Suryaa.co.in

Telangana

104 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ

– నియోజకవర్గాల వారీగా కేటాయింపులకు సన్నాహాలు చేయవల్సిందిగా వ్యవసాయశాఖను ఆదేశించిన మంత్రి తుమ్మల
– త్వరలో మహిళసంఘాలకు 381 డ్రోన్ల పంపిణీ
– జొన్న రైతులకు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలి
– రేపు జరగనున్న CACP దక్షిణ ప్రాంతీయ సమావేశంలో చర్చించాల్సిన విషయాల గురించి దిశా నిర్ధేశం చేసిన మంత్రి తుమ్మల
– ఎరువుల సరఫరాపై సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

హైదరాబాద్: రాష్ట్రంలో 2025-26 కి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించేల చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

రైతులకు ఉపయోగకరమైన మరియు డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిని సబ్సిడీపై రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కేటాయింపులు జరిపి, సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ పథకంలో సన్న, చిన్న కారు మరియు మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ”నమో డ్రోన్ దీదీ” కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళా సంఘాలకు అందించాల్సిందిగా సూచించారు. ఈ వానాకాలం సీజన్ కి నెల వారిగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులు, రాష్ట్రానికి సరఫరా అయిన ఎరువుల వివరాలు మంత్రికి అధికారులు తెలియజేయగా, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిత్యం సంప్రదింపులు జరపుకుంటూ, రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో వచ్చేటట్టు అధికారులు కృషి చేయాలన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి జెపి నడ్డాకి లేఖ రాయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో జూలై వరకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఆగస్టు మాసానికి సరిపడా ఎరువులను తెప్పించడానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు.

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు, జొన్న వివరాలు మరియు రైతుల చెల్లింపులపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఈ సారి 1,55,257 మెట్రిక్ టన్నుల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా సేకరించడం జరిగిందని, దీనికి సంబంధించి 91 వేల మెట్రిక్ టన్నులకు గాను రూ. 302 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తెలియజేశారు.

పొద్దతిరుగుడు సంబంధించి 4,333 టన్నులు సేకరించగా, అందుకు సంబంధించిన రూ. 31 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో అత్యధికంగా 35 వేల మెట్రిక్ టన్నుల జొన్నలను మాత్రమే మార్క్ ఫెడ్ ద్వారా సేకరించగా, దానికి మూడింతలు మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సేకరించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలు నిర్దేశించే వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ యొక్క దక్షిణ ప్రాంతీయ సమావేశాన్ని రేపు హైదరాబాద్, మారిగోల్డ్ హోటల్లో నిర్వహించనున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.

ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి వ్యవసాయ శాఖ అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొని, వారి సూచనలు, సలహాలు తెలియజేయనున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పెరిగిన సాగు ఖర్చులను ప్రతిబింబింప చేసి, రైతులకు ఇచ్చే మద్ధతు ధరలను డా. స్వామినాథన్ కమిటీ సిఫారస్ ల మేరకు CACP కేంద్ర ప్రభుత్వానికి సూచించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

LEAVE A RESPONSE