Suryaa.co.in

Editorial

కుమిలిన కమలం!

– కర్నాటకలో వికసించని కమలం
– ప్రధాని రోడ్‌షో చేసినా ఫలితం సున్నా
– కమలదళాలు కాళ్లకుబలపాలు కట్టుకుని ప్రచారం చేసినా తప్పని పరాభవం
– దక్షిణాదిలో ఉన్న ఒక్కటీ పాయె
– దక్షిణాదిపై వ్యూహలోపమే కారణమా?
– భాషలపై పట్టులేని జాతీయ నాయకత్వం
– ఉత్తరాది-దక్షిణాది జనం నాడిని ఒకే గాటన కట్టే వ్యూహం
– ప్రాంతాల సమస్యలు వేరని గుర్తించలేని వైఫల్యం
– జనంలో లేని నేతలకు పట్టం కడుతున్న ఫలితం
– యడ్డీని దూరం చేసుకున్నందుకు ఫలితం అనుభవించిన వైనం
– పనిచేయని ఉత్తరాది ‘మత’తంత్రం
– కర్నాటకలో బజరంగ్‌ బూమెరాంగ్‌
– ప్రజాసమస్యలపై పోరాడే విధానం కరవు
– దక్షిణాదిలో పనిచేయని ఉత్తరాది మంత్రం
– ఆంధ్రా-తెలంగాణలో అయోమయ వ్యూహం
– తెలంగాణలో కుదరని కులసమీక‘రణం’
– ఏపీ-తెలంగాణలో అధికారపార్టీలతో దోబూచులాట
– కర్నాటక వైఫల్యంతోనయినా కమలం కళ్లు తెరుస్తుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

అది బీజేపీని శాసించే ఆరెస్సెస్‌ మార్గదర్శి అయిన.. బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్‌ సంతోష్‌జీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టం. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో , కమలం ఎలా వికసించాలో మార్గదర్శనం చేస్తారాయన. పార్టీలో ఆయన ప్రధాని మోదీ కంటే పవర్‌ఫుల్‌. ‘సంఘం’లో తిరుగులేని శక్తి. అలాంటి మహామంత్రి సొంత రాష్ట్రంలో మరి పార్టీ ఓడిపోకూడదు కదా? అసలు దేశంలో సమ్మోహనశక్తిగా ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ స్వయంగా రోజులపాటు రోడ్‌షోలు నిర్వహిస్తే, పార్టీ పరాజయం చెందకూడదు కదా? దేశంలోని పార్టీ పరివారమంతా కాళ్లకు బలపాలు కట్టుకుని, పుట్టలు పుట్టలుగా దిగినా పార్టీ ఓడిపోకూడదుకదా?

కానీ బ్యాడ్‌లక్‌. అక్కడే ఓడిపోయింది. అంతపెద్ద మేధావి వ్యూహాలేమీ అక్కడ పనిచేయలేదు. మతం పప్పులు అస్సలు ఉడకలేదు. చివరకు పోలింగ్‌ రోజున నమ్ముకున్న ఆంజనేయస్వామి కూడా వారిని కాపాడలేదు. జనం బజరంగ్‌దళ్‌ను చూడలేదు. బీజేపీ పాలనలోని 40 శాతం అవినీతిని మాత్రమే చూశారు. కలసివెరసి ‘కమలం’ కుమిలింది. ఇదీ.. కర్నాటక ఎన్నికల ఫలితాల్లో కమలం కుమిలి.. కమిలిన విషాదం!

దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమైన, కర్నాటక కూడా ఆ పార్టీకి దూరమైంది. తాజా ఎన్నికల ఫలితాలతో.. ఎప్పుడూ సొంతగా గెలవకుండా.. రెండుసార్లు కాంగ్రెస్‌-జెడీఎస్‌ పార్టీల నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో, నిలబెట్టుకున్న బీజేపీ అధికార సామ్రాజ్యం, ముచ్చటగా మూడోసారి పతనమైంది. కాంగ్రెస్‌ పార్టీ కమల వికాసాన్ని అడ్డుకుంది. బీజేపీ పతనాన్ని శాసించింది.

తిరుగులేని మెజారిటీతో కాంగ్రెస్‌ కన్నడ రాజ్యాధిపతి అవతారమెత్తగా, అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ చతికిలపడింది. ఈ రెండు పార్టీలను తనకున్న అత్తెసరు సీట్లతో ఆడించి, సీఎం అవ్వాలని అత్యాశ పడ్డ జెడిఎస్‌ ఉనికి మాయమయింది. ఇది అలెగ్జాండర్‌ మాదిరిగా.. విజయాలే వ్యసనంగా మారిన బీజేపీకి.. చావుదెబ్బ మాత్రమే కాదు. ఓ గుణపాఠం కూడా!

