతవరకు నగదు పరిష్కారాలు చేసిందీ శ్వేత పత్రం విడుదల చేయాలి.