Suryaa.co.in

Editorial

ఆంధ్రా పొమ్మంది.. తెలంగాణ వద్దంది!

– ఆంధ్రాలో తెలంగాణ టీచర్ల అవస్ధలు
– త్రిశంకులోకంలో ఏపీలోని తెలంగాణ టీచర్లు
– ఏపీ సర్కారు రూట్ క్లియర్
– ఏనాడో ఎన్‌ఓసీ ఇచ్చిన ఏపీ సర్కార్
– తేల్చని తెలంగాణ పాలకులు
– కేసీఆర్ హయాంలో తెలంగాణ టీచర్ల దరఖాస్తులు బుట్టదాఖలు
– రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా అదే విషాదం
– తెలంగాణ సర్కారు ఉత్తర్వుల కోసం ఏపీలోని 213 టీచర్ల ఎదురుచూపులు
– ఆంధ్రాకు బదిలీ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణలోని 612 మంది ఏపీ టీచర్లు
– రెండు ప్రభుత్వాలు మారినా టీచర్లకు దక్కని మోక్షం
– పట్టించుకోని ఏపీ-తెలంగాణ టీచర్ యూనియన్లు
– తెలంగాణ ఉద్యమ సంఘాలకు బదిలీ కష్టాలు పట్టవా?
– రేవంత్‌రెడ్డి సొంత శాఖలో బదిలీ కష్టాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వారంతా ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ పాసయి ఉద్యోగాలు సాధించిన టీచర్లు. అంటే అప్పట్లో ఆంధ్రా మూలాలున్న టీచర్లు తెలంగాణలో.. తెలంగాణ మూలాలున్న టీచర్లకు ఆంధ్రాలో పోస్టింగులు వచ్చాయన్నమాట. అంతవరకూ బాగానే ఉంది. మధ్యలో రాష్ట్రం విడిపోయి, ఆంధ్ర-తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. కాబట్టి.. సహజంగా ఎవరి రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రానికి పంపిస్తారని బుర్ర-బుద్ధి, తలపై మెడ ఉన్న ఎవరైనా భావిస్తారు.

కానీ అటు ఆంధ్రా పాలకులు-ఇటు తెలంగాణ పాలకులు పదేళ్లు దాటినా వారిని గాలికొదిలేశారు. ఫలితంగా.. అటు ఆంధ్రా కాకుండా-ఇటు తెలంగాణ కాకుండా త్రిశంకుస్వర్గంలో వేళ్లాడుతున్న దుస్థితి. అంటే సూటిగా చెప్పాలంటే మన సు పుట్టిన రాష్ట్రంపై.. మనిషి ఉద్యోగం చేస్తున్న మరొక రాష్ట్రంలో అన్నమాట!

మరిప్పుడు సమస్య ఏమిటి? తెలంగాణ మూలాలున్న టీచర్లను వారి రాష్ట్రానికి వెళ్లేందుకు, ఏపీ సర్కారు 2022 సెప్టెంబర్ 23న ఎన్‌ఓసీ ఇస్తే.. తెలంగాణ సర్కారేమో, వారిని తీసుకోకుండా, మీరు మాకొద్దు పొమ్మంటున్న విషాదం. ఈ మధ్యలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు, టీచరు సంఘాలు, జేఏసీలది ప్రేక్షకపాత్ర.

అంటే మరిప్పుడు ఆంధ్రాలో ఉద్యోగం చేస్తున్న ఆ 213 మంది తెలంగాణ మూలాలున్న వారికి దిక్కెవరు? అసలు వారిని తెలంగాణ సర్కారు తెలంగాణ వారిగా గుర్తించడం లేదా? ఇంతకూ ఈ సమస్య వేరే ఏ మంత్రి శాఖదో అయితే దానికి ఇంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ అది స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖల్లో ఓ వింత. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తమను సొంత ప్రాంతానికి బదిలీ చేయాలని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న తెలంగాణ టీచర్లు జగన్ సీఎంగా ఉండగా దరఖాస్తు చేసుకున్నారు. దానికి స్పందించిన జగన్ సర్కారు.. 2022 సెప్టెంబర్ 23న, వారిని మీ రాష్ట్రానికి తీసుకువెళ్లేందుకు తమకె ఎలాంటి అభ్యంతరం లేదని, అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ మూలాలున్న ఏపీ ఉద్యోగులను ఏపీకి పంపించాలని నాటి సీఎస్ సమీర్‌శర్మ, అప్పటి తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఒక లేఖ రాశారు. కానీ అప్పటి నుంచి అంతర్ రాష్ర్ట బదిలీలకు సంబంధించి కించిత్తు కదలిక లేకపోవడ మే ఆశ్చర్యం. నాటి కేసీఆర్ సర్కారు, నాటి తెలంగాణ ఉద్యోగ జేఏసీ, టచర్ యూనియన్లు కూడా ఈ సమస్యను పక్కనపెట్టేశారు.

కాగా రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చి, పరిష్కరించే సమయంలో.. తెలంగాణ ఉద్యోగ జాక్, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు.. స్టేట్ కేడర్-సెక్రటేరియేట్ ఉద్యోగ సంఘాలు మోకాలడ్డాయి. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి తీసుకుంటే, తమ పదోన్నతులు దెబ్బతింటాయన్న వాదనను తెరపైకి తెచ్చి, ఆందోళన నిర్వహించారు. దానితో భయపడి వెనక్కి తగ్గిన రేవంత్ సర్కారు.. అంతర్ రాష్ర్ట ఉద్యోగుల బదిలీ అంశాన్ని కోల్డ్‌స్టోరేజీలో పెట్టింది.

అయితే నిజానికి టీచర్ల బదిలీకి, స్టేట్‌కేడర్-సచివాలయ ఉద్యోగుల వాదనకు ఎలాంటి సంబంధం లేదు. టీచర్లను ఏపీ నుంచి తెలంగాణకు తీసుకువచ్చినందున.. అటు స్టేట్ కేడర్‌కు గానీ.. ఇటు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు గానీ ఎలాంటి ఇబ్బందులు గానీ, ప్రమాదం గానీ ఉండదు.

ఎందుకంటే ఏపీ నుంచి వచ్చే తెలంగాణ టీచర్లు, కేవలం జిల్లా కేడర్‌కు సంబంధించిన వారు. పైగా జీరో సీనియారిటీని అంగీకరించి వచ్చేవారే . దానివల్ల అటు తెలంగా ఉద్యోగుల పదోన్నతులకూ అడ్డంకి కారు. అన్నింటికి మంచి వారు జిల్లా స్థాయి జడ్పీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్కూళ్లకు పరిమితమై పనిచేసే టీచర్లు మాత్రమే.

నిజానికి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. కాబట్టి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ టీ చర్లకు పోస్టింగులిస్తే, ఆ సమస్య కూడా పరిష్కరించినట్టవుతుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల్లో టీచ ర్ల కొరత తీవ్రంగా ఉంది.

కాగా.. దాదాపు 20 ఏళ్ల నుంచి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలు ఉన్న ఉద్యోగులను, తెలంగాణకు బదిలీ చేయించేందుకు ఇప్పటివరకూ ఒక్క టీచర్ యూనియన్ గానీ, ఒక్క తెలంగాణ జేఏసీ గానీ, ఒక్క తెలంగాణ ఉద్యమ సంస్థ గానీ ప్రయత్నించకపోవడమే ఆశ్చర్యం.

నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో మొదలైన తెలంగాణ ఉద్యమం ఫలించి, సొంత రాష్ట్రం కల సాకారమయింది. అయినప్పటికీ సొంత రాష్ట్రానికి వచ్చేందుకు.. చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న తెలంగాణ టీచర్ల కోసం, తెలంగాణలోని ఏ ఒక్క నాయకుడూ గళమెత్తకపోవడ మే ఆశ్చర్యం.

పైగా తెలంగాణ ఉద్యమ నేత, జాక్‌కు నేతృత్వం వహించి యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్యమ మార్గం పట్టించి.. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ సర్కారులో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆయన కూడా అంతర్ రాష్ట్ర బదిలీలపై అంటీముట్టనట్లు ఉండడం మరో ఆశ్చర్యం.

అసలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిగా ఉన్న విద్యాశాఖలోనే ఇన్నేసి వింతలూ, విడ్డూరాలు చోటుచేసుకోవడం మరో ఆశ్చర్యం!

LEAVE A RESPONSE