– భారత గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు
– 2030నాటికి 18 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యంగా ఏపీ అడుగులు
– ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సిద్ధం
– వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్
దావోస్: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ బెల్వెడేర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వనీతి ఇనిషియేటివ్ సీఈవో రిత్వికా భట్టాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జోర్డాన్ క్వీన్ డాక్టర్ రానియా అల్ అబ్దుల్లా, పోర్చుగల్ మాజీ ప్రధాని జోస్ మాన్యుల్ బరాసో, యునెస్కాప్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మార్గా గ్యుయల్ సోలెర్, సెడ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వికాస్ మెహతా, ఇండోనేషియా జాతీయాభివృద్ధి మంత్రి రచ్మట్ పంబుడి, ఇండికా ఎనర్జీ ప్రెసిడెంట్ డైరక్టర్ అర్సాద్ రజీద్, రెన్యు పవర్ జింక్ సీఈవో వైశాలి నిగమ్ సిన్హా పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2023 ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఆ ఏడాది పూర్వ పారిశ్రామిక సగటు కంటే 1.45°సి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు 2022లో గరిష్టస్థాయికి చేరాయి, ఆ తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. గత 65 ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా సముద్రపు వేడి గరిష్టస్థాయికి చేరింది. 2022-23లో గ్లేసియర్ నష్టం రికార్డుస్థాయికి చేరింది. కేవలం స్విట్జర్లాండ్ లోనే రెండేళ్లలో హిమానీనద పరిమాణం 10% కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పరివర్తన కోసం 2030 నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. 2050 నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125 – 585 ఎంటీపీఏ నడుమ ఉంటుంది. అప్పటికి పవర్ మార్కెట్ లో 50 నుంచి 65శాతంతో గ్రీన్ హైడ్రోజన్ పై చేయి సాధిస్తుంది. 2024లో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పరిమాణం $6.49 బిలియన్లను అధిగమించింది. 2032నాటికి ఇది సగటున 31శాతం పెరిగే అవకాశం ఉంది.
కార్బన్ తీవ్రతను 45శాతం తగ్గించేలా భారత్ చర్యలు
పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన భారత్ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. 2030 నాటికి కార్బన్ తీవ్రతను 45% తగ్గించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తోంది. భారతదేశ నాన్ ఫాసిల్ 2024 నవంబర్ నాటికి ఇంధన సామర్థ్యం 205.52 గిగావాట్లకు చేరుకొని గత 8.5సంవత్సరాలతో పోలిస్తే 396శాతం పెరిగింది. ఇది మొత్తం ఇంధన సామర్థ్యంలో 42శాతం కంటే అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తిని ప్రోత్సహించడానికి భారతదేశం అంతర్జాతీయ సౌర కూటమి సహ-స్థాపన చేసింది. విద్యుత్ చట్టం 2003లోని నిబంధనలకు లోబడి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంపిణీ ప్రాజెక్టుల కోసం ఆటోమేటిక్ విధానంలో నూరుశాతం ఎఫ్ డిఐలను అనుమతిస్తోంది.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉక్కు, సిమెంట్, రసాయనాలు వంటి క్లిష్టమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030నాటికి ఈ రంగంలో ₹8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి… 6 లక్షలకు పైగా సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. సోలార్ పార్కుల అభివృద్ధికి కూడా భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా 12 రాష్ట్రాల్లో 500 MW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో 500 సోలార్ పార్కులు మంజూరుచేసింది.
సోలారైజింగ్ అగ్రికల్చర్, గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాల కోసం పీఎం-కుసుంవంటి కార్యక్రమాల ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సౌరశక్తిని ప్రోత్సహిస్తోంది. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ లో భాగంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపుతోంది. ఆటోమోటివ్ ఇంధనంగా సీబీజీని వినియోగించేలా మార్కెట్ లో అందుబాటులోకి తెస్తోంది.
ఏపీలో అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు
డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్‌మార్క్ ని సెట్ చేస్తూ సస్టయినబుల్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. శిలాజేతర ఇంధన వనరుల నుండి 25గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధనరంగంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. కర్నూలు జిల్లాలోని 1 గిగావాట్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రముఖ ప్రాజెక్టులతోపాటు కేంద్రప్రభుత్వం ఇటీవల 4గిగావాట్ల సామర్థ్యం గల 4సోలార్ పార్కులను ఏపీలో ప్రకటించింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. హరిత ఆర్థిక వ్యవస్థతో పాటు సమగ్రమైన, స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రగతిశీల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల “ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించారు. 160 జీడవ్ల పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సాధించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రంలో 34 జీబ్ల్యు సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్‌ల కోసం 29 స్థానాలను గుర్తించాం. సోలార్, విండ్, సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌ల కోసం 80వేల ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం సర్వే చేసింది. జలవిద్యుత్ రంగంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి కలిగి ఉంది. త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఒక్కొక్కటి 30 మెగావాట్ల సామర్థ్యంతో విశాఖపట్నం, కృష్ణపట్నంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్ లను ప్రతిపాదించాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక-2023 దేశంలో రెండో స్థానంలో నిలచి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2030నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. చంద్రబాబునాయుడు సమర్థ నాయకత్వంలో పునురుత్పాదక శక్తిలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.