Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని టీడీపీ నేతలు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సంధర్బంగా…మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ… పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాయంగా త్యాగం చేశారు. ఇది తెలుగు ప్రజల పట్ల ఆయనకు ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తోంది. నాడు తెలుగువారికి మద్రాసు రాష్ట్రంగా ఉండి తెలుగువారు నిత్యం అవమానాలు, వేధింపులకు గురయ్యేవారు. ఆ పరిస్థితుల్లో పొట్టిశ్రీరాములు గాంధీ మార్గంలో పోరాటం చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ……భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు పొట్టి శ్రీరాములు. నాడు మద్రాస్‌ రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలు, అవమానాల్ని సహించలేక ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధ్యమం ప్రారంభించారు. 54 రోజులు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్‌ 15 మరణించారు. ఆయన దీక్ష ఫలితంగా అక్టోబరు 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం పొట్టి శ్రీరాములు కృషి చేశారు.

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీ రాములు పోరాటం చేస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ పోరాటం చేశారు. తెలుగు జాతి అభివృద్ది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. పొట్టి శ్రీరాములు స్పూర్తితో రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టినప్పుడే పొట్టి శ్రీరాములుకి ఘనమైన నివాళి అని గురజాల మాల్యాద్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్వనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్, టీ.ఎన్.టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టెముక్కల రఘరామ్, పాతర్ల రమేష్, చప్పిడి రాజశేఖర్, హసన్ బాష, పర్చూరి కృష్ణ, వలివేటి కృష్ణ, కొత్తూరు వెంకట్, వీరంటి వరప్రసాద్ బాబు, అరవపల్లి శ్రీనివాస్, తల్లం సత్యనారాయణ, కొనకళ్ల సత్యం, హెచ్ ఆర్ డి మెంబర్ రాజేంద్రప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, ఆర్యవైశ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE