Suryaa.co.in

Editorial

ష్.. గప్‌చుప్!

  • డీసీఎం వివాదానికి తెర!

  • బాబు హెచ్చరికలతో టీడీపీ నేతల మౌనల మౌనం

  • మంత్రి భరత్‌నూ మందలించిన బాబు

  • రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

  • జనసైనికులు పెదవి విప్పవద్దని ప్రకటన

  • ఊపిరి పీల్చుకున్న కూటమి

  • పవన్‌ను అభినందిస్తున్న టీడీపీ, బీజేపీ నేతలు

  • టీడీపీ,జనసేన పేరుతో వైసీపీ రెచ్చగొట్టే వ్యూహంపై ఆందోళన

  • ఫ్లెక్సీలు, పోస్టింగులు పెట్టి కూటమిలో చిచ్చు పెడతారన్న ఆవేదన

( మార్తి సుబ్రహ్మణ్యం)

కేంద్రప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి, ప్రజల మనసు గెలిచిన సమయంలో దానిని ప్రజాక్షేత్రానికి చేర్చాల్సిన వేళ.. అనవసరంగా తెరపైకి వచ్చిన ‘డిప్యూటీ సీఎం’ వివాదం ఎట్టకేలకూ, టీ కప్పులో తుపానులా చల్లారిపోయింది. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని, స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ఉన్న వేదికలపైనే, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి కోరడంతో వివాదానికి తెరలేచింది.

దానిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమర్ధించడంతో మరింత కాక పెరిగింది. హోంమంత్రి అనిత మాత్రం లౌక్యంగా.. తనకయినా, లోకేష్‌కయినా దేవుడి అండ ఉంటే ఏదైనా అవుతామన్నారు. ఈ క్రమంలో మళ్లీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటనలో ఏర్పాటుచేసిన తెలుగువారి సమావేశంలో.. మంత్రి టిజి భరత్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా లోకేష్ భావి ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడంతో, పార్టీ వర్గాలు తలపట్టుకున్నాయి.

ఉప ముఖ్యమంత్రి వివాదాన్నే ఎలా చల్చార్చాలా అని తలపట్టుకున్న టీడీపీ నాయకత్వానికి, టిజి భరత్ అత్యుత్సాహంతో చేసిన ముఖ్యమంత్రి పదవి వ్యాఖ్య ఇబ్బందికరంగా పరిణమించింది. దానితో జనసేన నేత కిరణ్‌రాయల్.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని తమకూ ఉందని, తమ పార్టీ కార్యకర్తలు సైతం పదేళ్లనుంచీ అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దానితో నాయకత్వ భావన గ్రహించిన జనసైనికులు సైతం, పవన్ కాబోయే సీఎం అని కామెంట్లు పెట్టారు.

‘‘జనసేన వల్లే టీడీపీకి అన్ని సీట్లు వచ్చాయి. మేం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిస్తే, మీరు ఎన్ని గెలిచారు? పవన్ చొరవ వల్లనే బీజేపీ మనసుమార్చుకుని టీడీపీతో జతకట్టింది. పవన్ కృషి లేకపోతే టీడీపీతో బీజేపీ కలిసేదా? మరి అలాంటప్పుడు సీఎం ఎవరికి ఇవ్వాలిః లోకేష్‌కా? పవన్‌కల్యాణ్‌కా’’ అంటూ జనసైనికులు శరపరంపరగా ప్రశ్నల వర్షం కురిపించారు.

దీనితో ఈ వివాదం, అటు తిరిగి ‘కోతిపుండు బ్రహ్మరాక్షసి’లా మారే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు.. ఇక ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని, నేతల సొంత అభిప్రాయాన్ని పార్టీపై రుద్దవద్దని హెచ్చరించారు. అదేవిధంగా తన సమక్షంలోనే లోకేష్‌ను భావి సీఎం అని పొగిడిన మంత్రి టిజి భరత్‌ను మందలించారు. దానితో టీడీపీ శిబిరం నుంచి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండు ఆగిపోయింది.

అదే సమయంలో చంద్రబాబు దావోస్ నుంచే దిద్దుబాటకు దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన జనసేన దళపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. దీనిపై తాను పార్టీ నేతలకు తగిన ఆదేశాలు పంపించానని, జనసేన అధ్యక్షుడిగా మీరు కూడా స్పందిస్తే, ఆ వివాదానికి తెరవేయవచ్చని సూచించినట్లు తెలుస్తోంది.

తర్వాత జనసేన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసైనికులు ఎవరూ బహిరంగంగా కానీ, మీడియా సమక్షంగా కానీ స్పందించవద్దని ఆదేశించింది. సోషల్‌మీడియాలో కూడా దానిపై స్పందించకుండా సంయమనం పాటించాలని ఆదేశించింది. అంటే ఈ విషయంలో జనసేన దళపతి పవన్ సైతం, దిద్దుబాటుకు దిగినట్లు స్పష్టమవుతోంది. పవన్ ఆదేశాలను టీడీపీ, బీజేపీ నాయకులు అభినందిస్తున్నారు. అయితే అంతకుముందు ‘పవన్‌కు సీఎం’ అంశంపై.. జనసేన నేత కిరణ్ రాయల్‌తో, జనసేన నాయకత్వమే మాట్లాడించిందన్న ప్రచారం సోషల్‌మీడియా వేదికగా నడిచింది.

ఏదేమైనా ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ సీరియస్‌గా తీసుకుంటారని భయపడిన టీడీపీ నేతలు, ఆయన సానుకూల ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఏ సందర్భంలోనయినా దానిపై స్పందిస్తే, కూటమిపై అది ఎక్కడ ప్రభావం చూపుతుందోనని టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. అదీకాకపోతే మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ఆయనను ప్రశ్నిస్తే.. పవన్ ఏవిధంగా ప్రతిస్పందిస్తారోనని పార్టీ వర్గాలు కలవరం చెందాయి. చివరాఖరకు పవన్ కూడా హుందాతనం ప్రకటించి, జనసైనికులెవరూ డిప్యూటీ సీఎం అంశంపై మాట్లాడవద్దని కట్టడి చేయడంతో డీ సీఎం కథ కంచికి చేరినట్లయింది.

ఇప్పటివరకూ బాగానే ఉన్నా.. ఇక రేపటి నుంచి వైసీపీ సోషల్‌మీడియా, వ్యూహబృందం దీనిపై ఎలాంటి పథక రచన చేస్తుందోనని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న వైసీపీకి.. లోకేష్‌కు డిప్యూటీ సీఎం, సీఎం డిమాండ్లు లడ్డులా మారాయి. కానీ ఈలోగా బాబు-పవన్ జమిలిగా రంగంలోకి దిగి, వివాదాన్ని సుఖాంతం చేయడం, వైసీపీని సహజంగానే నిరాశ పరిచాయి.

అయినా పట్టువద్దలని విక్రమార్కులయిన వైసీపీ సోషల్‌మీడియా సైనికులు.. రేపటి నుంచి టీడీపీ నేతల పేరుతో, లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనన్న ప్రచార ఉద్యమం నిర్వహించి.. వైసీపీ నేతలే టీడీపీ నేతల పేరుతో ఫ్లెక్సీలు పెడితే పరిస్థితి ఏమిటి? దానిని ఎలా తిప్పికొట్టాలి? అదే సమయంలో జనసేన నేతల పేరుతో ‘పవన్‌ను సీఎంను చేయాల’ంటూ వైసీపీ నేతలే సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టి, జనసేన నేతల పేరుతో ఫ్లెక్సీలు పెడితే దానిని ఎదుర్కోవాలన్నది మరో ప్రశ్నగా మారింది.

ఈ మొత్తం ఫేక్ ప్రచారానికి టీడీపీ-జనసేన కార్యకర్తలు ఆకర్షితులయితే, దానిని తిప్పికొట్టేందుకు ఇరు పార్టీల నాయకత్వాలు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలన్న సూచన వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE