– ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
కర్నూలు : అబ్దుల్ కలాం కలలను సాకారం చేయడం యువత లక్ష్యంగా పెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ సూచించారు. అబ్దుల్ కలాం జయంతి కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో బుధవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా మాధవ్ పాల్గొని, మాట్లాడారు. తొలుత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు చే ప్రారంభించిన కళాశాలలో అబ్దుల్ కలాం జయంతి జరుపుకోవడం విశేషమన్నారు.
అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగానే కాకుండా దూరదృష్టి గల నాయకుడు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవంగా చూడేలా చేసిన వ్యక్తి. ఆయన జీవితమంతా క్రమశిక్షణ, జ్ఞానం, కృషికి ప్రతీక. నేటి యువత కలాం జీవితం నుండి స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధి దిశగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. భారత మాజీ రాష్ట్రపతి, దేశరక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించిన మిసైల్ మ్యాన్, క్షిపణిశాస్త్ర విజ్ఞాన రంగంలో చిరస్మరణీయ సేవలు అందించారని కొనియాడారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న తపనతో “కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అంటూ ఆయన ఇచ్చిన సందేశాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, మైనారిటీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాష, సునీల్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ నేతలు, అధ్యాపకులు విద్యార్థినివిద్యార్థులు, పాల్గొన్నారు.