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన, కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కాలరు ఎగరేసింది. చాలా ఏళ్ల తర్వాత ఓ అద్భుతం-అపురూపం-అనన్య సామాన్యం- అనితర సాధ్యమైన విజయాన్ని లిఖించింది. ఎగ్జిట్‌పోల్స్‌లో వచ్చిన అంచనాలే నిజమయ్యాయి. మొత్తం 224 స్థానాల్లో 113 సీట్లు మ్యాజిక్‌ఫిగర్‌. కానీ కాంగ్రెస్‌ ఆ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి మొత్తం 130 సీట్లు సాధించింది. ఇక అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 67, రెండు పార్టీలకు మెజారిటీ రాకపోతే, తానే సీఎం కావాలని అత్యాశకు పోయిన కుమారస్వామి జెడిఎస్‌.. కేవలం తో 22 స్థానాలతో సరిపెట్టుకుంది.

దక్షిణాదిలో మళ్లీ గెలిచి, ఈ విజయాన్ని అన్ని రాష్ర్టాలకు విస్తరించాలన్న బీజేపీ వ్యూహం బూమెరాంగ్‌ కావడానికి.. కారణాలు అనేకమన్నది ఆ పార్టీ సీనియర్ల విశ్లేషణ. అసలు దక్షిణాదిపై బీజేపీ నాయకత్వానికి, మొదటి నుంచి సరైన వ్యూహం లేదు. అందుకే ఆ పార్టీ దేశంలోని అనేక రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చినప్పటికీ, దక్షిణాది రాష్ర్టాల్లో ఖాతా తెరవలేదు. కర్నాటకలో కూడా కొన్నేళ్లు కష్టపడిన తర్వాత, యడ్యూరప్ప వంటి జననేత రెక్కల కష్టంతో దక్కిన అద్భుత అవకాశాన్ని, ఆ పార్టీ తర్వాత నిలబెట్టుకోలేకపోయింది. తర్వాత యడ్డీనే పక్కనపెట్టింది. వ్యక్తుల ఎదుగుదలకు చెక్‌ పెట్టే కాంగ్రెస్‌ అవలక్షణాలు పువ్వుపార్టీకీ అబ్బడమే ఆశ్చర్యం.

నీతి నిజాయితీకి ఫ్యాంటు-షర్టు వేస్తే అది బీజేపీ అన్నది, ఆ పార్టీ నేతలు చేసుకునే ప్రచారం. కానీ కర్నాటకలో ‘40 శాతం కమిషన్‌ ప్రభుత్వం’గా స్థిరపడటం, బీజేపీని కర్నాటకలో అధికారంలోకి తెచ్చిన యడ్యూరప్పను పక్కనపెట్డడం వంటి కారణాలతో తాజా ఎన్నికల్లో బీజేపీ బొక్కాబోర్లా పడింది. స్వయంగా బీజేపీ కార్యకర్తకు బిల్లు ఇచ్చేందుకు 40 శాతం కమిషన్‌ అడిగిన వైనం, సదరు కార్యకర్య ఆత్మహత్యకు కారణమయింది. దీన్నిబట్టి బీజేపీ ప్రవచిత నిజాయితీలో నిజమెంతో స్పష్టమయింది. ఈ ఘటన పార్టీ కార్యకర్తల అసంతృప్తికి దారితీసింది.

సీనియర్లను పక్కనపెట్టడం కూడా బీజేపీ ఓటమికి మరో కారణమన్నది, ఆ పార్టీ నేతల విశ్లేషణ. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారంతా గెలిచారంటే, ఢిల్లీ నాయకత్వానికి కర్నాటకపై సరైన అంచనా లేదని, వచ్చే నివేదికల్లొ కూడా శాస్త్రీయత లేదని అర్ధమవుతోంది. కర్నాటక ఎన్నికల ప్రచారానికి, తెలంగాణ నేతలంతా కట్టకట్టుకుని వెళ్లినప్పటికీ.. వారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలవడం ఆశ్చర్యం.

