Suryaa.co.in

Andhra Pradesh

రైతన్నపై ‘మై హోం’ చిన్నచూపు!

– సదస్సుకు దుమ్మా కొట్టిన యాజమాన్యం
– భూములు పొంది, ఏళ్ళు దాటినా పరిశ్రమ లేదు
– ఉపాధి లేక అల్లాడుతున్న భూమలిచ్చిన రైతులు
– కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు

గ్రామాలపాడు : పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం గ్రామాలపాడు సచివాలయం వద్ద మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, ఫ్యాక్టరీ సిబ్బంది, రెవిన్యూ అధికారులతో చర్చావేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ
మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ళు గడుస్తున్నా ఫ్యాక్టరీ నిర్మించకుండా యాజమాన్యం జాప్యం చేస్తోందని, చాలా తక్కువ రేట్లతో భూములను కొనుగోలు చేసి, ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మించలేదని ఆరోపించారు.

రైతులకు ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ధర్నాలు చేశామని అధికారులతో తమ గోడు వెళ్లబుచ్చుకుంటే చర్చావేదిక ఏర్పాటు చేశారని మీడియాకు తెలిపారు. నోటీసులు ఇచ్చినా మై హోమ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫ్యాక్టరీ నిర్మించే వరకు తమ భూములు తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని హెచ్చరించారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడకపోతే జూన్ నుండి భూములు చదువు చేసి పంటలు వేస్తామన్నారు.

అనంతరం దాచేపల్లి ఎమ్మార్వో కుటుంబరావు మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని చర్చా వేదికకు రావాలని యాజమాన్యానికి నోటీసులు కూడా పంపామని తెలిపారు. వారు హాజరుకాలేదని, ఈ విషయంపై ఉన్నతాధికారులు నివేదిస్తామని ఎమ్మార్వో తెలిపారు.

LEAVE A RESPONSE