– నేడు రూ. 13వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోడీ
– త్వరలో రాజధానిలో ఒకేసారి 12 బ్యాంకు పనులకు శంకుస్థాపన
– గూగుల్ డేటా సెంటర్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఏపీ
– ఉద్యోగ, ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– పీఎం మోడీ, సీఎం చంద్రబాబులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
– వికేంద్రీకరణ విధానంలో అభివృద్ధికి ఏపీ ఓ నిర్వచనం
– డబులింజన్ సర్కార్ వల్ల ప్రయోజనాలేంటో ప్రజలు తెలుసుకుంటున్నారు
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి : డబులింజన్ సర్కారు కృషి ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల సమిష్టి కృషి వల్లే రాష్ట్రంలో పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖపట్నంలో అతి పెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ సంస్థ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం హర్షణీయమన్నారు. దీనివల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోవడమే కాకుండా, ప్రపంచదేశాల దృష్టిని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలిగిందన్నారు. విశాఖలో కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)కు సంబంధించి అనేక పరిశ్రమలు రాబోతున్నాయన్నారు.
గూగుల్ సంస్థ విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టడం వెనుక ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల అలుపెరుగని కృషి దాగిఉందన్నారు. డబులింజన్ సర్కారు కృషితో విశాఖపట్నాన్ని ఫార్మా రాజధానిగా మార్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాని మోడీ నేడు కర్నూలు పర్యటన సందర్భంగా రూ. 13, 000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. సి ఆర్ డిఏ పరిథిలో 12 వివిధ బ్యాంకుల కార్యాలయాల నిర్మాణానికి సంబందించిన కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.
వికేంద్రీకరణకనుగుణంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి
ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధిలో వెనకడుగు వేయకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఒకేరాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నదే కూటమి ప్రభుత్వ నినాదమన్నారు. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే అనంతపురం, కర్నూలు జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీలు, పంప్డ్ స్టోరేజీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ లు గా అభివృద్ధి చేస్తున్నామని, ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ఆ జిల్లాల్లో కల్పిస్తున్నామన్నారు.
నెల్లూరు, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ గ్రేటర్ ఎకోసిస్టమ్ లో అనేక పెట్టుబడులు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నదని చెప్పారు. అమరావతి రాజధాని క్వాంటం టెక్నాలజీలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. ఇలా అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్వచనం అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాలని ప్రధాని మోడీని ఆహ్వానించాం
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంస్థలకు ఇక్కడి వాతావరణం గురించి తెలియజేసి, పెట్టుబుడులు పెద్ద ఎత్తున ఆకర్షించేలా నవంబరు 14,15 తేదీల్లో విశాఖపట్నంలో భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి మోదీని ప్రభుత్వం తరఫున ఆహ్వానించారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయన్నారు.