– 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు
– దేశానికి దిక్సూచిగా అమరావతి క్యాంటం వ్యాలీ పార్క్
– కర్టైన్ రైజర్ కార్యక్రమంలో క్వాంటం టెక్నాలజీ నిపుణుల అభిప్రాయం
– జూన్ 30 తేదీన అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై వర్క్ షాప్
– నేషనల్ వర్క్ షాప్ లో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాధాన్యాలను అవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ: గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సన్నాహకంగా విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించింది.
జూన్ 30 తేదీ విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలపై భాగస్వాములను ఒక్క చోటకు చేర్చేలా ఈ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఒక్క రోజు నిర్వహించే వర్క్ షాప్ లో క్వాంటం హార్డ్ వేర్ సహా కీలకమైన అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ వర్క్ షాప్ లో ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సహా వివిధ ఐఐటీల నుంచి ప్రోఫెసర్లు, నిపుణులు, గ్లోబల్ లీడర్లు ప్లీనరీ సెషన్లకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించనున్నారు. దీనిపై అమరావతి డిక్లరేషన్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ బుక్ ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు.
ఈ అంశంపై విజయవాడలో నిర్వహించిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, టీసీఎస్ సలహాదారు, జాతీయ క్వాంటం మిషన్ సభ్యులు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్, ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ, ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందడుగు వేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్
రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాజధాని అమరావతిలో ప్రఖ్యాత ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటరును అమరావతిలో ఏర్పాటు చేయనుంది. రెండు 156 క్యూబిట్ క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇన్ స్టాల్ చేయనుంది. ఇక దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక మరో సంస్థ టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్సును అందించనుంది.
వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి రంగం సహా వేర్వేరు రంగాల్లో సేవలు అందించేలా ఈ క్వాంటం వ్యాలీ సిద్ధం కానుంది. 2026 జనవరి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి సేవలందిస్తుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ “అమరావతిలో 2026 జనవరి నాటికి భారత దేశ మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభం అవుతుంది. ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, ఆగ్రిటెక్, మెడ్ టెక్ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సేవలు వినియోగించుకోవచ్చు.
భవిష్యత్తులో లక్షల మంది అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉంది. స్టార్టప్ లతో పాటు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కూడా క్వాంటం వ్యాలీ పార్క్ ద్వారా వస్తాయి. ఏపీలో యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్యాలు కూడా కల్పిస్తాం. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే అమరావతి క్వాంటం వ్యాలీ సెంటర్ పనిచేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ఉద్పాదక పెంచుతుంది. తద్వారా సంపద, సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది” అని కాటంనేని అన్నారు.
క్వాంటం రివల్యూషన్ అందిపుచ్చుకునే మొదటి రాష్ట్రం ఏపీ
క్వాంటం టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే తొలిరాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందని ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. సమీప భవిష్యత్తులో ఊహించనంత వేగంగా క్వాంటం టెక్నాలజీ జనజీవితంలోకి వచ్చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ “క్వాంటం కంప్యూటింగ్ అనేది చాలా వేగంతో, ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటం క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయి.
బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, రక్షణ రంగం, వైద్యారోగ్యం, విద్య ఇలా వేర్వేరు రంగాల్లో విస్తృతంగా క్వాంటం వినియోగంలోకి వచ్చేస్తోంది. నెలలు, ఏళ్లు పాటు పట్టే పరిశోధనా సమయం క్వాంటం టెక్నాలజీతో నిముషాలు, గంటల్లోకి వచ్చేస్తుంది. పరిశోధన, ఉత్పత్తుల రూపకల్పన చేసే విధంగా క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది.
రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో నిష్ణాతులు కాబట్టి ఈ రివల్యూషన్ ను అందిపుచ్చుకుని లీడ్ చేయగల సత్తా ఏపీకి ఉంది. ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఏపీ కీలకమైన స్థానానికి చేరుతుంది. క్వాంటం టెక్నాలజీ, క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై దేశం అంతా ఇప్పుడు ఏపీ వైపు, అమరావతి వైపు చూస్తోందని” అని ప్రద్యుమ్న వివరించారు.
దేశానికి దిక్సూచిగా అమరావతి క్యాంటం వ్యాలీ పార్క్
విద్యా, వైద్యం, రక్షణ రంగాలు, ఫార్మా, ఉత్పాదక రంగాలకు క్వాంటం టెక్నాలజీ ఊహించలేనంత ప్రయోజనకారి అవుతుందని ఈ కర్టైన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన క్వాంటం టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ పై పరిశోధనలు సాగుతున్నాయని టీసీఎస్ సలహాదారు, నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్ అన్నారు. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ వినియోగం చేయొచ్చని తెలిపారు.
అలాగే స్టాక్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తృత సేవలు అందిస్తోందని వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్ లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతోందని అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ పార్క్ దేశానికి ఓ దిక్చూచిగా మారుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్వాంటం కంప్యూటింగ్ వినియోగంతోపాటు ఆ రంగంలో పెట్టుబడులు విస్తృతంగా పెరుగుతున్నాయని ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ తెలిపారు.
ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు ఓ కీలక పరిణామం అన్నారు. 2029 నాటికి స్టార్లింగ్ అనే ఓ భారీ స్థాయి క్వాంటం కంప్యూటింగ్ సిస్టం ఐబీఎం రూపోందిస్తోందని తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన క్వాంటం కంప్యూటరును అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
అలాగే లాజిస్టిక్స్, సప్లై చైన్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్ కేర్, రోబోటిక్స్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ ప్రధాన పాత్ర పోషించనుందని ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు తెలిపారు. రిస్క్ ఎనాలిసిస్, క్లైమేట్ చేంజ్, క్రిప్టోగ్రఫీ ఆప్టిమైజేషన్ లాంటి అంశాలకు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తరిస్తోందన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ సెంటర్లో ఐబీఎం, టీసీఎస్ సంస్థలతో కలిసి ఎల్ టీఐ మైండ్ ట్రీ కూడా భాగస్వామ్యం వహిస్తోందని తెలిపారు.