Suryaa.co.in

Devotional

తరతరాల స్ఫూర్తిప్రదాత

యవత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి!

” భూతలమునందు పర్వతములును., నదులును ఉన్నంతవరకును రామాయణ కథ లోకములో వ్యాపించి ఉండును”

ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు.

*కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రత!!
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ కాలం లో, ఈ లోకంలో గుణవంతుడు,
యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు,
చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు,
అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు,
అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు…
అలా షోడశ(16) గుణములు చెప్పి ఇవన్నీ ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా?
అని వాల్మికి మహర్షి అడుగుతాడు.

మహర్షీ, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..!
కానీ నేను గమనించిన అలాంటి ఒక మనుష్యుని గురించి మీకు చెపుతాను అని శ్రీరాముని గుణగణాలు వర్ణిస్తాడు.

అలాంటి గుణములు గల మానవుడు శ్రీరాముడు
ఈ కర్మ భూమి మీదే నడయాడాడు.

భరత ఖండం పుణ్యభూమి. సీతా రాములు నడయాడిన పవిత్ర భూమి. యావత్ప్రజ రాముని వైపు నడిచిన భూమి.

శ్రీమన్నారాయణుడే
మానవుని గా ఈ భూమిపై అవతరించి రాజు గా ధర్మాన్ని ఎలా పరి రక్షించాలో .
ఒక కొడుకు గా పితృవాక్య పరిపాలన ఎలాచేయాలో,
ఒక అన్నగా భాతృధర్మాన్ని ఎలా పాటించాలో,
ఒక చక్రవర్తిగా భువిని ఎంత ధర్మంగా పాలించాలో, స్నేహధర్మానికి ఎలా కట్టుబడాలో తానే చేసిచూపించాడు.
ఏకపత్నీవ్రతుడైన సీతాపతిగా మనోనిగ్రహరూపుడుగా, కమలదళాయదాక్షుడు నిశాచర భయంకరుడు, ధర్మాన్ని పోతపోస్తే దర్శనమిచ్చే రాశీభూతమైన స్వరూపము కలవావాడు, ఋషులు ,బ్రహ్మాది దేవతలు , మానవులు కొనియాడి పూజింపబడిన వాడొక్కడే. ఆయనే శ్రీరామచంద్రుడు.
చంద్రునికైనా హెచ్చుతగ్గులంటాయి గానీ,
రాముని కీర్తి అనే వెన్నెల ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది.

రామ చరితం
కడు రమణీయం, సదాస్మరణీయం
ఆ జగదభిరాముడు ఈ భూమి మీద అడుగుపెట్టి ఎన్నో యుగాలైనా ఇప్పటికీ చెక్కు చెదరని మనోజ్ఞ శిల్పం రామాయణ కధ.

ప్రస్తుత సమాజంలో మసకబారుతున్న విలువలు, త్వర త్వరగా నశిస్తున్న ధర్మం, ఏది పాపం? ఏది పుణ్యం అనే అనుచితమైన సందేహాలు కలియుగంలో మనుషుల్ని కలవరపరుస్తూ అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం తాపత్రయంలో పడి వజ్రసదృశమైన ధర్మాన్ని వీడి కొట్టుమిట్టాడుతున్న మనుషులను , సక్రమ మయిన మార్గం లో నడిపించే రామాయణo ఒక మహోన్నత కావ్యం.

మనిషిని మనీషిగా మహనీయునిగా నిలబెట్టే *మార్గదర్శి
అయోధ్యకాండలో,
కైక వర ఫలితంగా , అడవులకి ఏగ వలసిన రాముణ్ణి, లక్ష్మణుడు “ రాజ్యం కోసం తండ్రి దశరధుని మీద యుద్దం చేయ మంటాడు.
అప్పుడు రాముడు ఒక్క మాట అంటాడు..
లోకములో అన్నిటికన్నా శ్రేష్టమయినది ధర్మమే ధర్మమునందు సత్యము నిలిచి వుంది.
తండ్రిగారు తల్లి కైక కి ఇచ్చిన మాట కూడా ధర్మాన్ని ఆశ్రయించే వుంది.
మాట తప్పడం అన్నది ధర్మానికి గ్లానీ జరగడమే.”

నేను తండ్రి ఆజ్ఞను శిరసా వహించుతాను తప్ప మరొక్క మాట లేదు. అని రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించాడు.

అలాంటి వారు ఇప్పుడు కనగలమా?

తల్లిదండ్రులను వృధ్ధాశ్రమాలకు తరలించే కాలం నడుస్తోంది.

నీతి అనే పదానికి అర్ధం మారిపోతోంది. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు చిల్లిగవ్వ కోసం ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే కలికాలం నడుస్తోంది.

సోదరప్రేమ మృగ్యమైంది. ద్రోహ చింతన పెరిగిపోతోంది. రాముడులాంటి భర్త, సీత వంటి భార్య , కరువైన సమాజం నడుస్తోంది. ఇంటువంటి పరిస్థితిని చక్క దిద్దలంటే …
రామ చరిత ఒక ఔషధ గుళిక.”
విశ్వవ్యాప్తంగా కొనియాడ బడుతున్న మన భారతీయ సంస్కృతికి పురాణాలు పట్టుకొమ్మలు. అందులో శ్రీరామాయణం ముఖ్యపాత్ర వహిస్తుంది.
అది చదివి, ధర్మసూత్రాలని ఆకళింపు చేసుకుని సామాన్యులు మహాత్ములైనారు.

ప్రపంచ దేశాలలో మన కుటుంబ వ్యవస్థ, వివాహవ్యవస్థల మీద అత్యంత గౌరవం ఉంది. దురదృష్టవశాత్తు ప్రస్తుత పాశ్చాత్య పోకడలని ఒoట బట్టించుకున్న యువత, ఓర్పు, సహనం, వినయాలు వదిలి అతిపవిత్రమైన వివాహ ధర్మాన్ని త్యజించి , జీవితాలని ఛిన్నాభిన్నం చేసుకుని విడాకుల వైపు కి మొగ్గుచూపుతున్నారు.
అశాంతికి లోనవుతున్నారు.

శ్రీరామాయణం లో కనబడే పరమ పూజ్యనీయమైనది, ఈ జాతి తెలుసుకో వలసింది సీతారాముల దాంపత్యం.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరి తవ! ప్రతీఛ్ఛ చైనాం భద్రం తే పాణీం గృహ్ణీష్వ పాణినా
దాని అర్థం రామా! ఈమె ఎవరో కాదు, ‘ఇయం సీతా’ ఈమె సీత, నా కూతురు, నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో, ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించినది. నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు, నీ ధర్మాచరణలో నీ నీడవలె అనువర్తిస్తుంది. అని జనక మహారాజు చెప్తాడు శ్రీ రామాయణం బాలకాండ లో.

అలాగే ఒక భర్త కి అడుగడుగున, కష్టంలో పక్కన నిలబడ్డానికి, ధర్మా చరణలో నీడల వుండడానికి, చివరి వరకు స్నేహం చేసే సీతలాంటి భార్య కావాలి., పెళ్ళికి నమ్మకమే పునాది ఇద్దరి మధ్య బలీయమైన ప్రేమకి నిర్వచనం అదే.

భర్త కష్టం తన కష్టం అనుకుని , అడవులకేగింది. . అందుకే ఆ జంట పూజ్యనీయమయిన జంటగా , ఈ వేద భూమి సాక్షిగా ఇప్పటికీ ఈ దేశం నీరాజనం పడుతోంది.

ఒకటే మాట “.బాణంలాంటి మాట” సుగ్రీవుడికి మాటిచ్చి నిలబెట్టుకున్న రాముడు స్నేహధర్మం పాటించాడు.
మరి మనం మాటమీద నిలబడ్డం ఎంత కష్టం. దానివల్ల రామునికి ఒరిగిందేమిటి? ఎంతో నిబద్ధత గల వానర సైన్యం లభించింది. మాట మీద నిలబడి చూడు! ఎంత బలీయమైన స్నేహసంపద నీకు తోడునిలబడుతుందో ! అని రాముడు అన్యాపదేశంగా రామాయణంలో చూపిస్తాడు.

శ్రీ రామాయణం లో రామ లక్ష్మణ భరత శతృఘ్నుల సోదర ప్రేమ గురించి ప్రస్తావిస్తే , లక్ష్మణుడు అన్న గారి తో అడవులకి నడిచి అన్నగారి మీద ప్రేమ చూపిస్తే , ఇంద్రజిత్ మాయ వలన లక్ష్మణుడు యుద్ద భూమి లో పడిపోయి వున్నప్పుడు, రాముడు “ అన్వేషించగా సీత వంటి భార్య దొరకు వచ్చు గాని , లక్ష్మణుని వంటి సోదరుడు దొరకడు
అంటూ శోకిస్తాడు. అత్యంత సోదర ప్రేమకి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు.

హనుమ నిస్వార్ధ సేవా, స్వామి భక్తి , అచంచలమయిన విశ్వాసం, చూస్తే మన జీవితాలకి గొప్ప ధైర్యం వస్తుంది. మనిషి నిర్వేదనకి లోనై , కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రీ రామాయణం లో సుందర కాండ చదవ మంటారు. కారణం అది ఒక మనో వికాస కాండ.

ఒక మనిషి జీవితం లో ఏదీ సాధించలేను అని నిర్వేదనకి లోనయి , నిరాశకి లోనై నప్పుడు , హనుమ సముద్రం లంఘించడం, ఎన్ని అవాంతరాలు వచ్చిన మొక్కవోని ఆత్మ విశ్వాసం తో అమ్మని కనుగోవడం, చదివితే మనలో ఎక్కడో దాగి వున్న ఆత్మ విశ్వాసం పుంజుకొని మనిషిని కర్తవ్యోన్మోముఖుల్ని చేస్తుంది ఖచ్చితంగా.

ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, , ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జరగని శుభకార్యాలు జరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.
అందుకే శ్రీ రామాయణం ఒక
” ఉద్గ్రంధం”
సీతారాములు అత్యంత పూజనీయులు.

-చాగంటి ప్రసాద్ (చా.ప్ర)
(శ్రీరామ నవమి శుభాకాంక్షలతో)

LEAVE A RESPONSE