మగువా..నీదెంత తెగువ!

నేడు అహల్యాభాయి హోల్కర్ జయంతి
31.05.1725

ఆమె జీవితం
చరిత్ర ఎరుగని విజయం…
ఏ ధరిత్రి రాయని కావ్యం..
కాని..స్త్రీ శక్తికి ఆమె ప్రతీక..
భారతీయ సాంస్కృతిక
విజయ గీతిక..!

అహల్యాభాయి హోల్కర్..
ఇండోర్ రాణి..
గర్జించే ఆమె వాణి…
ఆడదంటే ఛాందస సంప్రదాయాల సమ్మెట దెబ్బలు తింటూ
నాలుగు గోడల నడుమ
నలిగిపోయే రోజుల్లో..
ఆ సంకెళ్లను తెంచుకుని
అయింది అధినేత్రి..
దుర్మార్గాలపై
మండే అగ్నిహోత్రి..!

ఎక్కడ సతీసహగమన చితి
భర్త మరణంతో ప్రాణత్యాగానికి
సిద్ధపడ్డ ముదిత..
ఒక్క క్షణం ఆలోచించి
రాజ్యాధికారాన్ని చేపట్టి
మగువగా లోకానికి చూపింది తన తెగువ!

నరనరానా పౌరుషం..
జీవితమంతా కష్టాలు..
అణువణువునా శివభక్తి..
ఈ రోజున నువ్వూ నేను
దర్శించి మురిసిపోయే
కాశీ,ద్వారక,మధుర, ఉజ్జయిని,రామేశ్వరం, అయోధ్య,హరిద్వార్..
ఈ ఆలయాల పునరుద్ధరణ
ఆ మహాతల్లి వితరణ..
ఇల్లాలు ఎంతో ముచ్చటగా
సింగారించుకునే
మహేశ్వరం చీర..
ఆ నెలత శ్రీకారం
చుట్టిన నేత!

అదిగదిగో..
ఇండోర్ హవాయ్ అడ్డాలో ఆమె విగ్రహం..
ఆమె దర్పాన్ని ప్రదర్శిస్తూ
అహరహం..
చిలకమర్తి ఆమె జీవితంపై
రాసిన నవల..
ఒకనాటి విద్యార్థులకు
పాఠ్యాంశం..
చదివితే ఇప్పటికీ
ఒడలు పరవశం..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286