అధికారంలోకి రాగానే సర్పంచులకు,ఎంపీటీసీలకు, జడ్పిటిసిలకు తిరిగి నిధులు,విధులు

Spread the love

– పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్ హామీ

యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, ఆదోని నియోజకవర్గం లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన పల్లె ప్రజల కోసం మీ లోకేష్ అనే సభా కార్యక్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సర్పంచులు,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పడుతున్న ఇబ్బందులు గురించి వారితో నేరుగా నారా లోకేష్ చర్చించారు. ఈ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టిడిపి, వైయస్సార్సీపి, జనసేన,బిజెపి,సిపిఐ మరియు ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను లోకేష్ కు తెలియజేశారు.

ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ…. కేంద్రం ప్రభుత్వం పంపిన నిధులను రూ,, 8660 కోట్లను పంచాయతీల ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని, గ్రామ ప్రజలకు ఏ పని చేయకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలు లాగా మార్చివేసిందన్నారు . రాష్ట్రంలో ఏ గ్రామంలోకి వెళ్లినా గత తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని అన్నారు.

గతంలో ఇచ్చిన మాదిరే గ్రామపంచాయతీలకు ఉచిత విద్యుత్తును ఇస్తామని, పాత విద్యుత్ బకాయిలు రద్దు చేస్తామని కనుక విద్యుత్ బిల్లులు సర్పంచులు ఎవరు కట్టవద్దని లోకేష్ పిలుపునిచ్చారు. గ్రామాలలో ప్రతిరోజు, 24 గంటలు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను సర్పంచులతో కలిసి పని చేసే విధంగా సవరణ చేసి జీవోలను ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సర్పంచుల, ఎంపీటీసీల, జడ్పీటీసీల, ఎంపీపీల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల గౌరవ వేతనాలు పెంచి, గ్రామాల, పట్టణాల అభివృద్ధికి సహకరించి వారి గౌరవాన్ని నిలబెడతాం అన్నారు. ఆర్థిక సంఘాల ద్వారా గ్రామపంచాయతీలకు కేంద్రం పంపించే నిధులను దారి మళ్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కలిపి సకాలంలో గ్రామపంచాయతీలకు అందించి గ్రామీణ ప్రజల అభివృద్ధికి సహకరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ సమన్వయ పరచగా, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అనుసంధానకర్తగా వ్యవహరించారు.

పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పగడాల రమేష్ (వైఎస్ఆర్సిపి, ప్రకాశం జిల్లా),కె గోపాల్ (బిజెపి,కడప జిల్లా), గల్లా తిమోతి (జనసేన, కృష్ణాజిల్లా), లెనిన్ బాబు ( సిపిఐ,కర్నూలు జిల్లా), బి.సుధాకర్ రెడ్డి (వైసీపీ, కడప జిల్లా), పి.హెలనా (కోనసీమ జిల్లా) కే.శివకుమార్ (నెల్లూరు జిల్లా), ఏ.రామకృష్ణ (శ్రీకాకుళం జిల్లా), గోలి వసంత కుమార్ (కృష్ణాజిల్లా) మొదలగు వారు లోకేష్ గారితో ప్రసంగిస్తూ “మా పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని సర్పంచ్ల అందరం రాజకీయాలకతీతంగా ఐక్యమై ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నామని వాటికి మీరు, మీ తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని లోకేష్ కి విజ్ఞప్తి చేశారు” .పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘాలకు చెందిన జిల్లా, రాష్ట్ర నాయకులు, 13 జిల్లాలకు చెందిన అన్ని పార్టీల సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply