– రాజకీయ శరణార్ధిగా కుదరదన్న అమెరికా
– ఇక ప్రభాకర్ హైదరాబాద్‌కు రాక తప్పదు
– 20 లోగా రాకుంటే ప్రకటిత నేరస్ధుడే
– ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే అధికారం
హైదరాబాద్: కేసీఆర్ జమానాలో విపక్షాలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటీనటుల ఫోన్లపై అడ్డగోలు నిఘా వేసి.. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న, నాటి నిఘా దళపతి ప్రభాకర్‌ను అమెరికా మెడపట్టి గెంటేయనుంది. తనను రాజకీయ శరణార్ధిగా పరిగణించాలన్న ఆయన పిటిషన్‌ను అమెరికా కొట్టేసింది. ఇప్పటికే తన దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని గెంటేస్తున్న అమెరికా, ప్రభాకర్‌రావును కూడా గెంటేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ప్రభుత్వ అధికారుల వాదన బట్టి స్పష్టమయింది.
తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ అధిపతి టి. ప్రభాకర్‌రావు పెట్టుకున్న అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఈ కేసులు బనాయించారని ప్రభాకర్‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, అమెరికా అధికారులు ఆయన వాదనను అంగీకరించలేదు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయగా, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ ఆయనపై రెడ్ కార్నర్ నోటీసును కూడా జారీ చేసింది. ప్రభాకర్‌రావు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నారనే సమాచారాన్ని అమెరికా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావును తిరిగి భారతదేశానికి రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల సహాయం తీసుకుంటున్నారు.
జూన్ 20వ తేదీలోగా దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు ఆయన ఇంటి గోడకు నోటీసులు కూడా అంటించారు. నిర్దేశిత గడువులోగా హాజరుకాని పక్షంలో, ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు హెచ్చరించింది. తాజా పరిణామాలతో హైదరాబాద్‌కు రావడం అనివార్యంగా మారింది.