Suryaa.co.in

Telangana

ఈ ఒక్కసారికీ అనుమతించండి: తలసాని

ఈ సంవత్సరం యధావిధిగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఇప్పటికి ఇప్పుడు పాండ్స్ ఏర్పాటు చేయడం అంటే ఎంతో కష్టం అని అన్నారు. GHMC పరిధిలో సుమారు 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని, ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదని వివరించారు.
భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని పెద్ద మనసుతో ఈ సంవత్సరం యధావిధిగా విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోర్టు ను కోరుతున్నట్లు చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం తో ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. విగ్రహాల నిమజ్జనం జరిగిన 48 గంటలలో వ్యర్ధాలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని స్పష్టం చేశారు. గణేష్ శోభ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఆయన వెంట ఖైరతాబాద్ MLA దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, చైర్మన్ సుదర్శన్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE