భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో ఎయిరిండియా కోత

7

కేబిన్ క్రూ కొరత కారణంగా నిర్ణయం
నెవార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లే విమానాల్లో వారంలో మూడేసి కోత
మూడు నెలలపాటు ఇంతేనన్న సంస్థ సీఈవో క్యాంప్‌బెల్

విమాన సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాల సంఖ్యను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు తెలిపింది. వచ్చే రెండు మూడు నెలల వరకు ఇది కొనసాగుతుందని ఆ సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. నెవార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లే వాటిలో మూడేసి విమానాల చొప్పు వారంలో ఆరు సర్వీసులను తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో బోయింగ్ 777 విమానాల కోసం తమకు 100 మంది పైలట్లు ఉంటారని, 1,400 మంది క్యాబిన్ సిబ్బంది శిక్షణలో ఉన్నట్టు క్యాంప్‌బెల్ తెలిపారు. అయితే, కేబిన్ క్రూ కొరత దీర్ఘకాల విమాన ప్రయాణ సర్వీసులపై ప్రభావం చూపుతోందన్నారు. అందుకనే కొన్ని అమెరికా మార్గాల్లో సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఎయిరిండియాలో ఫ్లైయింగ్, నాన్-ఫ్లైయింగ్ ఉద్యోగులు ప్రస్తుతం 11 వేల మంది వరకు ఉన్నారు.
– ఫణి