– అన్న తీపి గుర్తులతో ప్రత్యేక సావనీర్ రూపొందిస్తున్నాం
– అభిమానులకు ఆ సావనీర్ ఓ మధుర జ్ఞాపకం
– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్
పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమన్న స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనే ఎన్టీఆర్ అభిమానుల కర్తవ్యమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ కార్యాలయ సమన్వయకర్త, ఎన్టీఆర్ శతజయంత్యుత్సవ సావనీర్‌కమిటీ కన్వీనర్ టిడి జనార్దన్ పిలుపునిచ్చారు. అన్న స్థాపించిన టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అభిమానుల లక్ష్యం కావాలన్నారు.
ఎన్టీఆర్‌తో అభిమానుల తీపి గుర్తులను నెమరువేసుకుని, వాటిని చిరకాలం అభిమానుల గుండెల్లో దాచుకునే ఓ మధుర జ్ఞాపకంగా సావనీర్‌ను తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని జనార్దన్ కోరారు. ఆ మేరకు హైదరాబాద్ జెఎస్‌ఆర్ కన్వెక్షన్ హాల్ నిర్వహించిన ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశానికి, జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలను అంగరంగ వైభవంగా, అభిమానులు జీవితకాలం గుర్తుంచుకునేవిధంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోజు ఎన్టీఆర్ జీవితచరిత్ర, పార్టీ స్థాపన, జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసిన అనేక అంశాలతో ప్రత్యేక సావనీర్ వెలువరిస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు- ప్రత్యేక చొరవతో ఈ కమిటీ ఏర్పాటయిందన్నారు. ఈ కమిటీలో లబ్ధప్రతిష్ఠులను చంద్రబాబు నియమించారని చెప్పారు. అభిమానులంతా ఎన్టీఆర్‌తో తమ అనుభవాలు, ఆయనతో తీయించుకున్న ఫొటోలను సావనీర్ కమిటీకి పంపించాలని కోరారు. దేశ రాజకీయగతిని మార్చి, చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌కు అభిమానులు ఇచ్చే ఘన నివాళి, జ్ఞాపిక ఇదేనన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా , మాజీ ఎమ్మెల్యే తాళ్లపాక రమేష్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, శ్రీపతి సతీష్ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అభిమానుల సమావేశం జరిగింది. ఈ అభిమానుల ఆత్మీయ సమావేశం లో టిడిపి గౌస్, తిప్పన్న, ఎన్టీఆర్ అభిమానుల టీం మహారాష్ట్ర,గుంటి యాదగిరి రావు, తోట సత్యం, సంధ్య పోగు రాజశేఖర్, సితార వెంకటేష్, అభిమానులు పాల్గొన్నారు.