Suryaa.co.in

Andhra Pradesh

కోవెలమూడి నాని, శేషగిరిరావు కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు

– అంబటి మురళి, అంబటి రాంబాబుల నుంచి ప్రాణహాని
– టీడీపీపై గ్రీన్‌ గ్రేస్‌ పిడుగు- గుంటూరు నేతలపై పోలీసులకు ఫిర్యాదు
– ఫిర్యాదులో మార్పులు చేయమని పోలీసులూ బెదిరింపు
– బాధితుడు బాబురావు మీడియా ఎదుట ఆందోళన
– టీడీపీపై గ్రీన్‌ గ్రేస్‌ పిడుగు!

గుంటూరు: స్థానిక గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వివాదంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇక్కడి నాయకులు చిక్కుకున్నారు. కోవెలమూడి నాని, టీఎన్‌టీయూసీ నాయకులు శేషగిరిరావు తనను కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారని, వీరితోపాటు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వాహకులు అంబటి మురళి, అంబటి రాంబాబుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి పిల్లి బాబురావు ఫిర్యాదు చేశారు. బజరంగ్ జూట్ మిల్లు కబ్జా చేసి, కార్మికుల పొట్ట గొట్టి దౌర్జన్యంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలనే తనపై హత్యాయత్నం జరిగిందని బాధితుడు పిల్లి బాబురావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, తనపై దాడి చేసినవారిని , తనపై దాడికి పురిగొల్పిన వారిపై కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జూట్ మిల్లు వ్యవహారంపై కోర్టు మెట్లు ఎక్కానని, అందుకే తనపై దాడి చేశారని తెలిపారు. టీడీపీ నేతలు కోవెలమూడి నాని, గుంటుపల్లి శేషగిరి రావు తనను పిలిచి కోర్టులో కేసు విత్‌ డ్రా చేసుకోవాలని బెదిరించారని, తాను ఎదురుతిరగడంతో పోలీసులు తనను పిలిచి కంప్లైంట్ లో మార్పులు చేయాలని తనను బెదిరించారని చెప్పారు.
వారికి భయపడి కంప్లైంట్ లో మార్పు చేశానని బాబురావు పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కేసులతో రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తనకు రక్షణ కల్పించాలని వేడుకొన్నారు. ఈ వ్యవహారంలో తలదూర్చినందుకే స్థానిక సీఐ, డీఎస్పీలను వీఆర్ కు పంపారని బాధితుడు మీడియాకు తెలిపారు.

LEAVE A RESPONSE