Suryaa.co.in

Editorial

రాధాకృష్ణ-విజయసాయిరెడ్డి.. బస్తీమే సవాల్!

  • ఓపెన్ డిబేట్‌కు ఏబీఎన్ రాధాకృష్ణ సవాల్

  • సాక్షిని కూడా లైవ్‌కు అనుమతిస్తానని ఆఫర్

  • విజయసాయి తరచూ తన వద్దకు వచ్చేవారన్న రహస్యం వెల్లడించిన రాధాకృష్ణ

  • తనకు జగన్ ఆఫర్ ఇచ్చిన గుట్టును రట్టు చేసిన వైనం

  • రాధాకృష్ణ సవాల్‌కు విజయసాయిరెడ్డి సై

  • ఢిల్లీలో మేధావులముందు చర్చిద్దామని ప్రతి సవాల్

  • మద్యం, మైనింగ్ వ్యాపారులతో నువ్వు చేసిన డీల్స్‌పై చర్చిద్దామన్న విజయసాయి

  • ఒక సాధారణ జర్నలిస్టువైన నీకు ఇన్ని వందల కోట్లు ఎక్కడివంటూ ప్రశ్న

  • రాంనాధ్‌గోయెంకా కుటుంబాన్ని ఉదాహరణగా చూపిన విజయసాయి

  • మరి ఢిల్లీ చర్చకు రాధాకృష్ణ సిద్దపడతారా?

  • ఆయన అంగీకరిస్తే ఇక హస్తిన లోనే బస్తీమే సవాల్

  • ఉత్కంఠ రేపుతున్న రాధాకృష్ణ- విజయసాయి సవాళ్ల పర్వం

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ. ఐదునెలల క్రితం వరకూ వైసీపీ సర్కారులో చక్రం తిప్పిన ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డి. ఇద్దరూ ఇద్దరే! వీరి గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి రంగంలో వారు ‘చేయి తిరిగిన’ వారే. ‘తెరవెనుక వ్యవహారాలు’ చక్కబెట్టడంలో అఘటనాఘట సమర్దులే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఇద్దరూ ‘ఆర్ధిక నిపుణులే’. కాకపోతే ఎవరి శైలి వారిది. ఆరకంగా ముందుకెళుతుంటారన్న మాట! ఇద్దరూ కింది నుంచి పైకి వచ్చిన వారే. ఒకరు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, జర్నలిస్టు స్థాయి నుంచి వచ్చి, తాను పనిచేసిన పత్రికకే యజమాని అయిన వారయితే.. మరొకరు ఆడిటర్‌గా వృత్తి ప్రారంభించి, వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన వారు.

ఇప్పుడు వారిద్దరూ రోడ్డెక్కారు. ఒకరి చరిత్ర మరొకరు తవ్వితీస్తున్నారు. ఇద్దరూ సఖ్యతగా ఉన్న రోజుల్లో నాలుగు గోడల మధ్య చెప్పుకున్న ముచ్చట్లు, ఇప్పుడు బయటపెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకుంటున్నారు. రాధాకృష్ణ విసిరిన సవాలుకు విజయసాయి సై అన్నారు. కాకపోతే చర్చను హస్తిన బాట పట్టిద్దాం. వస్తావా? అన్నది విజయసాయి విసిరిన సవాలు. మరి రాధాకృష్ణ అందుకు ఊ ఉంటారా?.. ఊహూ అంటారా? ఇప్పుడు తెలుగునాట రాజకీయ-మీడియా వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్.

ఒక రాజకీయనేత-ఒక మీడియా అధినేత నేరుగా యుద్ధానికి తలపడితే ఎలా ఉంటుంది? వారి సవాళ్లు ప్రకటనల నుంచి.. వేదికపై ఓపెన్ డిబేట్ వరకూ వెళితే ఎలా ఉంటుంది? అది కూడా చానెళ్లలో లైవ్ ఇస్తే ఎలా ఉంటుంది? యమా ర ంజుగా ఉండదూ?! అది.. ఎవరినీ లెక్కచేయని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ-ప్రత్యర్ధులపై నిర్దయగా విలయతాండవం చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఇంకెంత ఉత్కంఠగా ఉంటుంది?!

యస్. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. అవును. వారిద్దరూ బస్తీమే సవాల్‌కు సై అన్నారు. కాకపోతే ఇంకా వేదికనే ఖరారు కావలసి ఉంది. ఐక్యరాజ్యసమితి పర్యటనలో ఉన్న విజయసాయిరెడ్డి, ఇండియాకు వచ్చిన తర్వాత అది ఎప్పుడున్నదే తేలాల్సి ఉంది. అప్పటిదాకా వారిద్దరి పంచాయితీ ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.

కొద్దిరోజుల నుంచి ట్విట్టర్-మీడియా వేదికగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ-వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య జరుగుతున్న ఆరోపణలు సవాళ్ల పర్వానికి చేరింది. అది చివరకు వేదికను ఖరారు చేసే దిశగా వెళుతోంది.

విజయసాయిరెడ్డి- రాధాకృష్ణ ఇంటికి విజయసాయిరెడ్డి తరచూ వెళ్లేవారన్న విషయాన్ని రాధాకృష్ణ వ్యాసంతో బట్టబయలవడం ఒక విశేషమయితే.. సీఎం చంద్రబాబు పేరు చెప్పి రాధాకృష్ణ మైనింగ్, ఇసుక, లిక్కర్ వ్యాపారాల నుంచి వసూళ్లు చేసేవారన్న సంగతి విజయసాయి ఆరోపణలతో వెలుగులోకి రావడం మరో విశేషం. ఈ సందర్భంగా విజయసాయి.. ఆయనకు ‘డీల్‌మేకర్’ అన్న బిరుదు కూడా ఇచ్చారు.

అసలు ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే బోలెడు సందేహాలు, బొచ్చెడు సంభ్రమాశ్చర్యం చెందక తప్పదు. రాధాకృష్ణ-విజయసాయి తవ్వి తీసుకుంటున్న గతచరిత్రను నిశితంగా పరిశీలిస్తే..రాజకీయ నాయకులు-జర్నలిస్టుల మధ్య ఇంత తెరచాటు బాంధవ్యాలు ఉంటాయా అనిపించక మానదు. ఆ ముచ్చటేదో చూద్దాం.

రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి కొద్దిరోజుల క్రితం ఓ దారుణమైన ట్వీట్ చేశారు. ఆంధ్రజ్యోతి బ్రేక్‌ఫాస్ట్ న్యూస్‌లో రాధాకృష్ణ ఉవాచ; ‘గుడిని మింగేది సుబ్బారెడ్డి. లింగాన్ని మింగేది విజయసాయిరెడ్డి. భూమిని మింగిన రాక్షసులు’’ అంటూ తనపై చేసిన ఆరోపణకు సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

‘‘నువ్వొక చిత్తశుద్ధి కలిగిన జర్నలిస్టువేనా?నన్ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు నా ఇంట్లో సోదాలుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు లేవు. నాపై పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతాలెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగా మోసగాడినో, బ్లాక్‌మైలరునో, వీలర్ డీలరునో కాదు. నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్లు, ఖనిజ సిండికేట్ బ్రోకర్ల దగ్గర రాజకీయ నేతల పేర్లు చెప్పి వారికి ఇవ్వాలని నెల నెలా కోట్లకు కోట్లు నేను తీసుకోలేదు. 2024 నాపై నువ్వు చేసిన ఆరోపణలకు నేను సీబీఐ విచారరణకు సిద్ధం. మరి నేను చేసిన ఆరోపణలపై విచారణకు నువ్వు సిద్ధమేనా’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

‘‘ఒక మామూలు విలేకరి అయిన రాధాకృష్ణా..నీ మాటల్లోనే చెప్పాలంటే జర్నలిజం వృత్తి. లేదా ఉద్యోగం. ఇప్పుడు వందలాది కోట్ల విలువైన రెండు రెండు మీడియా సంస్థల అధిపతివయ్యావంటే, నీ చీకటి సంపాదన అందుకు తోడ్పడిందన్నది జగమెరిగిన సత్యం. అధికారంలో ఉన్న నాయకులకు, వ్యాపారాలు లేదా కాంట్రాక్టర్లకు మధ్య ఒప్పందాలు కుదిర్చి డబ్బు లావాదేవీలను ముగింపు దశకు చేర్చిన ‘డీల్‌మేకర్’గానే నీకు ఎక్కువ పేరుంది. పొలిటికల్ రిపోర్టరుగా నువ్వు రాసిన వార్తల కంటే, నువ్వు కుదిర్చిన డీల్స్ నీకు ఎక్కువ డబ్బు సంపాదించి పెట్టలేదా? నువ్వు ఒక ఇంటర్వ్యూలో లేదా నీ స్వీయ కథనంలో చెప్పినట్లు.. నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు నువ్వు ఎన్ని టన్నుల బియ్యం దొంగరవాణా చేసినా ఆంధ్రజ్యోతిని కొనడానికి డబ్బు సరిపోదే?! బెజవాడ దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర నువ్వు నాటి సీఎంతో సంపాదించిన బుల్లి విద్యుత్ తయారీ యూనిట్ తెచ్చిపెట్టిన ఆదాయం కూడా, జ్యోతి-ఏబీఎన్ చానెల్‌ను నడపటానికి మూలకైనా సరిపోతుందా?’’ అంటూ విజయసాయి తన ట్వీట్‌లో రాధాకృష్ణను దునుమాడారు.

