Home » యాక్..థూ..ఇదేం చిల్లర రాజకీయం?!

యాక్..థూ..ఇదేం చిల్లర రాజకీయం?!

-ఈనాడు, టీవీ వైసీపీకి గెలుస్తుందని చెప్పాయట
-సోషల్‌మీడియాలో చిల్లర ప్రచారం
-వైసీపీపై ఈసీకి వర్లరామయ్య ఫిర్యాదు
-రోత ప్రచారంపై జనం విస్మయం
(మార్తి సుబ్రహ్మణ్యం)

మనిషి శవాన్ని మోసుకుంటూ మధ్యలో కాసేపు కిందకు దించుతారు. మళ్లీ బతుకుతాడన్న దింపుడుకళ్లెం ఆశ. ఉత్తిదే. ఆ శవం ఛస్తే లేవదు. ఎందుకంటే అతరు చనిపోయాడు కాబట్టి. అది ఆ శవాన్ని మోసే వారికీ తెలుసు. కాకపోతే అదో చివరి ఆశ. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి చిల్లర శవ రాజకీయాలకు తెరలేచింది. అది కూడా పోలింగుకు ఒకరోజు మధ్య. ఇది కూడా ఒకరకంగా దింపుడు కళ్లెం ఆశలాంటిదే!

ఇంతకూ విషయమేమిటంటే.. వైసీపీని తీవ్ర ంగా వ్యతిరేకించే ఈనాడు దినపత్రిక, టీవీ 5 చానెళ్లు, ఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందని.. ప్రభుత్వ ఉద్యోగులంతా వైసీపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారట. ఆ మేరకు ఈనాడు పేరిట ఒక వార్తా కథనం, టీవీ 5లో ఒక స్క్రీన్‌షాట్ సోషల్‌మీడియాలో వదిలారు. అదో శునకానందం!

మెడపై తల ఉన్న వారెవరూ ఆ రెండు మీడియా సంస్థలూ వైసీపీకి జైకొడతాయని అనుకోరు. అలా అనుకున్నవారు ఆంధ్రాలో దొరికే బూమ్‌బూమ్ బీర్లుతాగేవారి కింద లెక్క. అందాకా ఎందుకు? సీఎం జగన్ ప్రతి సభలోనూ ఈనాడు, టీవీ 5ని తిట్టిపోస్తుంటారు. ఆ విషయం కూడా తెలియని, తెలివిలేని సోషల్‌మీడియా సైన్యం ఒక కట్టుకథను జనంలోకి వదిలితే, దానిని నమ్మడానికి ఆంధ్రా ఓటర్లేమైనా అమాయకులా? వెర్రిబాగులవాళ్లా?

ఈ శునకానంద ప్రచారం… జగన్ తన పార్టీని టీడీపీలో విలీనం చేస్తున్నట్లు.. ప్రధాని మోదీ కాంగ్రెస్‌కు ఓటేయని పిలుపునివ్వడం.. సోనియాగాంధీ బీజేపీకి ఓటు వేయమని కోరటం.. అసదుద్దీన్ ఓవైసీ ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడం.. కేసీఆర్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారనడం.. కేఏ పాల్‌కు అమెరికా అధ్యక్ష పదవి వచ్చిందని చెప్పుకోవడం లాంటిదే! ఎందుకంటే ఎవరూ నమ్మేవారు కాదు. ప్రజల చెవిలో పువ్వుపెట్టడమే.

వైసీపీ సోషల్‌మీడియా దళపతి సజ్జల భార్గవ్‌రెడ్డి సారథ్యంలోనే ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తున్నందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. రేపు ఈనాడు- టీవీ5 యాజమాన్యాలు కూడా బెజవాడలో కాకుండా, హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కాగల కార్యం తెలంగాణ పోలీసులు తీరుస్తారన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

Leave a Reply