Suryaa.co.in

Andhra Pradesh

రక్షణ పరికరాల పరిశ్రమ పనులను వేగవంతం చేయండి

– భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కల్యాణితో మంత్రి లోకేష్ భేటీ

దావోస్: భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ బి.కల్యాణితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో రక్షణ పరికరాల తయారీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించండి. ఈ ప్రాజెక్టు ద్వారా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందజేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రక్షణరంగంలో ఇతర తయారీదారులను ఆకర్షించేలా మానవవనరులను అభివృద్ధి చేసేందుకు ఏపీలో ఆర్ అండ్ డి, శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి.

ఏపీలో రక్షణరంగ పరికరాల తయారీ కోర్సులతో కూడిన కొత్త ఐటిఐలను ఏర్పాటు చేయండి, ఇప్పటికే పనిచేస్తున్న ఐటిఐలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కల్యాణి మాట్లాడుతూ… కల్యాణి గ్రూప్ అనుబంధ ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన భారత్ ఫోర్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫోర్జింగ్ కంపెనీల్లో ఒకటిగా అవతరించిందని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, 18 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు దేశాల్లో 18 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కలిగి ఉన్నామని తెలిపారు. తమ సంస్థ తయారుచేసే హైవాల్యూ ఉత్పత్తులను 50కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని అన్నారు.

భారత్ లో ప్రస్తుతం 11 యూనిట్లు పనిచేస్తున్నాయని, ఎలక్ట్రిక్ వాహన కాంపొనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇస్రో భాగస్వామ్యంతో ఏరోస్పేస్ కాంపొనెంట్స్ ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఎపిలోని మడకశిర నియోజకవర్గం ముర్దనహళ్లిలో గ్రామంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంతో రూ.2,400 కోట్ల పెట్టుబడితో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు తాము చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎపి ప్రభుత్వ ఇతర ప్రతిపాదనలపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE