– సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలపై జర్నలిస్టు సంఘాల గత్తర
– మీడియాపై దాడి అంటూ హడావిడి, ఆందోళన
– కేసుల సోదాలకు, జర్నలిజానికి సంబంధమేమిటి?
– గతంలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన టీవీ9 రవిప్రకాష్, డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి, సాక్షి జగన్, సూర్య నూకారపు
– తాజాగా పమిడికాలవ మధు అరెస్టు
– నేరాలకు పాల్పడిన వారికి మీడియా సంస్థలుంటే సోదాలు, అరెస్టులు, కేసులు పెట్టకూడదా?
– లిక్కర్ కేసులోనే సాక్షి ఎడిటర్ ధనుంజరెడ్డి ఇంట్లో సోదాలు
– సాక్షి ఎడిటర్ కాకముందు జగన్ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన ధనుంజయరెడ్డి
– భారతీరెడ్డికి సన్నిహితుడన్న పేరు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పుడు రాజకీయపార్టీలకు-మీడియాకు మధ్య ఉన్న విభజనరేఖ చెరిగిపోయిన ఫలితంగా.. ఎవరు జర్నలిస్టు? ఎవరు పార్టీ ప్రతినిధి అన్నది అయోమయంగా మారింది. తెలుగునాట అన్ని ప్రధాన పార్టీలకు సొంత మీడియా సంస్థలున్నాయి. మరికొన్ని మీడియా సంస్థలను పార్టీ నాయకత్వాలే దత్తత చేసుకున్నాయి. ఫలితంగా జర్నలిస్టులపై దాడులు, కేసులు, అరెస్టయిన సందర్భాల్లో.. వారిని ఏదైనా కేసుల్లో ఉంటే పట్టుకుంటున్నారా? లేక ఏదైనా రాజకీయ పార్టీల మీడియా ప్రతినిధుల హోదాలో కేసులు పెడుతున్నారా అన్నది ఇంకో గందరగోళం.
తాజాగా సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సెర్చ్‌వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించారు. చట్టపరంగా అది నేరం. కానీ అలాంటి నేరాలను ఆయన పనిచేస్తున్న సాక్షి యాజమాన్యానికి సంబంధించిన వైసీపీ పభుత్వం, ఐదేళ్లూ నిర్నిరోధంగా కొనసాగించింది. వారెంట్ లేకుండానే వందలమందిని చెరపట్టింది. కాబట్టి నాడు జగన్ సర్కారు వారెంట్ లేకుండా సోదాలు చేయడం ఒప్పయితే, నేడు జరిగిన సోదాలు కూడా ఒప్పే. ఒ వేళ అది తప్పయితే, ఇది కూడా ముమ్మాటికీ తప్పే. మరి దీనిపై మోతబరి జర్నలిస్టు సంఘాలే తీర్పు ఇవ్వాలి.
సాక్షి ఎడిటర్ ధనుంజరెడ్డి ఇంట్లో సోదాలు జరపడాన్ని జర్నలిస్టు సంఘాలు నానా యాగీ చేస్తున్నాయి. ఇక సాక్షి దళాల శ్రమదానం గురించి చెప్పాల్సిన పనిలేదు. కూటమి హయాంలో మీడియాపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్న గావు కేకలను ప్రతిధ్వనింపచేస్తున్నారు. కలెక్టర్లకు వినతిపతాలిచ్చి కలర్ ఫొటోలు వేయించుకుంటున్నారు.
నిజానికి ఈమధ్య కాలంలో జర్నలిస్టు సంఘాలకు పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. జగన్ ఐదేళ్ల జమనాలో అయితే జర్నలిస్టు సంఘాల నేతలను అసలు పట్టించుకునే దిక్కులేదు. చంద్రబాబు మాదిరిగా జగన్ ఎప్పుడంటే అప్పుడు జర్నలిస్టు సంఘ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చే బాపతు కాదు మరి! వారికి సజ్జల వరకే ఎంట్రీ.
జర్నలిస్టులపై దాడులు జరిగితే కొందరు జర్నలిస్టు సంఘాల నేతలకు ఎక్కడ లేని చైతన్యస్ఫూర్తి. ఎందుకంటే ఆ పేరుతో కొద్దిరోజులు హడావిడి చేసే వెసులుబాటు! సీఎం, మంత్రులు, కలెక్టర్లకు వినతిపత్రాల పేరుతో కొద్దిరోజులు మీడియాలో ఫొటోల హడావిడి, ఉచిత ప్రచారం. దానితో కొద్దిరోజులు జర్నలిస్టు లీడర్లుగా లైవ్‌లో ఉండవచ్చు. అది వేరే కథ!
ఇప్పుడు మళ్లీ ధనుంజయరెడ్డి నివాసంలో సోదాల సంగతికొస్తే.. ధనుంజయరెడ్డి సాక్షి ఎడిటర్ కాకముందు, జగన్ సీఎంఓలో ఓఎస్డీగా పనిచేశారు. అంతకుముందు సాక్షిలో ఉద్యోగం చేశారు. సరే మన ప్రభుత్వమే ఉంది కదా.. మళ్లీ సాక్షి నుంచి జీతాలు ఎందుకన్న ముందుచూపుతో, ధనుంజయరెడ్డికి సీఎంఓలో కొలువు ఇచ్చిందన్నమాట. అంటే గతంలో దేవులపల్లి అమర్, కొమ్మినేని, రామచంద్రమూర్తి, నేమాని భాస్కర్, ఆర్.ఎం.బాషా, రెహనా లాంటి సాక్షి సైనికులకు సర్కారు ఖజానా నుంచి సలహాదారులు, ఆర్టీఐ కమిషనర్ల పదవులిచ్చి జీతాలిప్పించినట్లన్నమాట.
ఫైర్ సర్వీసు, డిజిటల్ కార్పొరేషన్, ఆర్టీజీఎస్, ఫైబర్‌నెట్, గనులశాఖల్లో కూడా.. మేడమ్‌గారింట్లో పనిచేసే పనిమనుషులు, పార్టీ కోసం పనిచేసే ‘శ్రమదానం బులుగు బ్యాచ్’కు, ఒళ్లొంచి పనిచేయకుండా లక్షల జీతాలిచ్చిన మనసున్న మారాజు జగనన్న. గనులశాఖలో అయినవారికి లక్షల రూపాయల జీతాలిచ్చి, వారిని పందెం కోళ్లలా మేపిన పెద్దిరెడ్డిగారి విశాల హృదయం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇలాంటి సాహస కృత్యాలు చేయాలంటే చందబాబుకు మనసొప్పదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకునే బేఫర్వాతనం కావాలి. అన్నింటికీ మించి.. మనకోసం పనిచేసిన వారికి ఏదైనా చేయాలన్న విశాల హృదయం కావాలి. కానీ బాబు అండ్ కోది.. ఎవరికైనా ఏమైనా చేస్తే, ఎవరైనా ఏమనుకుంటారోనన్న భయం. రాష్ట్ర సంపదను భావి తరాలకు దాచి ఉంచాలన్న తాపత్రయం. తమ కోసం పనిచేసేవారికి ఏమీ చేయకపోయినా, వారు ఎక్కడికీ వెళ్లరన్న ధీమాతో కూడిన నమ్మకం. అందుకే చంద్రబాబు గురించి ఎవరూ పెద్దగా చెప్పుకోకపోవడానికి.. వైఎస్,జగన్ , కేసీఆర్ గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం.. ఆ విశాల హృదయం కమ్ గుండైధైర్యమే.
అందాకా ఎందుకు? లోకేష్ దగ్గర పనిచేసే సిబ్బంది మొత్తానికి జగన్ మాదిరిగా, సర్కారు ఖజానా నుంచి జీతాలు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఎందుకంటే కూటమికి సర్వాధికారి ఆయనే. అయినా లోకేష్ దగ్గర పనిచేసే ఒకరిద్దరికి మినహా, మిగిలిన సిబ్బంది అందరికీ పార్టీ ఆఫీసు నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. లోకేష్ ప్రయాణించే ప్రభుత్వ వాహనం తప్ప, ఆయన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు, ఆయనే టోల్‌టాక్స్ చెల్లిస్తారన్న విషయం తెలిసిన వారు బహు తక్కువ.
కూటమి అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలకు గానీ చంద్రబాబు, లోకేష్ దగ్గర పనిచేసే పీఆర్వోలకు ఆర్డర్లు ఇవ్వలేదు. అదే జగన్ దగ్గర పనిచేసిన పూడి శ్రీహరి అండ్ అదర్స్‌కు వెంటనే ఆర్డర్లు ఇచ్చారు. సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకు పీఆర్వోలు, అమ్మగారి ప్యాలెస్‌లో పనిచేసే జీతగాళ్లకు సర్కారీ కొలువులు ఇచ్చారు. అది వైసీపీ స్కూలు. ఇది టీడీపీ యూనివర్శిటీ. సిలబస్‌లు వేరుంటాయి. ఎవరి లెక్కలు వారివి! ఎవరి హృదయం వారిది!! వైఎస్-జగన్‌లా చంద్రబాబు చేయలేరు. చంద్రబాబులా వైఎస్-జగన్ చేయలేరు. ఎవరి హృదయం వారిది!!!
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదా చేసినందుకే.. సాక్షిమీడియాలో పనిచేసే సిబ్బంది, జర్నలిసుట సంఘాలు భూమి-ఆకాశం ఏకం చేసేలా ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడమే వింత. నిజానికి సోదాలు-అరెస్టులు-జైలు ధనుంజయరెడ్డి అనే కొత్తగా ఎడిటరయిన ధనుంజయరెడ్డితోనే మొదలుకాలేదు. నిజానికి ఆయన ఇంట్లో సోదాలు చేసింది లిక్కర్ కేసు లింకుల మీద.
విజయా బ్యాంకును మోసం చేసిన కేసులో సూర్య ఎండి నూకారపు సూర్యప్రకాశరావును సీబీఐ అరెస్టు చేసి, 16 నెలలు జైల్లో పెడితే ఒక్క జర్నలిస్టు సంఘం నోరెత్తలేదు. కాకపోతే బీసీ నేతను అన్యాయంగా అరెస్టు చేశారంటూ, కొన్ని బీసీ సంఘాలు అమాయకంగా గళమెత్తాయి. నిజానికి నూకారపు చేసిన మోసం ఆయన పత్రిక పెట్టకముందు జరిగిన కేసు. నాదర్‌గుల్ గ్రామాన్ని గంపగుత్తగా బ్యాంకులో తాకట్టు పెట్టిన కేసు దానికి అదనం. దానికి బీసీ కులంతో సంబంధం లేదు.
ఆ తర్వాత డెక్కన్ క్రానికల్ ఎండి టి. వెంకట్రామిరెడ్డిని కూడా అరెస్టు చేసి జైల్లో వేశారు. బ్యాంకులను, షేర్‌హోల్డర్లను మోసం చేశారన్న అభియోగంతో ఆయనను అరెస్టు చేశారు. అప్పుడు ఏ ఒక్క జర్నలిస్టు సంఘం, వెంకట్రామిరెడ్డి అరెస్టును ఖండించలేదు.
ఆ తర్వాత టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ సందర్భంలో కొన్ని జర్నలిస్టు సంఘాలు దానిని ఖండించాయి. నిజానికి రవిప్రకాష్ అరెస్టుకు , ఆయనపై నమోదయిన కేసుకు, మీడియాకు ఎలాంటి సంబంధం లేదు.
తర్వాత సాక్షిని పుట్టించిన వైసీపీ ఎంపి జగన్‌ను అరెస్టు చేసిన కేసుకు, మీడియాకు ఎలాంటి సంబంధం లేదు.
nb ‘నాకింత నీకింత’ పద్ధతిలో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో.. హార్డ్‌డిస్కులు సాక్షి కార్యాలయంలో ఉన్నందుకే, ఈడీ-సీబీఐ సాక్షి ఆఫీసుపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. కానీ అప్పట్లో దీన్ని ఓ వీరవిప్లవ జర్నలిస్టు సంఘం నాయకుడు, సాక్షి నుంచి జీతం తీసుకుంటున్న విశ్వాసంతో, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన శ్రమదానానికి జగన్ సీఎం అయిన మంచి గిట్టుబాటే లభించిందనుకోండి. అది వేరే విషయం.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆంధ్రప్రభ ఎండి ముత్తా గౌతమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. వార్త యజమాని గిరీష్ సంఘీ ఇప్పటికీ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. అందాకా ఎందుకు? తాజాగా గ్రూప్ 1 కేసులో అరెస్టయిన పమిడికాల్వ మధు కూడా లబ్ధపతిష్ఠుడైన జర్నలిస్టే. మరి ఆయన చేసిన నేరాన్ని జర్నలిస్టు అయినందున మాఫీ చేస్తామంటారా?
జిల్లాల్లో ఇంకొన్ని ముచ్చట్లు. జిల్లాల్లో ఇసుక, మైనింగ్, అక్రమ బియ్యం రవాణా చేసే లారీలను ఆపి, మామూళ్లు వసూలు చేస్తున్న గ్రామీణ ప్రాంత విలేకరులను, ఇటీవలి కాలంలో తరచూ అరెస్టు చేస్తున్నారు. మరి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముఠా అందామా? బ్లాక్‌మెయిల్ చేస్తున్న మీడియా అనాలా? వారి అక్రమాలకు-మీడియాకు సంబంధం ఏమిటి? మరి వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని.. ఏ జర్నలిస్టు సంఘం నాయకుడైనా ప్రకటన విడుదల చేస్తే దేనితో నవ్వాలి? చెబితే సంతోషం!
వీరంతా వివిధ నేరాలకు సంబంధించి, కేసులు ఎదుర్కొంటున్న వారే. దాని ప్రకారమే కేసులు నమోదయ్యాయి. అంటే ఒక మీడియా సంస్థ నిర్వహించే వ్యక్తి, తర్వాత ఎంపీ అయితే ..మీడియా సంస్థ యజమాని లేదా ఎడిటర్ అయినంత మాత్రాన, అతగాడి అవినీతిని మాఫీ చేయాలన్నదే జర్నలిస్టు సంఘాల విధానమా?