దక్షిణాదిలో పొత్తులతో ఎదుగుతున్న బీజేపీ వ్యూహం, మూడడుగులు ముందుకు-ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పొత్తుల్లో ఉన్న పార్టీలనే మింగేసే బీజేపీ వ్యూహం వికటిస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, వివిధ రాష్ర్టాల్లో మిత్రపక్షాలతో అధికారం పంచుకున్న బీజేపీ.. చివరకు ఆ మిత్రపక్షాలనే మింగేసే ధృతరాష్ట్రకౌగిలిని చూసి, బలమైన పార్టీలు కూడా భయపడుతున్న పరిస్థితి.

ఏపీలో టీడీపీతో జతకట్టి అధికారం పంచుకున్న బీజేపీ, ఆ తర్వాత ఆ పార్టీని ఓడించేందుకు వైసీపీతో పరోక్షంగా జతకట్టింది. తెలంగాణలో పొత్తులు లేకున్నా, బీఆర్‌ఎస్‌తో ఆడుతున్న దాగుడుమూతలతో, ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితికి తెచ్చుకుంది. ఇప్పటికీ కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ-బీఆర్‌ఎస్‌ దొంగాట ఆడుతున్నాయన్నది చాలామంది అనుమానం. దానిని తొలగించుకునే ఒక్క ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యం.

ఆంధ్రాలో అటు టీడీపీ-ఇటు వైసీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ జుట్టు తన చేతిలో పెట్టుకుని, అందరినీ రింగ్‌ మాస్టర్‌లా ఆడించే, బీజేపీ అనైతిక రాజకీయ వ్యూహం బూమెరాంగవుతోంది. అయినా ప్రజల పల్సు కనిపెట్టలేని దుస్థితి బీజేపీ నాయకత్వానిది.

నిజానికి ఏపీలో వైసీపీ అధినేత-సీఎం జగన్‌పై ఎంత వ్యతిరేకత ఉందో, కేంద్రంలోని బీజేపీపై అంతకుమించిన వ్యతిరేకత ఉందన్న వాస్తవాన్ని నాయకత్వం ఇప్పటిదాకా గ్రహించకపోవడమే ఆశ్చర్యం. జగన్‌ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, కేంద్రం ఆమోదిస్తోందన్న భావన జనంలో గూడు కట్టుకుంది.

కేంద్రం మద్దతుతోనే, అమరావతితో జగన్‌ ఆడుకుంటున్నారన్న భావన బలంగా ఉంది. ఇది హైదరాబాద్‌లో నివసించే సెటిర్లలో ఆంధ్రాలోని వారికంటే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం. జగన్‌ సర్కారు చేస్తున్న అప్పులకు కేంద్ర ప్రోత్సాహమే కారణమన్నది మరో భావన.పైగా అసలు రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ, చేసిందేమీ లేదన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.

ఇవికాక.. విశాఖ రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం నిర్మాణం వంటి ప్రధాన అంశాల్లో తమ రాష్ర్టానికి బీజేపీ నయాపైసా సాయం చేయలేదన్నది ఏపీ ప్రజల నిశ్చితాభిప్రాయం. ప్రధానంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన ముద్దాలను సీబీఐ అరెస్టు చేయకుండా, కేసును ఏళ్లూ పూళ్లూ సాగడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దతలకాయల అభయహస్తమే కారమన్నది ప్రజల మరో నమ్మిక.

ఇక జగన్‌ సీబీఐ కోర్టులకు హాజరుకాకుండా.. స్వేచ్ఛ ఇచ్చిన వెసులుబాటు కూడా, కేంద్ర పెద్దల పుణ్యమేనన్నది ప్రజల నమ్మకం. లేకపోతే దేశంలో ఎవరికీ ఇవ్వని వెసులుబాటు, జగన్మోహన్‌రెడ్డి ఒక్కరికే ఎలా వస్తుందన్నది వారి ప్రశ్న. ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేని పార్టీ నాయకత్వం, వైసీపీ తో మానసిక బంధం ఉన్న వారు ఇచ్చే నివేదికలనే విశ్వసిస్తోందన్నది మరో అనుమానం. ఏపీలో వైసీపీపై యుద్ధం చేసి, పార్టీని బలోపేతం చేయాలని ఓ వైపు మోడీ-అమిత్‌షా నుంచి, నద్దా వరకూ హితబోధ చేస్తారు. మరోవైపు అదే వైసీపీకి తెరచాటు మద్దతునిస్తున్న ద్విముఖ వ్యూహంతో, పార్టీ ఎలా బలపడుతుందన్నది బీజేపీ సీనియర్ల వాదన.ఈ ముసుగు తొలగించేవరూ పార్టీ బలపడటం అసాధ్యమన్నది కార్యకర్తల వాదన.

