ఏబీవీ సస్పెన్షన్‌పై తుది తీర్పు 23న

-క్యాట్‌లో ముగిసిన వాదనలు
-క్యాట్ ప్రశ్నలకు జవాబివ్వని జగన్ సర్కారు
-ఆధారాలు ఇవ్వకుండా మౌనం

సీనియర్ ఐపిఎస్, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై క్యాట్‌లో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న క్యాట్.. తుది తీర్పు కోసం కేసును ఈనెల 23కు వాయిదా వేసింది. తాజాగా జరిగిన ఈ వాదనలో ఏబీవీపై మోపిన అభియోగాలకు సంబంధించి, క్యాట్ అడిగిన ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ‘మీరు ఏబీ వెంకటేశ్వరరావు సాక్షులను బెదిరిస్తున్నారంటున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలను ఎందుకు సమర్పించలేద’న్న క్యాట్ ప్రశ్నకు, ప్రభుత్వ న్యాయవాది తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించకుండా, మౌనం వహించడం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి ఇన్నేళ్లూ జగన్ సర్కారు.. ఏబీవీపై కేవలం ఆరోపణలతో సస్పెండ్ చేసి, కావాలనే కాలయాపన చేసిందన్న వ్యాఖ్యలు న్యాయవాదవర్గాల్లో వినిపిస్తున్నాయి.

తనపై రెండోసారి విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ లో వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్‌ని బెంచ్ పరిశీలించింది. అది పరిశీలించాక.. సాక్షులను ఏబీవీ బెదిరించినట్లుగా చూపించే మెటీరియల్ ఎక్కడుందని, ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మంగళవారం ఉదయం ప్రభుత్వం దాఖలు చేసిన వ్రాతపూర్వక వాదనల్లో వాస్తవిక తప్పులు ఉన్నాయని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదించారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం అధికారుల కమిటీ సస్పెన్షన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే, చట్టపరమైన వైఖరిని కూడా వివరించారు.

ఏబీ వెంకటేశ్వరరావు పై విధించిన సస్పెన్షన్ చెల్లదని, ఇది ఇకపై కొనసాగదని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు ద్వారా ఏబీవీ తిరిగి నియమించబడిన తర్వాత కూడా, అవే ఆరోపణలతో రెండోసారి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలా ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత, తీర్పు కోసం విచారణను ఈనెల 23కి వాయిదా వేశారు.

Leave a Reply