నలుగురు రెడ్ల చేతుల్లోనూ ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు రెడ్ల చేతుల్లో కొనసాగుతుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. డిజిపిగా 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని కడప జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నిబంధనలన్నీ తుంగలో తొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదే కడప జిల్లాకు చెందిన జవహర్ రెడ్డిని నియమించనున్నారని తెలిపారు. జవహర్ రెడ్డి మంచి అధికారి అని కానీ ఆయన కంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డమ్మీగా కొనసాగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా కడప జిల్లా, పులివెందుల కే చెందిన మరో ఐఏఎస్ అధికారి కంట్రోల్ చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

కులం చూడం మతం చూడమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కులాన్ని మాత్రమే చూస్తారని ఈ నియామకాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుందన్నారు. ఇక పార్టీ పరంగా నియమించిన కోఆర్డినేటర్లలోను 90 శాతం మంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు. కర్నూలు, నంద్యాల కోఆర్డినేటర్ గా అమర్నాథ్ రెడ్డి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపూర్, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్ గా భూమన కరుణాకర్ రెడ్డి లను వ్యవహరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డికి తోడు బీదా మస్తాన్ రావు ను సహా కోఆర్డినేటర్ గా నియమించినప్పటికీ , ఆయన పాత్ర పరిమితమని తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ గా అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గా పీవీ మిథున్ రెడ్డి లను నియమించడం జరిగిందని తెలిపారు. పీవీ మిథున్ రెడ్డి తో పాటు, సహాయకుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ను నియమించాలన్నారు. తమ జిల్లాలలో అభివృద్ధి పనుల సమీక్ష సమావేశాలకు పీవీ మిథున్ రెడ్డి మినహా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏనాడూ హాజరయ్యింది లేదన్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్ గా వై వి సుబ్బారెడ్డిని నియమించిన పార్టీ నాయకత్వం, పార్వతీపురం, అల్లూరి జిల్లాకు మాత్రం బీసీ నాయకుడైన బొత్స సత్యనారాయణను కోఆర్డినేటర్ గా నియమించిందన్నారు. కోఆర్డినేటర్లలో దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు అసలు చోటే కల్పించలేదని పేర్కొన్నారు. రెడ్డి నేతల కింద రెండు చోట్ల మాత్రం బీసీ నేతలను పనిచేయమని పురమాయించారన్నారు. రాష్ట్రం లో పేరుకే బీసీ ఉపముఖ్యమంత్రులను నియమించిన జగన్మోహన్ రెడ్డి, వారికి కనీసం బాధ్యతలను అప్పగించలేదని విమర్శించారు.

స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇవ్వలేదు
రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పించినప్పటికీ, స్వేచ్ఛగా మతాన్ని ప్రచారం చేసుకునే వెసులుబాటును మాత్రం కల్పించలేదని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ట్రాఫిక్ చలాన్లపై ఏసుక్రీస్తు సందేశాలతో కూడిన వ్యాఖ్యలు ముద్రించి ఉండడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో, దుర్గగుడిలో అన్య మత ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ముద్రించే ట్రాఫిక్ చలాన్లపై కూడా క్రైస్తవ మత ప్రచారం ఎందుకని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే… ట్రాఫిక్ చలాన్ లో పుస్తకాలు అయిపోతే, తెమ్మంటే ఇలా ప్రింట్ చేసి తెచ్చి ఇచ్చారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి ఏకంగా 200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చర్చిల నిర్మాణాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేకపోయినప్పటికీ, క్రైస్తవులు తమ సొంత నిధులతో చర్చిల నిర్మాణం చేపడితే గౌరవించవచ్చునని అన్నారు. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ గురించి స్పష్టంగా వివరించడం జరిగిందని, రాజ్యాంగానికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులతో ఒక మత ప్రార్థన మందిరాన్ని నిర్మించడం ఏమిటని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు, తమకిష్టమైన మతంలోకి ప్రజలందరినీ మార్చుకోవచ్చునని రాజ్యాంగ సవరణ చేయాలంటూ అపహస్యం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ రఘురామకృష్ణరాజు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో చాలామంది నేతలకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే కు తేడా తెలియదని ఎక్కువగా చేశారు. రిపబ్లిక్ డే, రాజ్యాంగ దినోత్సవ రోజు కు కూడా తేడా తెలియని వారు ఉన్నారన్నారు. రాజ్యాంగ దినోత్సవ దినాన్ని, జాతీయ న్యాయ దినోత్సవంగా పాటిస్తామని తెలిపారు. జాతీయ న్యాయ దినోత్సవానికి కొన్ని గంటల ముందు, ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయడానికి కృషి చేసిన న్యాయవాదులను బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదన చేయడం సహేతుకంగా లేదన్నారు. న్యాయవాదుల బదిలీలను కొలీజియం ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ, న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి కి రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ, న్యాయవాదులంతా విధులను బహిష్కరించి ఆందోళనలను నిర్వహిస్తున్నారని తెలిపారు.

మూడవ క్వార్టర్ పేమెంట్ చెల్లించండి అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
జగనన్న విద్యా కానుక లో భాగంగా బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ, విద్యా సంస్థల ఖాతాలలో నిధులు జమ కావడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 20 – 21వ విద్యా సంవత్సరానికి ఒకటి 21-22 సంవత్సరానికి రెండుక్వార్టర్స్ ఇప్పటివరకు ఫీజులు చెల్లించలేదని వెల్లడించారు. ఇప్పటికైనా వెంటనే ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. క్వార్టర్ అమ్మకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్న ఆయన, విద్యార్థులు ముందుకు వచ్చి జగన్ మామయ్య మూడుక్వార్టర్ ఫీజులు కట్టండి అని అభ్యర్థిస్తే తప్పితే, చెల్లించేలా లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 1500 కోట్ల రూపాయల అప్పుల కోసం హస్తిన కు రానుందని తెలిసిందన్నారు. ఇప్పటికే ఏడు నెలల వ్యవధిలో 60 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. ఈ ఏడాది మొత్తంగా లక్ష కోట్ల రూపాయల అప్పులు దాటిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో రాష్ట్ర జిడిపి బ్రహ్మాండంగా ఉందని రాయడం, ఢిల్లీ పెద్దలు దాన్ని నమ్మినట్లుగా నటించి అప్పులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

మీ పదవులు ఊడిపోతాయి… ఇది ట్రిపుల్ ఆర్ శపథం
రూల్స్ కమిటీ నుంచి తనని తొలగించడం కాదని, త్వరలోనే మీ పదవులన్నీ తొలగిపోతాయని, విగ్రహాలు, పేర్లతోపాటు, మిమ్మల్ని చూసుకొని వేధించిన అధికారుల పదవులు పోతాయంటూ రఘురామకృష్ణం రాజు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. లోక్ సభ రూల్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న తనని తొలగించాలని తమ పార్టీకి చెందిన ఒక రెడ్డి నాయకుడు కమిటీకి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. తమ పార్టీ నుంచి మరొక ఎంపీ నీ సభ్యుడుగా నియమించాలని కోరుతూ, తనని తొలగించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదని చెబితే బాగుండేది అన్నారు. ఒకవైపు పార్టీ సభ్యుడనని అంగీకరిస్తూనే, మరొకవైపు తనపై అనర్హత వేటు వేయాలని కోరడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని తెలిపారు.

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వాల హయాంలో ప్రజలు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదని అయినా పాదయాత్ర చేసిన వారిని ప్రజలు ఆదరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు చాలా కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నారని, తమను పలకరించి, తమ బాదలను పంచుకునే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని, అటువంటి తరుణంలో లోకేష్ ప్రజల మధ్యకు వెళ్లడం ఆనందించదగ్గ పరిణామం అని తెలిపారు. లోకేష్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన కేసులను పెట్టి వేధించే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply