Suryaa.co.in

Editorial

ఏబీతో నష్టం ఎవరికి?

  • ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయ అరంగేట్రం

  • రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన

  • దళితుల అడ్డా వేదికగా ఏబీ సాహసం

  • పార్టీ పెడతారా? ఎందులోనయినా చేరతారా?

  • లేక జెపి, జెడిలా సొంత దారిలో నడుస్తారా?

  • జగన్‌పై యుద్ధానికి సమర శంఖం

  • జగన్‌ను ఎదిరించిన వీరుడు, బాధితుడిగా ఏబీకి ఇమేజ్

  • ఏబీకి కూటమి అన్యాయంపై కమ్మ వర్గం గుర్రు

  • జగన్‌పై ఇప్పటికే కూటమి యుద్ధం

  • మరి కొత్తగా ఏబీ సాధించేదేమిటి?

  • ఆయన వల్ల ఏ పార్టీకి నష్టం?

  • ఇప్పటికే జగన్‌ను శిక్షించిన జనం

  • ఇంకా జగన్ పాటపాడితే ఫలితం ఏమిటి?

  • టీడీపీ చేస్తున్న తప్పే ఏబీ చేస్తున్నారా?

  • ఏబీ పోరాటం టీడీపీకి లాభమా? నష్టమా?

  • జగన్ అండ్ కో ను శిక్షించడం లేదని పసుపు సైనికుల అసంతృప్తి

  • దొరికిన నిందితులను వదిలేస్తున్నారన్న ఆగ్రహం

  • జగన్ సన్నిహిత బడా కంపెనీల కొమ్ముకాస్తున్నారన్న అసంతృప్తి

  • మరి టీడీపీ అసంతృప్తివాదులు, కమ్మ వర్గమే ఏబీ అసలు లక్ష్యమా?

  • అదే నిజమైతే నష్టం టీడీపీకే అంటున్న విశ్లేషకులు

  • ఏబీ అవసరం ఏపీకి ఉందన్న ‘టోన్’ పోల్ సర్వే

  • అందరి చూపూ ఏబీ వైపే..

( మార్తి సుబ్రహ్మణ్యం)

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఎట్టకేలకూ గుప్పిట విప్పారు. సస్పెన్స్‌కు తెరదించారు. తాను ఏదైనా పార్టీ పెడతారా? ఉన్న పార్టీల్లో ఒకదానిని ఎంచుకుని అందులో చేరతారా అని స్పష్టం చేయనప్పటికీ.. రాజకీయ అరంగేట్రమయితే చేస్తున్నట్లు ప్రకటించారు. అమలాపురంలోని జగన్ బాధితుడు, దళితుడైన కోడికత్తిశ్రీను ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. నైతిక స్ధైర్యం ఇచ్చిన ఏబీ తన రాజకీయ అరంగేట్రం ప్రకటనకు, దళితుల అడ్డా అయిన అమలాపురాన్ని ఎంచుకోవడం విశేషం.

నిజానికి రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం చాలారోజుల నుంచి జరుగుతున్నదే. ఈలోగా రాష్ట్రంలోని కమ్మ సంఘాలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఆయనను ఆహ్వానించాయి. జగన్‌కు కించిత్తు కూడా భయపడకుండా, ఆయనపై న్యాయసమరం సాగించి, చివరికి యుద్ధంలో గెలిచిన ఏబీని కూటమి ప్రభుత్వం ఎందుకు గౌరవించలేదని ఒక్క కమ్మ సంఘాలే కాదు. పార్టీ జెండా ఎత్తిన టీడీపీ శ్రేణులంతా అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కమ్మ సంఘాలయితే ‘‘ఏబీ కోసం రోడ్డెక్కేందుకు సిద్ధం. మీకు ఓట్లకు, ఎన్నికల్లో డబ్బుకు, పార్టీ జెండా మోసేందుకు, వైసీపీతో యుద్ధం చేసేందుకు, ఆర్ధికంగా, శారీరంగా నష్టపోయేందుకు కమ్మవారు కావాలి. కానీపదవుల దగ్గరకు వస్తే మాత్ర ం, మా కులం అడ్డువస్తుందా? ఇదేం పద్ధతి? మీకు మా కులం అవసరం లేదని నేరుగా చెప్పండి. తర్వాత మాకేం చేయాలో తెలుసు. మీవల్ల నష్టపోయిన ఏబీకి ఎందుకు పదవి ఇవ్వలేదు? జగన్‌కు లొంగిపోతే ఆయన అప్పుడే డీజీపీ అయ్యేవారు కదా? అంటే మీకు పనిచేసిన వాళ్లు నష్టపోయి, నాశనమయినా పర్వాలేదా? మీకు మాత్రం పదవులు కావాలా? ఇకపై అది కుదరదు’’ అంటూ ఇబ్రహీంపట్నం కమ్మసంఘం వేదికపై మొదలైన కమ్మనేతల ప్రశ్నలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

దానితో ప్రభుత్వం దిద్దుబాటు చర్యకు దిగి, ఆయనను అప్రాధాన్యమైన పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. అయితే ఆ కార్పొరేషన్ ఎండీగా ఉండేది ఐపిఎస్ ఐజి స్థాయి అధికారి. ఆయన కింద ఒక డీజీపీ స్థాయి అధికారి పనిచేస్తారా అన్న కనీసస్పృహ, చైర్మన్‌తోపాటు ఎండి ఇచ్చి గౌరవించాలన్న జ్ఞానం కూడా లేని పాలకుల తీరు విమర్శల పాలయింది. ఇప్పటిదాకా ఏబీ ఆ పదవి తీసుకోలేదు. దానిపై కూడా పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది.

బాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో.. ఏబీ ఇంటెలిజన్స్ ఏడీజీగా ఉంటే, ఠాగూర్ డీజీపీగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్‌కు మరో అధికారి బాసుగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏబీతోపాటు, అరడజనుమందిని అక్కడి నుంచి తప్పించారు. జగన్ సీఎంగా వచ్చిన తర్వాత ఏబీకి ముందు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా, తర్వాత సస్పెండ్ చేసిన జగన్.. బాబు సర్కారులో డీజీపీగా ఉన్న ఆర్‌ పి ఠాగూర్‌ను మాత్రం ఆర్టీసీ ఎండీగా నియమించింది. తర్వాత మళ్లీ ఆయనను విజలెన్స్ కమిషనర్‌గా నియమించింది. ఎన్నికలకు కొద్దినెలల ముందు బయటకొచ్చిన ఠాకూర్, మరొక మాజీ ఐజీ టీడీపీకి వివిధ రూపాల్లో సేవచేశారు. ఏబీ మాత్రం జగన్‌పై న్యాయపోరాటం చేసే పనిలో ఉన్నారు.

సీన్ కట్ చేస్తే.. కూటమి అధికారంలోకి వచ్చిన చాలా నెలల తర్వాత, ఏబీని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు చేసిన ఆర్‌ పి ఠాకూర్‌ను మాత్రం సలహాదారుగా నియమించి, ఢిల్లీకి పంపడం టీడీపీ శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ నిర్ణయంపై అటు పోలీసు శాఖలోనూ విస్మయం వ్యక్తమయింది.ఇది ఒకరకంగా ఏబీని అవమానించినట్లేనన్న వ్యాఖ్యలు వినిపించాయి.

అంతకుముందు సీఐల నుంచి ఎస్పీల వరకూ జరిగిన పోస్టింగులన్నీ ఠాకూర్‌తోపాటు, ఒక మాజీ ఐజి కలసి చేశారన్న ప్రచారం తీవ్రస్థాయిలోనే జరిగింది. తమకు నచ్చిన రిటైర్డ్ అధికారులను, సర్వీసులో ఉన్న జోన్‌కు ఒకరిని నియమించుకుని సీఐ, డీఎస్పీల పోస్టింగులు ఇచ్చారన్నది అప్పట్లో జరిగిన చర్చ.

ప్రధానంగా రాజధాని గుంటూరు రేంజికి వారి తరపున పనిచేసిన ఓ డీఎస్పీ సిఫార్సుల మేరకే, ఆ రేంజిలో పోస్టింగులు దక్కాయని.. తర్వాత ఆయన మంగళగిరి కోరుకున్నప్పటికీ, బాపట్ల జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారన్న చర్చ పోలీసు శాఖలో జరిగిన విషయం తెలిసిందే. నిజానికి ఈ మొత్తం పోస్టింగుల వ్యవహారంలో ఏబీ కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు వైసీపీ అనుకూల మీడియాలో వచ్చినప్పటికీ, అందులో ఆయన పాత్ర శూన్యమేనని తర్వాత పోలీసుశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అది వేరే విషయం.

అసలు ఏబీకి సలహాదారు పదవి ఇచ్చి, జగన్‌పై కేసుల వ్యవహారాన్ని అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా జరగడమే వారి విస్మయానికి కారణం. నిజానికి ఏబీకి ఇచ్చిన ఆ పదవి కూడా కార్యకర్తలు, కమ్మసామాజికవర్గ ఒత్తిళ్ల మేరకు ఇచ్చిందే తప్ప, ఆయనపై ప్రేమతో కాదన్న వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన చాలాకాలం తర్వాత మాత్రమే, ఏబీపై జగన్ సర్కారు పెట్టిన కేసులను ఎత్తివేసింది.

అలాగే ఇప్పటివరకూ ఆయన పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడం బట్టి.. జగన్‌పై ఏబీ చేసిన పోరాటానికి విలువ లేదని, ఆయనను టీడీపీ నాయకత్వం అన్యాయం చేసిందన్న భావనతో పార్టీ శ్రేణులు, సోషల్‌మీడియా వారియర్స్ పోస్టింగులు పెట్టారు.

దానికి కారణం లేకపోలేదు. జగన్ జమానాలో.. టీడీపీ, జనసేన నేతలు కేసుల భయానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో దాక్కుని వ్యాపారాలు చేసుకుంటున్న సమయంలో.. జగన్‌పై కాలుదువ్వింది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు నాటి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజు. మరొకరు ఏబీ వెంకటేశ్వరరావు!

రఘురామరాజు వైసీపీ సర్కారుపై గళం విప్పిన తర్వాతనే, జనంలో తిరుగుబాటు మొదలయింది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్, అమెరికా, ఆస్ట్రేలియా సహా వివిధ ప్రాంతాల్లో తెలుగువారు, టీడీపీ అభిమానులు నిర్వహించిన సభలకు రఘురామరాజు హాజరైతే, వేలమంది కార్యకర్తలు తరలివచ్చారు.ఆయనకు ఎక్కడికి వె ళ్లినా జనహారతి లభించేది. అసలు రచ్చబండను, సోషల్‌మీడియాలో లక్షల సంఖ్యలో చూసేవారు. అసలు ఆ సమయంలో రాజును, మిగిలినవారికంటే కమ్మవర్గమే సొంతం చేసుకోవడం విశేషం.

అదే సమయంలో జగన్‌పై యుద్దం చేస్తున్న ఏబీకి సైతం తెలుగువారు, టీడీపీ కార్యకర్తలు, కమ్మసామాజికవర్గంలో విపరీతమైన ఇమేజ్ ఏర్పడింది. ఆయన ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు హారతిపట్టారు. విదేశాలకు వెళ్లినప్పుడూ అవే దృశ్యాలు. దానితో ఆయనకు ప్రధానంగా కమ్మవర్గం సానుభూతి, మద్దతుగా నిలిచింది. ఆయనను ఇప్పటికీ రాష్ట్రంలోని కమ్మసంఘాలు తమ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారంటే, టీడీపీలోని కమ్మ సామాజికవర్గం, ఏబీని వారు ఏ స్థాయిలో సొంతం చేసుకుందో అర్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఏబీ రాజకీయ అరంగేట్రం ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం అన్న చర్చకు తెరలేచింది. తనకు జగన్‌తో వ్యక్తిగత వైరం లేదని, ఆయన అవినీతిపైనే తన పోరాటమని చెప్పిన ఏబీ ప్రకటనను పక్కనపెడితే.. ఇప్పుడు జగన్ అవినీతి గురించి ప్రజలకు చెప్పి, ఆయనపై పోరాటం చేయడం వల్ల ఉపయోగం ఏమిటన్నది చాలామంది ప్రశ్న.

ఎందుకంటే జగన్ అవినీతిపరుడు, హత్యలను ప్రోత్సహిస్తారు. కులాలను విడదీసి అమరావతిని చంపేశారని టీడీపీ, జనసేన ఐదేళ్లు పాటు అదేపనిగా ఆరోపణలు చేసింది. టీడీపీపై సానుభూతి-జగన్‌పై ద్వేషం ఉన్న కొన్ని మీడియా సంస్థలు కూడా ఐదేళ్లు అదేపనిగా జగన్ సర్కారు అవినీతిని పుంఖాను పుంఖాలుగా రాశాయి. జనం కూడా వాటిని నమ్మి జగన్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. ఫలితంగా అవమానభారంతో జగన్ అసెంబ్లీకి సైతం రాలేని దుస్థితి.

కానీ ఇప్పటికీ కూటమి నేతలు.. ఈ తొమ్మిదినెలల్లో తామేమి చేశామో జనంలోకి వెళ్లి ప్రచారం చేసుకోకుండా, ఇంకా జగన్ ఐదేళ్లనాటి అవినీతినే రామనామంలా, జగన్నామస్మరణ చేయటమే ఆశ్చర్యం. బాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. చేసింది చెప్పుకోకుండా, జగన్‌పైనే దృష్టిపెట్టి ఆయనపై ఆరోపణలు చేసేందుకే పరిమితమయ్యారు.

జైలుకెళ్లిన జగన్‌ను నమ్ముతారా అని అదే పనిగా ప్రచారం చేసినప్పటికీ, జనం జగన్‌ను సీఎంను చేశారు. ఇప్పటికీ అవే ఆరోపణలు చేస్తే జనం వాటిని పట్టించుకుంటారా? అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లారని తెలిసినా జగన్‌కే జైకొట్టినప్పటికీ, ఇంకా పాత స్కూలు సిలబస్, పాతకాలపు రాజకీయాలు కొనసాగించడమే విచిత్రం. ఇప్పుడు ఏబీ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఆయన కూడా అదే దారిలో వెళుతున్నారా? అన్న సందేహాలు తలెత్తడం సహజం.

ఇంకా పాత చింతకాయ వ్యూహాలేనా?

గతంలో చంద్రబాబును కూడా కాంగ్రెస్ పార్టీ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారంటూ, బాబుపై ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు ప్రచారంలోకి పెట్టింది. అయినా బాబును జనం గెలిపించారు. మళ్లీ తర్వాత ఎన్నికల్లోనూ అదే ప్రయోగం చేసి, విఫలమయ్యారు. పవన్ గతంలో బాబు-బీజేపీని విమర్శిస్తూ మాట్లాడిన వీడియోలను, గత ఎన్నికల్లో వైసీపీ విడుదల చేసింది. అయినా జనం కూటమిని గెలిపించారు. ఇప్పటికీ వైసీపీ నేతలు పవన్‌పై అవే విమర్శలు చేస్తున్నారు. విచిత్రంగా ఇలాంటి ఆరోపణలు చేసే నేతలంతా, ఒకప్పుడు తాము విమర్శించిన పార్టీలో పనిచేయడమే విచిత్రం.

కాలం మారి, తరం మారినా రాజకీయ పార్టీల దృష్టికోణం, రాజకీయ వ్యూహాలు మారకుండా, ఇంకా పాతచింతకాయపచ్చడినే అనుసరించడమే ఆశ్చర్యం. చాలా విషయాల్లో కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకత్వం.. ఇంకా ఈ విషయంలో పాతచింతకాయ వ్యూహాలను అనుసరించడమే వింత.

ఏబీ కూడా అదే తప్పు చేస్తున్నారా?

ఇప్పటికే 11 సీట్లను పరిమితమైన జగన్ గత అవినీతిని, కొత్తగా చెప్పడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటి? జగన్ అవినీతిపరుడు, ఆయన పాలన భరించలేకనే కదా కూటమిని గెలిపించింది? అవన్నీ మళ్లీ ఇప్పుడు ఆరోపించడం చూస్తే అధికారంలో ఉంది వైసీపీనా? కూటమినా?.. అంటే ఈ తొమ్మిదినెలల్లో కూటమి సాధించిన విజయాలేమీ లేక జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారా? అన్న సందేహం రావడం సహజం.

ఇప్పుడు రాజకీయ నాయకుడి అవతారమెత్తనున్న ఏబీ కూడా.. కూటమి చేస్తున్న వ్యూహాత్మక తప్పిదమే చేస్తున్నారా? అన్న సందేహం రాక తప్పదు.

నిజానికి ఏబీ ఇప్పుడు కొత్తగా జగన్‌ను సాధించడానికి ఏమీ లేదు. ఆయనపై కేసులన్నీ ఈడీ, సీబీఐ, ఐటి, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి వాటిపై ఏబీ పోరాడి చేసేదేమీ ఉండదు. అందుకు ఆయన శక్తి, స్థాయి సరిపోదు. అయితే.. జగన్ జమానాలో జరిగిన అవినీతి అక్రమాలను తేల్చి, ఆయనను, ఆయనతో లబ్దిపొందిన వారిని విచారించి అరెస్టు చేయాలని మాత్రం, ఏబీ రాజకీయనాయకుడిగా కూటమిని డిమాండ్ చేయగల హక్కు ఉంటుంది.

ఏబీ ఆ సాహసం చేయగలరా?

జగన్ జమానాలో టీడీపీ బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని ఏబీ డిమాండ్ చేసి.. వాటినే అజెండాగా పెట్టుకుని డిమాండ్ చేసే అవకాశం ఆయనకు ఉంటుంది. వివేకా హత్య కేసు విచారణ లొసుగును ఇప్పుడు బయటపెట్టే స్వేచ్ఛ లభించింది. ప్రధానంగా టీడీపీ శ్రేణులు, నాయకులు కోరుకుంటున్నట్లు.. జగన్ బినామీ కంపెనీ అని గతంలో టీడీపీ ఆరోపించిన షిర్డిసాయిబాబా ఎలక్ట్రికల్స్, మేఘా కంపెనీలకు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకుని, వాటి ఒప్పందాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, రాజకీయనాయకుడి అవతారమెత్తిన ఏబీ ఇప్పుడు మీడియా ముఖంగా నిలదీసే అద్భుత అవకాశం. ఎందుకంటే ఇలాంటివాటిపై ఇప్పటివరకూ ఎవరూ నిలదీసే ధైర్యం లేదు కాబట్టి! ఆ పని చేస్తే ఏబీ కార్యకర్తల్లో మరోసారి హీరో అవుతారు.

ఇవన్నీ లక్షలాది మంది టీడీపీ కార్యకర్తల మనోభావాలే. మరి వాటిని ఏబీ తన అజెండాగా మార్చుకుని, ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించగలరా? కార్యకర్తల పక్షాన నిలబడి వారి భుజంపై నుంచి సర్కారుపై ప్రశ్నాస్త్రాలు పేల్చగలరా అన్న కార్యాచరణపైనే.. ఆయన భవిష్యత్తు- తాను ఆశించిన వర్గాల వారి మద్దతు ఆధారపడి ఉంది.

ఏబీవీతో ఎవరికి లాభం?

నిజానికి ఏబీ రాజకీయ అరంగేట్రంతో ఏ పార్టీకి లాభం? ఏపార్టీకి నష్టం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సహజంగా టీడీపీకే లాభమని వాదిస్తుండగా, ఆ పార్టీకే నష్టమని మరికొందరు వాదిస్తున్నారు. విశ్లేషకుల అంచనా మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుత కూటమి సర్కారు జగన్, ఆయన పార్టీ నాయకులపై చర్యలకు సంబంధించి అనుసరిస్తున్న నాన్చుడు వైఖరిపై లక్షలాదిమంది కార్యకర్తలు, కరుడుగట్టిన పార్టీ సైనికులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

జగన్ జమానాలో అధికారం అనుభవించిన అధికారులకు కీలక పోస్టింగులు, జగన్ బినామీ కంపెనీలకు కాంట్రాక్టులు, బిల్లుల చె ల్లింపులు, వేలకోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులను వదిలేయటం, కిరణ్ వంటి సొంత పార్టీ కార్యకర్తకు ముసుగువేసి జైలుకు పంపిస్తున్న చర్యలను సగటు కార్యకర్త మాత్రమే కాదు. పార్టీ కోసం అన్నిరకాలుగా నష్టపోయిన కమ్మ వర్గంలోనేప్రధానంగా కోపం కట్టలు తెగుతోంది.

ఏబీ తమ్ముళ్లకు ప్రత్యామ్నాయవేదిక అవుతారా?

ఇప్పుడు ఏబీ రాజకీయరంగ ప్రవేశం ఫలితంగా.. జగన్ బాధితులు, కమ్మ సామాజికవర్గానికి ఏబీ వేదిక అవవచ్చన్నది విశ్లేషకుల మనోగతం. గత ఐదేళ్లలో జగన్‌పై యుద్ధం చేసి సంపాదించుకున్న హీరోవర్షిప్.. ఇప్పుడు జగన్‌ను ఏమీచేయలేని టీడీపీపై అసంతృప్తితో రగిలిపోతున్న తమ్ముళ్లకు ఏబీ మార్గదర్శి కావచ్చన్నది విశ్లేషకుల అంచనా.

‘టీడీపీలో తీవ్ర అన్యాయానికి గురైనవారికి ఒక వేదిక ఏబీ వెంకటేశ్వరరావు క్రియేట్ చేయబోతున్నారు. వైసిపికి వేదికగా టిడిపి మారినప్పుడు ప్రత్యామ్నాయాలు అవే పుట్టుకువస్తాయి. మేమే తోపు. వైసీపీ వారికి మంత్రి పదవులిస్తాం. చీఫ్ సెక్రటరీలు చేస్తాం. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ జగన్‌మనిషి నరెడ్డికి 8500 ఎకరాలు లాండ్ ఇస్తాం అంటే భరించే ఓపిక లేని వారికి ఏబీ ఒక ఆశాకిరణం. భువనేశ్వరిని తిట్టినవారిని వదిలేసి, భారతీరెడ్డిని ఒక్కమాట అని సారీ చెప్పిన వాడిని ముసుగుతగిలించిన వారికి ఏబీ ఒక ప్రత్యామ్నాయం. సజ్జల, పెద్దిరెడ్డి, ద్వారంపూడి, అంబటి, కొడాలి, సాయిరెడ్డి, రోజా, రజని, అనిల్‌యాదవ్, జగన్‌రెడ్డిని శిక్షించే వారికి ఒక వేదిక ఏబీ. మా ఓట్లు, డబ్బులు కావాలి. మీకు ఏమీ చేయను అనేవారికి ఒక వేదిక ఏబీ. అలా నిర్లక్ష్యానికి గురైన కేసీఆర్ వేదిక టీఆర్‌ఎస్. అంతా మేమే. మా ఇష్టం ఇక నడవదు’’ అంటూ టీడీపీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు, గూడూరు వెంకటేశ్వరరావు పెట్టిన పోస్టింగ్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఏబీవీ వైపు నిలిచేదెవరు?

రాజకీయ ప్రవేశంపై ఏబీ ప్రకటన తర్వాత ఆయన ఏ పార్టీలోనయినా చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా? అన్న చర్చకు తెరలేచింది. నిజానికి ఏబీ కంటే ముందు ఇద్దరు అధికారులు కూడా ఇలాగే ఆవేశపడి, రాజకీయాల్లోకి వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలతో, తర్వాత వెనకడుగువేయాల్సి వచ్చింది.

లోక్‌సత్తా సంస్థకు ఊపిరిపోసిన మాజీ ఐఏఎస్ జయప్రకాష్‌నారాయణ తన పదవికి రాజీనామా చేసి, రోడ్డెక్కారు. తన ప్రసంగాలతో లక్షలాదిమందిని ప్రభావితం చేశారు. ప్రధానంగా కమ్మ వర్గాన్ని ఆకర్షించారు. ఫలితంగా ఆయన పార్టీ పోటీ వల్ల, టీడీపీ దాదాపు 75 నియోజకవర్గాల్లో ఓటమిపాలయి, వైఎస్ సీఎం అయేందుకు కలసివచ్చింది. తర్వాత ఎమ్మెల్యే అయిన జెపి, స్వయంగా అసెంబ్లీ ఆవరణలో తనపై దాడి జరిగినా, పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయారు. ఆ తర్వాత పార్టీని రద్దుచేసుకున్నారు.

ఇక జగన్‌ను అరెస్టు చేసిన సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన యువతను బాగా ఆకర్షించారు. బలిజ వర్గాన్ని కూడా ఆకట్టుకున్నారు. కానీ ఎన్నికల్లో స్వయంగా ఆయనే ఓడిపోయి, జనసేనలో చేరి, మళ్లీ బయటకు వచ్చారు. అయితే, జెడి ఒక్కసారి కూడా జగన్‌ను పేరుపెట్టి విమర్శించేందుకు సాహసించలేదు.

ఏబీకి మీడియా సహకరిస్తుందా?

కానీ ఏబీ వైఖరి వారిద్దరికీ భిన్నం. తాను జగన్‌పై యుద్ధం చేస్తానని ముందస్తుగానే ప్రకటించారు. అయితే ఎవరి మద్దతు లేకుండా ఆయన, ఒంటరిగా ఎన్నాళ్లు పయనిస్తారన్నదే ప్రశ్న. రాజకీయాల్లోకి రాకముందు వరకూ జగన్ వ్యతిరేక మీడియా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత.. టీడీపీకి నష్టం కలిగించే వైఖరిని, ఆ మీడియా సంస్థలు అంగీకరించవు. ఆయనకు పెద్దగా ప్రచారమూ ఇవ్వవన్నది బహిరంగ రహస్యం.

అమలాపురం వేదికగా ఏబీ చేసిన రాజకీయరంగ ప్రవేశ ప్రకటనకు, అవి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే అందుకు చిరు నిదర్శనం. అయితే ప్రధాన మీడియా ఆయనకు పెద్దగా ప్రచారం ఇవ్వకపోయినా, టీడీపీ విధానాలను విమర్శిస్తూ-కార్యకర్తల తరఫున గళం విప్పుతున్న యూట్యూబ్ చానెళ్లు, కమ్మసంఘాలు, కరుడుకట్టిన టీడీపీ సోషల్‌మీడియా సైనికులు దానికి విశేష ప్రచారం కల్పించడం ప్రస్తావనార్హం. పైగా టీడీపీ కార్యకర్తల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం నుంచి మునుపటి సహకారం-సానుభూతి ఉండదు.

ఆయన రాజకీయ నడక, నడత ఏమిటన్నది ఇంకా స్పష్టం కాకపోయినా.. టీడీపీలోని జగన్ బాధితులు, ఆ పార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తిగా ఉన్న కమ్మ సామాజికవర్గం, జగన్‌పై మెతకవైఖరి అనుసరిస్తున్నందుకు విరుచుకుపడుతున్న యూట్యూబులు, వెబ్‌సైట్లు, పార్టీ సైనికులు మాత్రం ఆయనను అనుసరిస్తారన్నది సుస్పష్టం.

ఏబీ ఎంతమందిని ప్రభావితం చేస్తారు?

‘రాజకీయాలంటే పార్టీలు, పదవులు కాదు. నా ఉద్దేశంలో మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర పోషించడమే. ప్రజల ఆలోచనలను నాకు జ్ఞానం ఉన్నంతమేర ప్రభావితం చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నా’నని ఏబీవీ.. తన నయా రాజకీయ ప్రస్థానంలో ఎంతమందిని ప్రభావితం చేస్తారో చూడాలి. అయితే ఏబీ రాజకీయ రంగప్రవేశంపై తెలుగువన్ చానెల్.. ‘ ఏపీలో ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు అవసరం ఉందా’ అంటూ నిర్వహించిన పోల్‌లో అవసరం ఉందని 79 శాతం మంది స్పష్టం చేయగా, అవసరం రావచ్చని 5 శాతం మంది పేర్కొనడం విశేషం. సహజంగా కృష్ణాజిల్లా వాళ్లు ఒకతరం ముందు ఆలోచిస్తారన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఆ జిల్లా వాళ్లను చూస్తే ఎంతపెద్ద పార్టీలకయినా భయం. అసలు జగన్ అధికారంలోకి రాకుండా, నిధుల సమీకరణ చేసింది కృష్ణా జిల్లా కమ్మవారు కాబట్టే, ఆయనకు ఆ కులంపై పీకల్లోతు కోపం. కృష్ణా జిల్లా కమ్మవారి ఆలోచనలే తెలుగు రాష్ట్రాల కమ్మవారిని నడిపిస్తుంటాయి. పైగా కమ్మ సామాజికవర్గం బలం ఉన్న ఆయనకు ఇప్పటికే ఆ వర్గంతోపాటు.. జగన్ బాధిత బీసీ, ఎస్సీలు దన్నుగా నిలుస్తున్నారు. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే ఏబీ మరి దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

LEAVE A RESPONSE