– టైమ్.. ప్లేస్..మీరు చెబుతారా? నన్ను చెప్పమంటారా?
– సాక్షికే వస్తానంటూ సవాల్
– వైసీపీ ఆరోపణలపై ఏబీ కౌంటర్
– జగన్‌పై యుద్ధానికి జెండా ఎగరేసిన ఏబీ
విజయవాడ: ‘ ప్లేస్ నువ్వు చెప్పినా సరే. నన్ను చెప్పమన్నా సరే. టైమ్ నువ్వు చెప్పినా సరే. నన్ను చెప్పమన్నా సరే’ అంటూ.. సమరసింహారెడ్డి సినిమాలో బాలయ్య చేసిన సవాలునే ఇప్పుడు , మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు జగన్ పార్టీపై సంధిస్తున్నారు. జగన్‌పై యుద్ధానికి రె‘ఢీ’ అని 24 గంటల క్రితం ప్రకటించిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అప్పుడే రంగంలో దిగిపోయారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హత్యకు తాను కుట్ర పన్నుతున్నానంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై, ఏబీ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన ఏబీ తీరు చూస్తే, జగన్ హత్యకు కుట్ర పన్నుతున్నట్లుందని ఆరోపించిన శ్రీకాంత్‌రెడ్డికి ఏబీ ఘాటైన సవాల్ విసిరారు.
‘గడికోట శ్రీకాంత్‌రెడ్డి గారూ..సాక్షి చానెల్‌లో ఓపెన్ డిబేట్ పెట్టమని కోరాను. మీరు కూడా పాల్గొనవచ్చు’ అని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. అంతకుముందు ‘సాక్షి వారూ కోడికత్తి శ్రీనుకి జగన్ వల్ల జరిగిన అన్యాయం, ఆ కేసులో అన్ని విషయాలపై ఓపెన్ డిబేట్‌కి నేను సిద్ధం. మీ చానెల్‌లోనే పెట్టండి. డేట్ టైమ్ మీ ఇష్టం’ అంటూ మరొక ట్వీట్ చేశారు.
అదే సమయంలో తనను విమర్శించిన కృష్ణవేణి అనే వైకాపా మహిళా నేతకు, ‘కృష్ణవేణి గారూ.. కోడికత్తికేసులో కుట్ర ఉంది అనే అనుమానాలు నివృతి చేసుకోవాలనుకుంటే అన్ని వివరాలతో నేను సిద్ధం. ఓపెన్ డిబేట్ చేద్దాం. మీరు వందమంది వచ్చినా పర్వాలేదు. మీరన్నా ఆర్గనైజ్ చేయండి. నన్ను చేయమన్నా చేస్తాను. డేట్ అండ్ టైమ్ మీ ఇష్టం’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.