తాజాగా నెల్లూరు జిల్లాలో బీజేపీ కార్యకర్త మెడ మధ్యన, పోలీసు కాళ్లు వేసి నలిపివేస్తున్న దృశ్యం.. ఢిల్లీ నాయకత్వం అనుసరిస్తున్న, ద్విముఖ రాజకీయ వ్యూహానికి సగటు కార్యకర్త ఎలా బలవుతున్నాడన్న వాస్తవం స్పష్టం చేసింది. ఏపీలో రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా పక్కనపెట్టి, గుళ్లు-హిందుత్వం-పేర్లు మార్పు వంటి పనికిరాని అంశాలపై మాట్లాడుతున్న వైనంపై శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఏపీలో ప్రస్తుతం మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మినహా, మిగిలినవారికి పార్టీని గెలిపించే శక్తి లేదన్నది కార్తకర్తల అభిప్రాయం. రోజూ మీడియాలో మాట్లాడే ప్రముఖులే, ఎన్నికలొస్తే పారిపోయే పరిస్థితి. దీన్నిబట్టి ఏపీలో ఎన్ని దశాబ్దాలకు పార్టీ.. కనీసం ప్రతిపక్షస్థానానికి చేరుకుంటుందన్న సందేహం సగటు కార్యకర్తలో నాటుకుపోయింది.

సర్కారుపై క్షేత్రస్థాయి పోరాటాలకు సెలవిచ్చి, పత్రికాప్రకటనలపై బతుకుతున్న బీజేపీ నుంచి.. సమరనినాదం ఆశించడం అత్యాశే అవుతుందన్నది ఆ పార్టీ సీనియర్ల ఉవాచ. వైసీపీ సర్కారుపై చార్జిషీట్‌ దాఖలు చేయాలని, చాలా నెలల క్రితం స్వయంగా ప్రధాని మోదీ ఆదేశించారు. కానీ దానిని కొద్దిరోజుల క్రితమే ఆచరణలో పెట్టారు. అంటే దీన్నిబట్టి.. ఏపీలో కమలవికాసంపై అంచనాలు ఏమిటన్నది స్పష్టమవుతుంది.

ఇక తెలంగాణలో పార్టీపరంగా ఇంత దారుణమైన పరిస్థితి లేకపోయినా, సొంతంగా ఎదిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యం స్థానంలో.. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ నుంచి, ఎంతమందిని తీసుకురావాలన్న లెక్కల రాజకీయం కనిపిస్తోంది. దీన్నిబట్టి ఇన్నేళ్లలో నియోజకవర్గానికి ఒక గట్టి అభ్యర్ధిని, తయారుచేసుకోలేని వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరాన్నభుక్కు రాజకీయాలతో కర్నాటక,మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ అధికారంలోకి రావాలన్నది బీజేపీ నాయకత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

పోనీ, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి ప్రాధాన్యం ఉంటుందా అంటే అదీ కనిపించదు. వారికి బాధ్యతలు అప్పగించరు. వారిని పార్టీని సొంతం చేసుకునే అవకాశం ఇవ్వరు. ఈ కారణాలతోనే ఇతర పార్టీల నుంచి చేరిన అనేకమంది ప్రముఖులు, విసిగి వేసారి బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌లో చేరుతున్న వైనాన్ని నాయకత్వం, ఇప్పటికీ గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉందని సీనియర్లు చెబుతున్నారు.

నవంబర్‌-డిసెంబర్‌లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకూ అన్ని నియోజకవర్గాలకు సరైన అభ్యర్ధులు దొరకని విషాదం. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే బీజేపీ. బీజేపీ అంటే హైదరాబాద్‌ అన్న భావన బలంగా ఉండేది. అంతమంది బలమైన నేతలుండేవారు. ఇప్పుడు ఐదారు నియోజకవర్గాల్లో తప్ప, బలమైన అభ్యర్ధి అంటూ కనిపించని దుస్థితి. ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణం. మొత్తంగా 119 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల్లో మాత్రమే అసెంబ్లీకి పోటీ చేసే స్థాయి అభ్యర్ధులు కనిపిస్తున్నారు.

ఇక పోలింగ్‌ బూత్‌ కమిటీలూ అస్తవ్యస్తమే. ఒక్కో పోలింగు బూత్‌కు 32 మందిని నియమించాలి. వారిలో సొషల్‌మీడియా ఇన్చార్జిని కూడా నియమించాలి. కానీ తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో కూడా, ఒక్కో పోలింగ్‌బూత్‌లో 32 మంది సభ్యులు నిండిన దాఖలాలు లేవన్నది పార్టీ వర్గాల సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 225 నుంచి 250 పోలింగ్‌ బూత్‌లు ఉంటాయి. వాటికి బూత్‌కు 32 మంది చొప్పున కమిటీలు వేయాలి. కానీ మొత్తం 50 శాతం కమిటీలు కూడా దుస్థితి. దీనికి కారణం ఆర్గనైజేషన్‌పై పార్టీ నాయకత్వం, మొదటి నుంచీ దృష్టి సారించకపోవడమే కారణమన్నది సీనియర్ల విశ్లేషణ.

రాష్ట్ర రాజధానిలో అడుగడుగునా సమస్యలే. కానీ వాటిని గుర్తించి- సరైన గణాంకాలు సేకరించి, సర్కారుపై సమరం చేసే స్థాయి నేతలే లేరు. అసలు గ్రేటర్‌-చుట్టు పక్కల ప్రాంతాల సమస్యలపై అవగాహన ఉన్న నాయకులే కనిపించని దుస్థితి. వీటిని పక్కనపెట్టి.. కేవలం మీడియాకే పరిమితమై ప్రకటనలివ్వడం, లేకపోతే హిందుత్వను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రాజధాని నగరంలో పార్టీ దుస్థితికి ఇవే కారణాలని, పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే బదులు, కేవలం మీడియాలో ఉండేందుకే నేతలు ప్రాధాన్యమిస్తున్నారన్నది మరో ప్రధాన విమర్శ.

ప్రధానంగా కుల సమీకరణలో, తెలంగాణ బీజేపీ నాయకత్వం ఘోరంగా విఫలమయిందన్నది ఆ పార్టీ సీనియర్ల విమర్శ. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గాలైన గౌడ్‌, యాదవ, పద్మశాలి వర్గాలకు పార్టీలో ప్రాతినిధ్యం లేదన్నది ఒక అసంతృప్తి. అగ్ర కులాల్లో రెడ్డి సామాజికవర్గం.. మెజారిటీ శాతం కాంగ్రెస్‌ వైపు చూస్తుండగా, మిగిలినవారు బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఎన్నికల నాటికి వారిలో సగానిపైగా, కాంగ్రెస్‌కు వెళ్లడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి, ఇక మైనారిటీ అయిన వెలమ, బ్రాహ్మణ, వైశ్యవర్గాల ప్రభావం రాజకీయాల్లో తక్కువ. వారి ప్రభావం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం.

ఇక అగ్రకులాల్లో మిగిలిన కమ్మ వర్గ ప్రభావం, దాదాపు 45 నియోజకవర్గాల్లో ఉందన్నది ఒక అంచనా. హైదరాబాద్‌-రంగారెడ్డి-ఖమ్మం జిల్లాల్లో మెజారిటీ నియోజకవర్గాలతోపాటు.. నిజామాబాద్‌లో సగం, ఆదిలాబాద్‌, నల్లగొండ, వరంగల్‌లో కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువ. వీరంతా కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడిన సామాజికవర్గం. మహారాష్ట్ర సరిహద్దులోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో.. కొన్ని దశాబ్దాల నుంచి కమ్మ వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారంటే, వారి ప్రభావం ఏ స్ధాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

వ్యాపారం-వ్యవసాయం-హోటల్‌-ట్రాన్సుపోర్టు-విద్యారంగాల్లో.. వీరు కొన్నేళ్ల నుంచి తెలంగాణలో విస్తరించి పాతుకుపోయారు. విభజన ముందు వరకూ కమ్మ వర్గం టీడీపీతోనే ఉంది. విభజన తర్వాత నేతల ప్రభావంతో, బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితి. గ్రేటర్‌ ఎన్నికల్లో.. సెటిలర్లు ఉన్న అన్ని డివిజన్లలో టీడీపీ బలమైన పోటీ ఇవ్వనందున, వారంతా బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. దీన్నిబట్టి, తెలంగాణలోని అగ్రకులాల్లో బలమైన రెడ్డి వర్గం కాంగ్రెస్‌ వైపు ఉండగా, మరో బలమైన కమ్మ వర్గాన్ని.. బీజేపీ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైనట్లు స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE