Suryaa.co.in

Editorial

మళ్లీ.. సెంటి ‘మంట’?

– చంద్రబాబు,కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు మళ్లీ తెరపైకి
– కిషన్‌రెడ్డి-రేవంత్ భుజాలపై మళ్లీ ‘తెలంగాణ’ తుపాకీ
– వాళ్లిద్దరూ బాబు-కిరణ్ ప్రతినిధులంటూ బీఆర్‌ఎస్ మాటల తూటాలు
– మంత్రి హరీష్‌రావు కొత్త మైండ్‌గేమ్
– కిరణ్ రాకతో వెళ్లిపోయిన బీజేపీ నేత విజయశాంతి
– తెలంగాణ ద్రోహులంటూ పరోక్ష ట్వీట్
– కిరణ్‌కు దమ్ముంటే తెలంగాణలో పోటీ చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్ సవాల్
– ఎన్నికల ముందు మళ్లీ ఇది సెంటి‘మంట’ పెట్టే వ్యూహమా?
– టీఆర్‌ఎస్ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్
– ఆంధ్రాలోనూ బీఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ ఏర్పాటు
– మహారాష్ట్రలోనూ కమిటీలు వేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
– తమదిక ఉద్యమపార్టీకాదు.. పక్కా రాజకీయ పార్టీ అని ప్రకటించిన కేసీఆర్
– ఇతర రాష్ట్రాల్లో శాఖలు పెడుతూ ఇతర రాష్ట్రాల వారిపై విమర్శలా?
– మరి తెలంగాణలో బాబు-కిరణ్‌పై బీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఫలిస్తుందా?
– మళ్లీ తెలంగాణ వాదం వర్కవుట్ అవుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

కీలకమైన ఎన్నికల సమయంలో మళ్లీ తెలంగాణవాదానికి ఊపిరిపోసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మాజీ సీఎంలయిన చంద్రబాబు-కిరణ్‌కుమార్ భుజాలపై, ‘తెలంగాణ’ తుపాకీ పెట్టేందుకు అధికార బీఆర్‌ఎస్ కొత్త ఎత్తుగడకు తెరలేపిందా? తమదిక ఉద్యమపార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అన్న కేసీఆర్ ఆలోచనల ప్రకారమే, బీఆర్‌ఎస్ అడుగులు వేస్తోందా? మరి… టీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ నుంచి, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చి, ఆంధ్రాతో సహా ఇతర రాష్ట్రాల్లో పార్టీ శాఖలు ఏర్పాటుచేసిన తర్వాత.. మళ్లీ తెలంగాణవాదం ఎత్తుకుంటే, అది వర్కవుట్ అవుతుందా?

ఆంధ్రా-మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో, పార్టీకి పురుడుపోసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నేతలను విమర్శిస్తే, దానిని తెలంగాణ సమాజం నమ్ముతుందా? పరాయి రాష్ట్రాల్లో పార్టీ పెట్టి, మళ్లీ అదే పరాయి నేతలు హైదరాబాద్‌కు వస్తే విమర్శించడాన్ని.. తెలంగాణ ప్రజలు, మేధావులు బీఆర్‌ఎస్‌ను విశ్వసిస్తారా? మాజీ ముఖ్యమంత్రులయిన చంద్రబాబునాయుడు-కిరణ్‌కుమార్‌రెడ్డి భుజంపై, ‘సెంటిమెంటు తుపాకీ’ పెట్టి.. కిషన్‌రెడ్డి-కిరణ్‌కుమార్‌రెడ్డిని కొట్టిన సీనియర్ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యల తర్వాత, తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.

‘‘బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శిష్యుడు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబునాయుడు శిష్యుడు. వీళ్లిద్దరూ, వాళ్లిద్దరూ చెప్పినట్లు వింటున్నరు. వీరిద్దరితోనే మన బతుకులు ఆగమవుతయ్. వీరిద్దరూ తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు’’. ఇదీ.. తాజాగా, తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్‌రావు చేసిన ఆరోపణ. ఇది సహజంగానే రాజకీయ వర్గాల్లో, తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమయింది.

ఈ సందర్భంగా హరీష్‌రావు గత అసెంబ్లీలో, కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మళ్లీ ప్రస్తావించడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. ‘‘తెలంగాణకు ఇకపై చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదు. మీకు దిక్కునచోట చెప్పుకో’’మంటూ హరీష్‌నుద్దేశించి, కిరణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో అది తెలంగాణ సమాజంపై సెంటిమెంట్‌గా మారింది.ఇప్పుడు కిరణ్ పాత వ్యాఖ్యలను, బీఆర్‌ఎస్ బ్రహ్మాస్త్రంగా మలుచుకునే వ్యూహంలో ఉన్నట్లు, హరీష్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారాన్ని, బీఆర్‌ఎస్, పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆంధ్రావాళ్లకు తెలంగాణలో పని అని ప్రచారం చేసింది. ఇప్పుడు తాజాగా.. తెలంగాణను వ్యతిరేకించి, తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడి, బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఒకరకంగా బీజేపీనే కిరణ్‌కుమార్‌రెడ్డిని చేర్చుకుని, బీఆర్‌ఎస్‌కు బ్రహ్మాస్త్రం ఇచ్చినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర.. తెలంగాణ బీజేపీలో ఎంత ఎక్కువ ఉంటే, పార్టీకి అంత నష్టమని, అటు పార్టీలోని తెలంగాణ వాదులు కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కిరణ్ ఉన్న వేదికపై నుంచి విజయశాంతి అర్ధంతరంగా నిష్క్రమించడమే, దానికి నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఇవన్నీ హరీష్‌రావు విమర్శలకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయన్నది నిష్ఠుర నిజం. ఇది కూడా చదవండి: ‘కమలం’లో విజయ ఆ‘శాంతి’

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీపై దృష్టి సారించడం పూర్తిగా తగ్గించేశారు. గతంలో బక్కని నర్శింహులు, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు పగ్గాలిచ్చి, ఆయన ఏపీపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అయినా ఫలితం లేదు. ఖమ్మంలో జరిగిన సభ సూపర్ హిట్టయినప్పటికీ, తర్వాత పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఎక్కడా సభలు లేవు. పార్టీలో రాజకీయ కార్యకలాపాలు కనిపించడం లేదు.

బక్కని హయాంలో టీఆర్‌ఎస్ సర్కారును, నాయకులంతా పోటీపడి విమర్శించేవారు. తరచూ ప్రెస్‌మీట్లు నిర్వహించేవారు. మీడియాలో తరచూ కొంతమంది అగ్రనేతలు కనిపించేవారు. ఆయన కూడా వారికి ఆమేరకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు కాసాని జమానాలో, కేసీఆర్ సర్కారును విమర్శించేందుకే వణికిపోతున్న పరిస్థితి.

స్వయంగా అధ్యక్షుడి హూదాలో కాసాని ఇప్పటిదాకా ప్రెస్‌మీట్ పెట్టి, కేసీఆర్ సర్కారును విమర్శించలేని నిస్సహాయత. అసలు బీఆర్‌ఎస్ కార్పోరేటర్లుగా పనిచేస్తున్న ఆయన కుటుంబసభ్యులంతా, ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరని వెచిత్రి. ఇది కూడా చదవండి: తెలంగాణ తెలుగుదేశంలో మౌనరాగం

కాబట్టి చంద్రబాబుపై హరీష్ చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీపై అంతగా ప్రభావితం చేయకపోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎటొచ్చీ అధికారం లోకి రావాలని తపన పడుతున్న బీజేపీకే.. ‘కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాలు’ పెరగుతాయనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా చదవండి: కమలానికి ‘కిర్‌ణ్ ’ కష్టాలు

అయితే మరో కోణంలో హరీష్‌రావు తెరపైకి తెచ్చిన తెలంగాణవాదం వర్కవుటుంతా? బూమెరాంగవుతుందా? ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్ల వర్షం కురిపిస్తుందా? పాత సెంటిమెంటుతో తెలంగాణ సమాజం మళ్లీ బీఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకుంటుందా? లేక జాతీయ పార్టీగా మార్చి, తెలంగాణ పదాన్ని తొలగించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందా? అన్న సందేహాలపై కొత్త చర్చకు తెరలేచింది.

ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ను, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత, ఇలాంటి వాదానికి పస ఉండదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. వీటిని తెలంగాణ సమాజం పట్టించుకోదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి టీఆర్‌ఎస్ రద్దయిన తర్వాత.. తెలంగాణ పేరుతో రెండు లేదా మూడు పార్టీలే మిగిలాయి. ‘‘తెలంగాణ పేరు తొలగించిన కేసీఆర్ పార్టీకి, తెలంగాణ పేగు బంధం తెగిపోయింద’’ని.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సహా, తెలంగాణ ఉద్యమ నేతలంతా విమర్శించడాన్ని విస్మరించలేం.

మరో వైపు బీఆర్‌ఎస్‌ను, ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తున్న పరిస్థితి. అందులో భాగంగా కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర వెళ్లి, అక్కడ బహిరంగసభలు నిర్వహించారు. తాజాగా మహారాష్ట్ర పార్టీ కమిటీని కూడా ప్రకటించారు. మరోవైపు ఆంధ్రాలో కూడా బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటుచేసి, అధ్యక్షుడిని కూడా ప్రకటించారు. గుంటూరులో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లలేదు. అది వేరే విషయం.

పరాయి రాష్ట్రాల్లో పార్టీలను ఏర్పాటుచేయడంతోపాటు, ,స్వయంగా కేసీఆర్ వాటి సభలకు వెళుతున్న నేపథ్యంలో.. అదే పరాయి రాష్ట్ర నేతలను విమర్శిస్తే, తెలంగాణ సమాజం నమ్మే అవకాశం ఉండదన్నది, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

ఒకవైపు తాను ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తూ, మరోవైపు అదే ఇతర రాష్ట్రాల నేతలను విమర్శిస్తే, ప్రజల్లో విశ్వసనీయత ఉండదంటున్నారు. బీఆర్‌ఎస్ స్థాపన తర్వాత, తెలంగాణవాదుల్లో బీఆర్‌ఎస్‌పై ఉన్న భ్రమలు తొలగిపోయాయంటున్నారు.

LEAVE A RESPONSE