Home Editorial ‘కమలం’తో జనసేన కటీఫ్?

‘కమలం’తో జనసేన కటీఫ్?

– చెప్పకనే చెప్పిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్
– కొందరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఫిర్యాదు
– రాష్ట్ర నేతల తీరుపై ఫిర్యాదు చేసినా కనిపించని ఫలితం
– ఉదయం నిర్ణయం సాయంత్రానికి మారిన వైనంపై అసంతృప్తి
– ఏపీలో సొంత పార్టీపై బీజేపీకి ఆసక్తి లేదని గ్రహించిన పవన్
– కలసి కదనంపై కలసిరాని ఏపీ కమలదళాలు
– బీజేపీ తీరుతోనే టీడీపీ వైపు చూడాల్సివస్తోందన్న పవన్
– బీజేపీతో ప్రయోజనం లేదని పవన్‌కు జనసైనికుల స్పష్టీకరణ
– స్థానిక సంస్థల ఫలితాలను పవన్‌కు గతంలోనే వివరించిన జనసేన నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీతో జనసేన సంబంధాలకు ఇక బ్రేక్ పడినట్లేనా? తాజా జనసేన సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాల సంకేతం అదేనని జనసైనికులు చెబుతున్నారు. దానికి కారణం రాష్ట్ర బీజేపీ నేతల నిర్లక్ష్యవైఖరి- రాజకీయాలపై అంచనా లేని అవగాహనా రాహిత్యమేనని స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో రూట్ మ్యాప్ కోసం తాను ఎంత ఎదురుచూసినా ప్రయోజనం లేదన్న పవన్ వ్యాఖ్యలు, బీజేపీకి ఏపీలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధ-అవగాహనకు నిదర్శమని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ కలసివస్తే టీడీపీ అవసరం లేనంతగా ఎదిగేవాళ్లమన్న పవన్ ఆవేదన పరిశీలిస్తే, బీజేపీపై పవన్ పెట్టుకున్న ఆశలు-అంచనాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో స్పష్టమవుతోంది.

నిజానికి అమరావతి ఏపీ రాజధాని అని, పవన్‌కు చెప్పిన బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆ మేరకు కార్యాచరణ ద్వారా, ఆయనకు నమ్మకం కలిగించడంలో విఫలమయింది. అమరావతిపై బీజేపీలోని నలుగురు నాయకులు భిన్నంగా మాట్లాడటాన్ని సహించలేని పవన్, ఆ విషయాన్ని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దానితోపాటు అమరావతికి మద్దతుగా లాంగ్ మార్చ్ పెడదామంటూ ఉదయం పవన్ ప్రతిపాదనను జాతీయ నాయకత్వం అంగీకరించింది. అయితే రాత్రికే బీజేపీ తన నిర్ణయం మార్చుకుని, అలాంటివేమీ వద్దని చెప్పడం పవన్ ఆగ్రహానికి కారణమయింది. దానితో.. ఏపీలో బీజేపీ బలపడేందుకు-విస్తరించేందుకు ఢిల్లీ నాయకత్వానికి పెద్దగా ఆసక్తి లేదన్న వాస్తవం పవన్‌కు ఆలస్యంగా అర్ధమయింది.

అందుకే ఆయన వేదిక సాక్షిగానే.. ‘‘మీరు చేయరు. మమ్మల్ని చేయనీయరు. అమ్మపెట్టదు. అడుక్కోనీయదన్నట్లు ఉంది బీజేపీ వ్యవహారం’’ అని తన మనసులో మాట వెళ్లగక్కడం ప్రస్తావనార్హం. బీజేపీ రాష్ట్ర నేతల వైఖరి వల్లనే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన లక్ష్యంలో టీడీపీ చేరిందని స్పష్టం చేయడం గమనార్హం. అంటే ఏపీ బీజేపీ నేతల వైఖరితో, పవన్ ఏ స్థాయిలో విసిగివేసారి పోయారో అర్ధమవుతోందని జనసేన నేతలు విశ్లేషిస్తున్నారు.

నిజానికి అనేకసార్లు రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారశైలి- అసమర్ధ నాయకత్వ నిర్ణయాలు- ప్రభుత్వంపై పోరాడకుండా పత్రికాప్రకటనలతో కాలక్షేపం చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలపై, పవన్ అనేకసార్లు జాతీయ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. జగన్ సర్కారుపై పోరాడేందుకు అనేక అంశాలున్నప్పటికీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆ దిశగా వెళ్లకపోతే, ఎన్నికల్లో పొత్తుకు వెళ్లినా ఏం ఉపయోగమన్నది పవన్ బీజేపీ నేతలకు తరచూ సంధించే ప్రశ్న.

పవన్‌ను గౌరవించి, ఆయన ఫిర్యాదులకు స్పందించినట్లే కనిపించే జాతీయ పార్టీ నేతలు, తర్వాత యధాతథ వైఖరినే కొనసాగించడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా.. ఏపీకి చెందిన కొందరు కీలక బీజేపీ నేతలు, వైసీపీ పాలకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది పవన్ ఫిర్యాదు. వారంతా వైసీపీ కంటే టీడీపీనే ఇంకా విమర్శిస్తున్నారని ఆయన పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు.

అధికారంలో ఉన్న వైసీపీపై పోరాడకుండా, విపక్షంలో ఉన్న టీడీపీని విమర్శిస్తే, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కారణంతోనే ఆయన ఒక దశలో తాను రాష్ట్ర నాయకత్వంతో మాట్వాడనని, మీతోనే మాట్లాడతానని స్పష్టం చేయాల్సి వచ్చిందంటున్నారు.

ఓవైపు తెలంగాణలో బీజేపీ అక్కడి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాడుతుంటే.. తెలంగాణకు మించి అరాచకాలు జరుగుతున్న ఏపీలో.. ఎందుకు ఉద్యమాలు చేయరని పవన్, జాతీయ పార్టీ నేతలను చాలాసార్లు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే వారి నుంచి నిర్దిష్టమైన సమాధానం లేకపోవడం, వైసీపీతో సంబంధాలపై స్పష్టత లేకపోవడంతో ఇక ఆ అంశాన్ని ప్రస్తావించడం మానేశారని జనసేన నేతలు చెబుతున్నారు.

ప్రధానంగా… తనపై ముప్పేట దాడి చేస్తున్న వైసీపీతో, బీజేపీ ఒక అవగాహనకు వచ్చి సత్సంబంధాలు కొనసాగించడాన్ని, పవన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు జనసేన నేతల కథనం. ఒకవైపు బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తామంటున్న రాష్ట్ర నాయకత్వం.. మరోవైపు వైసీపీతో పరోక్ష సంబంధాలు కొనసాగిస్తే, ఈసారి బలిపశువయ్యేందుకు తాము సిద్ధంగా లేమని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ అవ సరాల కోసం బీజేపీ అనుసరించే, ‘రెండు పడవల ప్రయాణ’ వ్యూహం, జనసేనను దెబ్బతీస్తుందన్నది జనసైనికుల అసలు ఆందోళన.

దానితోపాటు.. బీజేపీ వల్ల తమకు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని, జనసేన జిల్లా నేతలు పలు సమీక్షా సమావేశాల్లో పవన్‌కు స్పష్టం చేశారు. గత స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ నేతలు తమకు సహకరించకపోయినా, టీడీపీతో కలసి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లు సాధించిన విషయాన్ని వారు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత మండలం, జిల్లాలో కూడా బీజేపీ గెలవని వైనాన్ని పవన్‌కు జనసైనికులు వివరించారు.

స్థానికంగా బీజేపీకి పెద్దగా బలం లేదని, ఆ పార్టీ చేపట్టే రాజకీయ కార్యక్రమాలు కూడా ఏమీ లేనందున, కమలంతో కలసి వెళ్లడం వృధా అని పలువురు నేతలు పవన్‌కు స్పష్టం చేశారు. ఏ ఎన్నికల్లోనూ అన్ని సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టే స్థాయి లేని బీజేపీపై, ఆధారపడటం వృధా అన్నది జనసైనికుల వాదన. బీజేపీ నేతలు జనంలోకి వెళ్లకుండా, కేవలం మీడియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విశాఖలో పవన్‌పై దాడి జరిగినప్పుడు, బీజేపీ కంటే టీడీపీ నేతలే ఎక్కువగా స్పందించి, నిరసన వ్యక్తం చేశారని జనసైనికులు పవన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

గతంలో జనసేన రోడ్లపై నిలబడి ఫొటోలు తీసే నిరసన కార్యక్రమం నిర్వహించగా, దానికి బీజేపీ నేతలను ఆహ్వానించినా రాలేదని పవన్‌కు ఫిర్యాదు చేశారు. పైకి తాము ఇద్దరం కలసి ఆందోళనలు నిర్వహిస్తామని… బీజేపీ నేతలు మీడియాకు గొప్పలు చెప్పినా, ఏ ఒక్క కార్యక్రమానికీ తమకు ఆహ్వానం లేదని, పవన్ సైతం జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. ఇవన్నీ బీజేపీ పట్ల, మారిన పవన్ వైఖరికి ఒక ప్రధాన కారణమంటున్నారు.

అటు బీజేపీ సీనియర్లు సైతం.. పవన్ వంటి జనాకర్షణ నేత దూరం కావడానికి, తమ రాష్ట్ర నాయకత్వ వైఖరే కారణమని స్పష్టం చేస్తున్నారు. పార్టీకి చెందిన ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ విషయంలో, జనసేన పట్ల మొదటినుంచీ పూర్తి వ్యతిరేక భావనతో ఉండటం కూడా ఒక కారణమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశాల్లో సైతం.. తమ పార్టీ జనసేనతో వెళుతుందని ముసాయిదాలో రాస్తే, దానిని మార్చివేసి.. కలసివచ్చే వారితో వెళతామని మార్పులు చేయడంలో ఆయన పాత్ర ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

టీడీపీపై వ్యక్తిగత ద్వేషం ఉన్న కొందరు నేతలకు.. టీడీపీ-బీజేపీ-జనసేన కలవడం ఇష్టం లేదంటున్నారు. అందుకే టీడీపీకి దగ్గరవుతోన్న జనసేన, తనంతట తాను బయటకు వెళ్లేలా వ్యవహరించారని, బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

‘ మా పార్టీలో మేం ఎవరినీ బయటకు పంపం. వారంతట వారే వెళ్లేలా చేస్తాం. పాతవాళ్లు కొత్తవారిని రానీయరు. వచ్చినా వారిని ఎక్కువకాలం ఉండేలా చేయరు. అందుకు పవన్ కూడా మినహాయింపు కాదు. మాకు పొత్తు అవసరం లేదు. రాష్ట్రంలో ఎదగాలని కోరుకోరు. మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ గెలిస్తే స్వీట్లు పంచుకుంటాం. కానీ ఇకకడ బలపడి స్వీట్లు పంచుకోవాలని కోరుకోరు. అంటే అన్ని స్థానాల్లో మేం పోటీ చేయాలి. అలా నాలుగురాళ్లు వెనకేసుకోవాలి. ఇదే ఇప్పటి సిద్ధాంతం. ఇవేమీ తెలియని మా ఢిల్లీ నాయకత్వం, ఇక్కడి నేతలు చెప్పే మాటలు గుడ్డిగా పాటిస్తోంది. అసలు ఢిల్లీ వాళ్లకు కడ్రా ఏపీపై పెద్దగా ఆసక్తి లేదు. ఇక్కడ సీఎంగా ఎవరున్నా తాను చెప్పినట్లు వినేవాళ్లే ఉంటారన్న ధీమానే దానికి కారణం’ అని గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అసలు రహస్యం విశ్లేషించారు. కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్ వంటి నేతలను ఇదే వ్యూహంతో పంపించిన వైనాన్ని ఆ సీనియర్ నేత గుర్తు చేశారు.

NO COMMENTS

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com