– విచారణ పేరుతో కొట్టే అధికారం ఎవరిచ్చారు?
– టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రను సిఐడి పోలీసులు నిబంధనలకు విరుద్దంగా రాత్రంతా స్టేషన్ లో నిర్బంధించి అత్యంత పాశవికంగా టార్చర్ కు గురిచేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తొత్తుగా మారి తెలుగుదేశం నేతలను టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్న సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను తక్షణమే రీకాల్ చేయాలి. చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్న ఆయనపై క్రిమినల్ కేసు నమోదుచేయాలి. సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారంటున్న పోలీసులు 41ఎ నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి వేళ ఎలా అరెస్టు చేస్తారు? కోర్టులు పదేపదే చీవాట్లు పెడుతున్నా సిఐడి వైఖరిలో మార్పు రావడం లేదు. విచారణ పేరుతో కొట్టేహక్కు సిఐడికి ఎవరిచ్చారు? సునీల్ కుమార్ నేతృత్వంలో సిఐడి పోలీసులు బందిపోట్లమాదిరిగా వ్యవహరిస్తున్నారు. సునీల్ కుమార్ తో సహా టిడిపి నేతలను వేధించిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదు. కోర్టుకీడ్చి వారి సంగతి తేల్చేదాకా వదలం.