దానికి స్పందించిన రాధాకృష్ణ తన వారాంతపు కొత్తపలుకులో.. సాయిరెడ్డిని నికృష్టుడని సంబోధిస్తూ, ఆయన గతాన్ని తవ్వేసి, తనతో చర్చకు రావాలని సవాల్ విసరడం సహజంగా ఆసక్తికలిగించేదే.
‘సాయిరెడ్డి తాను జగన్‌కు విధేయుడినంటూనే చీకటిమాటున ఇతర పార్టీ నేతలను కలుసుకుంటారు. సాయిరెడ్డికి ఉన్న నీచ నికృష్ణ తెలివితేటలు నాకు ఉంటే, రోత మీడియా వలె నేను 23 ఎడిషన్లు ఒకేసారి ప్రారంభించేవాడిని. నేను బ్లాక్‌మెయిల్ చేసేవాడినైతే ఆంధ్రా-తెలంగాణలో కేసీఆర్,జగన్‌తో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏమిటి? ఎవరినో బ్లాక్‌మెయిల్ చేసే బదులు సీఎంలతోనే రాజీ పడిపోవచ్చు కదా? నాతో సయోధ్య కుదుర్చుకునేందుకు జగన్ రాయబారం పంపి ఎంత కావాలని అడిగిన విషయం సాయిరెడ్డికి తెలియదా’ ప్రశ్నల వర్షం కురిపించారు.

దానితోపాటు రాధాకృష్ణ ప్రస్తావించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు-తర్వాత కూడా సాయిరెడ్డి తనను కలిసేవారని చెప్పడం! ‘ నువ్వు నన్ను చాలాసార్లు కలిశావు. మా ఇంటికి వచ్చావు. అప్పుడు ఏ డీల్ కోసం వచ్చావో చెప్పు. నెలక్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే ధైర్యం అతగాడికి ఉందా? అని విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు.

‘తెలుగు రాష్ట్రాల బయట చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశాడు. నువ్వూ నేనూ కలసి ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పెట్టుకుందాం. ఇద్దరి సంగతి అక్కడే తేల్చుకుందాం. ముందుగా ట్వీట్స్ పెట్టడం, తర్వాత పైవాళ్ల ఒత్తిడితో పెట్టాల్సి వచ్చింది. అపార్ధం చేసుకోవద్దని రహస్యంగా కలుసుకుని వేడుకోవడం వెన్నుముక లేని ఈ నికృష్టుడికి అలవాటే’నని రాధాకృష్ణ తన కాలమ్‌లో చెలరేగారు. ఆరకంగా చర్చకు సిద్దపడిన రాధాకృష్ణ, తన చర్చ లైవ్‌ను సాక్షిలో కూడా టెలికాస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

దానికి మళ్లీ స్పందించిన విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తిరేపింది. ‘రాధాకృష్ణ.. బహిరంగచర్చకు నేను సిద్ధం. అయినా నీ పక్షపాత చానెల్‌కు నేను రావాలా? ఢిల్లీలో ఎన్జీఓలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని చానెళ్లను పిలిచి ప్రజావేదికపై రిటైర్డ్ జడ్జిల సమక్షంలో తేల్చుకుందాం! నేను ఐరాస నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ. గత ఐదేళ్లలో మద్యం ఖనిజ సిండికేట్ల బ్రోకర్లు, మిగతా డీల్స్‌లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు చర్చిద్దాం. జర్నలిస్టు కాలనీలో నువ్వుండే ప్యాలెస్, నేనుండే బాడుగ ఇళ్లు కూడా చూపిద్దాం. ఫిల్మ్‌నగర్ మెయిన్‌రోడ్డులో నువ్వుకొన్న వంద కోట్ల విలువ చేసేస్థలం. దాంట్లో ఇంకో 200 కోట్లతో కడుతున్న ఆఫీసు భవంతిని కూడా పరిశీలిద్దాం’ అని రాధాకృష్ణకు సవాల్ చేశారు.

అంతటితో ఆగని సాయిరెడ్డి.. ‘ఆంధ్రజ్యోతిని కొనడానికి పెట్టుబడి పెట్టిన ఇద్దరు ప్రధాన వాటాదారులు ఏమయ్యారు?వారితో డబ్బులు పెట్టించిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి పారదోలింది నిజం కాదా? విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తయారుచేసే పారిశ్రామికవేత్త, ఇప్పటికీ తన మిత్రుల దగ్గర నీ నయవంచన గురించి చెబుతోనే ఉంటారు’ అని తాజాగా మరో ట్వీట్ చేశారు.

అయితే ఎన్నారైల నుంచి.. రాధాకృష్ణ చందాలు తెచ్చుకుంటున్నారన్న మరో అంశాన్ని, సాయిరెడ్డి తన ట్వీట్‌లో బయటపెట్టారు. ‘నష్టాలొస్తున్నాయంటూ అమెరికా వెళ్లి ఎన్నారైల నుంచి చందాలు తెచ్చుకోవడం నిజం కాదా? కలర్‌బ్లైండ్‌నెస్ లాగా మీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లంతా నువ్వేమన్నా పడాలి. నీ కోసం సెటిల్‌మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలనుకునే స్వార్ధపూరిత మైండ్ నీది. సుద్దులు చెప్పడం మానుకో. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయ’ంటూ రాధాకృష్ణపై వ్యంగ్యాస్త్రం సంధించారు.

తాజాగా తన చివరి ట్వీట్‌లో సాయిరెడ్డి.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధిపతి గోయెంకా-రాధాకృష్ణ ఆస్తులకు పోలిక పెట్టారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలంతో పోరాడి ఇందిరాగాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్‌నాధ్ గోయెంకా గుర్తున్నాడా? ఆయన వారసులు ఇంకా ఇప్పటికీ మీడియాను నమ్ముకుని సాధారణ జీవితాలు గడుపుతున్నారు. 92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆస్తులు, నీ నెలరోజుల సెటిల్‌మెంట్ల సంపాదనతో సరిపోవంటే నీవెంత అవినీతిపరుడివో చెప్పాలా? అని ప్రశ్నించారు.

వీరిద్దరి సవాళ్ల వ్యవహారంలో.. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని, కొన్ని ఆసక్తికరమైన వ్యవహారాలు వెలుగుచూడటం విశేషం. కరుడుకట్టిన జగన్ అభిమాని అయిన విజయసాయిరెడ్డి.. కరుడుగట్టిన టీడీపీ మద్దతుదారయిన రాధాకృష్ణను లెక్కలేనన్ని సార్లు కలవడమే వింత! ఆంధ్రజ్యోతిని తరచూ ఎల్లో మీడియాగా పిలిచే సాయిరెడ్డి.. అదే ఎల్లోమీడియా అధిపతి రాధాకృష్ణను అన్నిసార్లు కలవడం మరో ఆశ్చర్యం.

ఐదేళ్లు జగన్-వైసీపీని జమిలిగా దునుమాడిన రాధాకృష్ణ.. అదే పార్టీకి చెందిన విజయసాయిని ఏవిధంగా తన ఇంటికి ఆహ్వానించి, అన్నిసార్లు చర్చలు జరిపారన్నది ఇంకా ఆశ్చర్యం. మామూలుగా అయితే అలాంటి పనికి.. ఏ టీడీపీ నాయకుడైనా ఒడిగట్టి ఉంటే, అతగాడిపై ఈపాటికి చర్య తీసుకునేవారు. కానీ అక్కడ ఉన్నది రాధాకృష్ణ కాబట్టి, నాయకత్వం కూడా పెద్ద పట్టించుకోనట్లుంది.

విజయసాయి తనతో అనేకసార్లు మాట్లాడారని వెల్లడించిన రాధాకృష్ణ.. వాటి వివరాలు మాత్రం బయటపెట్టకపోవడం ఆశ్చర్యం. తాజా ఉదంతం.. రాజకీయనాయకులు-మీడియా అధిపతుల సంబంధ బాంధవ్యాలు, ఏ స్థాయికి చేరాయన్నది స్పష్టం చేసేదే.

అంతా బాగానే ఉంది. మరి ఢిల్లీలో విజయసాయి నిర్వహించే చర్చల పేరంటానికి రమ్మని మాజీ న్యాయమూర్తులు, మేధావులు, జర్నలిస్టులను బొట్టు పెట్టి పిలిచేదెవరు? విజయసాయిరెడ్డా? రాధాకృష్ణనా?! అయితే ఈ ఆఫర్ ఇచ్చింది సాయిరెడ్డే కాబట్టి.. ఆయనే వారందరినీ ఏరుకుని రావాలేమో?!

LEAVE A RESPONSE