జగన్ రెడ్డి చెబుతున్న రైతు సంక్షేమమంతా అబద్ధాలు

• తప్పుడు ప్రకటనలతో సాక్షి మీడియాను బాగుచేయడంలోనే కనిపిస్తోంది
• రైతుభరోసా కేంద్రాలు రైతుభక్షకకేంద్రాలుగా మారాయి
• జగన్ రెడ్డి రైతుల్ని ఉద్ధరించేవాడయితే టీడీపీప్రభుత్వంలో వ్యవసాయరంగానికి అమలైన పథకాలను ఎందుకు నిలిపేశాడు?
• చంద్రబాబుహయాంలో అమలైన రైతురథం, డ్రిప్ స్ప్రింక్లర్లు, విత్తనాలు, పోషకాల పంపిణీ, నాగళ్లు, గొర్రులు, స్ప్రేయర్లు, ఇతరయాంత్రీకరణ పరికరాల పంపిణీ ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పు జగన్ రెడ్డి?
• వైసీపీప్రభుత్వం, ఈనెలాఖరు నాటికి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా సొమ్ము చెల్లించకుంటే, నవంబర్ లో తెలుగురైతువిభాగం కలెక్టరేట్లను ముట్టడిస్తుందని హెచ్చరిస్తున్నాం.
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

జగన్ రెడ్డి జమానాలో రాష్ట్రరైతాంగం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని, పంటలు వేయాలన్నా, పండిన ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా, వైసీపీనేతలు, ఆపార్టీ కిందపనిచేసే దళారుల దెబ్బకు అన్నదాతలకు నరకం కనిపిస్తోందని, ఇవేవీ తెలియనట్లుగా ముఖ్యమంత్రి మాత్రం మీడియాలో అబద్ధపుప్రకటనలిస్తూ అన్నదాతల్ని వంచిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“గౌరవ అబద్ధాల, అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాక్షిమీడియా పోషణార్థం వైఎస్సార్ రైతుభరోసాపథకం తీసుకొచ్చాడు. ఈ పథకంకింద రైతాంగానికి పెద్దఎత్తున మేలుచేస్తున్నట్లు ప్రజల్లో దురభిప్రాయం కలగచేయడానికి జగన్ రెడ్డి తాపత్రయ పడుతున్నాడు. ఆక్రమంలో నేడు నంద్యాలలో బహిరంగసభపెట్టి, అలవోకగా అబద్ధాలు వల్లె వేశాడు. వందలకోట్ల ప్రభుత్వసొమ్ముతో తన అనుకూలమీడియాలో బూటకపు ప్రకటనలకు తెరతీశాడు.తాను అధికారంలోకి వచ్చాక రూ.లక్షా33వేల562కోట్లపైచిలుకు పైగా రైతులకు సాయం చేసినట్లు తప్పుడు సమాచారంతో ప్రకటనలిచ్చాడు. కాకాణి గోవర్థన్ రెడ్డి అంటే సిగ్గులేనివాడు.. ఉచ్ఛం నీచంలేని వాడు, ఏదిపడితే అదిమాట్లాడతాడని ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తికూడా సిగ్గులేకుండా ఏదిపడితే అదిచెబితే ఎలా?

ఇచ్చింది రూ.14వేలుకోట్లు.. చెబుతున్నది రూ.లక్షా33,562కోట్లు..!
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు ఏరూపంలో చేసిన సాయమైతేనేం మొత్తం రూ.14వేల కోట్లకు మించదు. రూ.14వేలకోట్లుఎక్కడ… ప్రకటనల్లో చెప్పిన రూ.లక్షా 33వేల562కోట్లు ఎక్కడ? కానీ చంద్రబాబు హాయాంలో గతఐదేళ్లలో రూ.30వేలకోట్ల పైచిలుకు సొమ్ము రైతులకు అందింది. ఏ కంపెనీకి ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్ముకట్టి, జగన్ రెడ్డి వైఎస్సార్ ఉచిత పంటలబీమా కింద రాష్ట్రంలోని రైతులకు రూ.6,684కోట్లు ఇచ్చాడో సమాధానం చెప్పాలి. రైతులసమస్యలకు సర్వరోగ నివారిణి రైతుభరోసా కేంద్రాలని ముఖ్యమంత్రి చెబుతుంటాడు. వాస్తవంలో అవి రైతుభక్షక కేంద్రాలుగా మారాయి. జగన్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ఏనాడైనా స్వయంగా ఏరైతు భరోసాకేంద్రానికి అయినా వెళ్లి, అక్కడ అన్నదాతలకు అందుతున్న సేవలపై ఆరాతీశారా? నయారైతుదోపిడీ కేంద్రాలుగా ఆర్ బీకే లు మారాయి.

రైతు పండించిన ధాన్యం కొనుగోలుచేసి, దానితాలూకా సొమ్ముని ప్రభుత్వం ఇస్తే, అది రైతుకి సాయం చేసినట్టా? ఖరీఫ్, రబీ సీజన్ లలో కొనుగోలు చేశామని చెబుతున్న 60లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యంలో 10శాతమైనానేరుగా రైతులనుంచి ప్రభుత్వం సేకరించిందా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిలు పెదవాలంటీర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేత్రత్వంలో, ధాన్యంకొనుగోళ్లపేరుతో రైతుల్ని ఎంతదారుణంగా దోచుకున్నారో జగన్ కి తెలియదా?

జగన్ రెడ్డి చెబుతున్నట్టుగా ఆయనప్రభుత్వం రూ.53వేలకోట్ల విలువైన పంటఉత్పత్తుల్ని రైతులనుంచి కొనుగోలుచేసిఉంటే, కేంద్రంనుంచి ఎఫ్.సీ.ఐల ద్వారా రైతులకు వచ్చినసొమ్ముతో వైసీపీనేతలు దోచుకున్నదెంత? జగన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఆర్ బీకే కు వెళ్లినా, ధాన్యంకొనుగోళ్లు ఎంతసక్రమంగా జరిగాయో తెలుస్తుంది. మెట్రిక్ టన్నుధాన్యానికి రూ.19,600లకు కొనాల్సి ఉండగా, రైతుభరోసా కేంద్రాల ముసుగులో వైసీపీనేతలు, వారికింద ఉండే దళారులు నాణ్యత, తేమశాతం పేరుతో మెట్రిక్ టన్నుకి కేవలం రూ.13వేలు మాత్రమే చెల్లించింది వాస్తవంకాదా? రూ.53వేలకోట్ల పంటఉత్పత్తులుకొన్నట్టు జగన్ రెడ్డి చెబుతున్నారు. కానీ వాస్తవంలో ఆసొమ్ములో దాదాపు రూ.18వేలకోట్లపైచిలుకు సొమ్ము వైసీపీనేతలు, అధికారపార్టీకనుసన్నల్లో పనిచేసే దళారుల జేబుల్లోకివెళ్లింది. రైతుల ముసుగులో వారినినిలువునా దోచుకుంటున్న జగన్ రెడ్డి, టీడీపీప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అమలైన అనేకపథకాలను నిలిపేశాడు. రైతురథం, డ్రిప్ స్ర్పింక్లర్ల పంపిణీ, నాగళ్లు, గొర్రులు, రొటేవేటర్లు, ఇతరత్రా యాంత్రీకరణ పరికరాలు, విత్తనాలు, ఎరువుల్ని మండలకేంద్రాల్లో టీడీపీప్రభుత్వం రైతులకు అందించింది. జగన్ రెడ్డి జమానాలో కనీసం నాగలికి వేసే బోల్ట్ కూడా ఇచ్చిందిలేదు.

చంద్రబాబునాయుడి హయాంలో 7లక్షలఎకరాలు… జగన్ రెడ్డి వచ్చాక ఒక్కఎకరా లేదు
వ్యవసాయరంగానికి చంద్రబాబునాయుడు ఎనలేని ప్రాధాన్యతఇచ్చారు కాబట్టే, రూ.64వేల కోట్లతో నిర్మాణంచేపట్టి, ప్రాధాన్యతాక్రమంలో 23సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తిచేశారు. 7లక్షల ఎకరాల భూముల్ని కొత్తగా సాగులోకి తీసుకొచ్చారు. జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో ఒక్క ఎకరాకైనా కొత్తగానీరందించాడా? అరశాతం ఆయకట్టునైనా స్థిరీకరించాడా? చంద్రబాబునాయుడు రైతురుణమాఫీలో భాగంగా ఇచ్చిన జీవోలను జగన్ అధికారంలోకి రాగానే రద్దుచేశాడు. అన్నదాతాసుఖీభవ కింద ప్రతిరైతుకి అందాల్సిన రూ.15వేలను నిలిపివేయించాడు.

తన అప్పులకోసం, తనపై ఉన్న అవినీతికేసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి జగన్ రెడ్డి ఏకంగా కేంద్రానికి సాగిలబడి రైతులమోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. అన్నిరాష్ట్రాలు కేంద్రషరతులను నిర్ద్వందంగా తిరస్కరిస్తే, జగన్ రెడ్డి ఒక్కడే ఏపీ రైతాంగం మెడకు ఉరితాడు బిగించడానికి సిద్ధమయ్యాడు. ఆక్వారైతుల అవస్థలు ఈ ప్రభుత్వంలో వర్ణనాతీతం. ఆక్వారైతులకు ఉచితంగా ఫీడ్, విద్యుత్ ఇస్తున్నానని జగన్ రెడ్డి పచ్చిఅబద్ధాలు చెబుతున్నాడు. టీడీపీప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరిపథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిబోర్లు వేయించి, ఉచితంగా విద్యుత్ కనెక్షన్ అందించింది.

విద్యుత్ సౌకర్యంలేని చోట సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేసి, విద్యుత్ ఇచ్చారు. ఎన్టీఆర్ జలసిరి పథకం పేరుని ‘వైఎస్సార్ జలకళ’ గా మార్చిన జగన్ మోసపురెడ్డి ఎంతో ఆర్భాటంగా, రూ.24వేలకోట్ల నిధులు ఆపథకానికి కేటాయిస్తున్నట్లు, 10లక్షలఎకరాలకు నీరుపారిస్తున్నట్లు అబద్ధాలసాక్షిపత్రిలో ప్రకటనలు వేయించాడు. వైఎస్సార్ జలకళ పథకం ఏమైందో,ఎన్నిఎకరాలకు నీరిచ్చాడో జగన్ చెప్పగలడా? రూ.3వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏమైందో, సుబాబుల్ జామాయిల్ కలప మెట్రిక్ టన్ను రూ.5వేలకు కొంటానన్న హామీఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా సొమ్ము తనమూడున్నరేళ్లపాలనలో ఎందరురైతుల ఖాతాలకు జగన్ రెడ్డి జమచేశాడు? రైతుభరోసాకేంద్రాల్లోని పట్టికల్లో కనిపించేరైతులు ఎవరికీకూడా జూన్ లో ఇస్తానన్న పంటలబీమా సొమ్ము అక్టోబర్ వచ్చినా నేటికీ అందలేదు.

అక్టోబర్ నెలలో గడచిన 15రోజుల్లో కురిసినఅధికవర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడైనా ఒక ఎకరాకు నష్టపరిహారం ఇచ్చాడా ఈ జగన్ రెడ్డి? ఒక అబద్ధాన్ని 4సార్లు చెప్పడం, నలుగురితో పదేపదే చెప్పించడం, దానిపైనే సాక్షి మీడియాలో తప్పుడు ప్రకటనలివ్వడం ఇదే జగన్ హాయాంలో అమలవుతున్న రైతుసంక్షేమం. జగన్ రెడ్డి ఆలోచనాతీరు ఉష్ణపక్షిమాదిరి ఉంది. ఇసుకలో తలపెట్టిదాక్కునే ఉష్ణపక్షి తనను ఎవరూచూడటంలేదన్నుకున్నట్లే ముఖ్యమంత్రి తానుచేసే తప్పులు, మోసాలు, దోపిడీని ప్రజలు గమనించడంలేదులే అనుకుంటున్నాడు.

అక్టోబర్ నెలాఖరునాటికి జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుభరోసాకేంద్రాల్లోని పట్టికల్లోఉన్న రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమాసొమ్ము అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈనెలాఖరుకి రైతులకు న్యాయంచేయకుంటే, నవంబర్ లో తెలుగురైతువిభాగం జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తుందని ముఖ్యమంత్రిని, కాకాణి గోవర్థన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. రైతాంగాన్ని అవమానపరిచేలా జగన్ ప్రభుత్వం తక్షణమే తప్పుడ ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలి” అని మర్రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply