– ఏప్రిల్ నుండి నేటి వరకు 17 సార్లు స్టేట్ గవర్నమెంట్ సెక్యురిటీ వేలం ద్వారా రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పిస్తే దేశంలోనే అత్యధికంగా 14 సార్లు ఏపీ ఆ అవకాశాన్ని వినియోగించుకుంది
– ఈ ఆర్థిక సంవత్సరం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఆర్బీఐ వద్ద అప్పు బోణి కొట్టింది జగన్ సర్కార్
• ఆర్బీఐ నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపాడు జగన్ రెడ్డి
• ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో ఆర్బీఐ నుండి రూ. 40 వేల కోట్ల అప్పుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే రూ. 29,500 కోట్ల అప్పుతో మన రాష్ట్రం 2 వ స్థానంలో నిలిచింది.
• పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఒరిస్సా ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసా కూడా అప్పు చేయలేదు
• ఇప్పటికే మనకున్న రుణ పరిమితిలో 97.4 శాతం ఒక్క ఆర్బీఐ నుండే అప్పు చేయడం జరిగింది.
• విచ్చలవిడిగా అప్పులు చేసి, భారీ అవినీతికి పాల్పడి దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా జగన్ అవతరించాడు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో వివిధ రాష్ట్రాలు ఆర్బీఐ నుండి చేసిన అప్పుల జాబితాలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ నిలిచిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాలు ఆర్బీఐ నుండి చేసిన అప్పుల జాబితాలో జగన్ మోహన్ రెడ్డి మన రాష్ర్టాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపాడు.
ఏప్రిల్ నుండి జులై వరకు గత నాలుగు నెలల్లో మన రాష్ట్రం కేవలం ఆర్బీఐ వద్ద నుండే రూ.29,500లు అప్పు చేసి.. దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. మనకంటే ఎక్కువగా రూ. 40 వేల కోట్ల అప్పుతో ఒక్క తమిళనాడు మాత్రమే మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి (GSDP) సుమారు 28 లక్షల కోట్లు కనుక.. ఈ ఆర్థిక సంవత్సరం దానిలో మూడు శాతం అంటే దాదాపు రూ.85 వేల కోట్ల దాకా వారికి అప్పు చేసే అవకాశం ఉంది.
ఆరకంగా చూస్తే తమిళనాడు నేటి వరకు వారికి ఉన్న రుణ పరిమితిలో కనీసం 50% కూడా వాడుకోలేదన్న విషయం సుస్పష్టమౌతొంది. ఆంధ్రప్రదేశ్ కి ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న రుణ పరిమితి రూ.30,275 కోట్లు. కానీ, ఇప్పటికే దానిలో 97.4% మనం వాడుకోవడం జరిగింది. ఆ రకంగా తమిళనాడు కంటే అత్యంత దారుణ స్థితిలో మన రాష్ట్రం ఉందనేది అర్థమౌతోంది.
పొరుగున ఉన్న కర్ణాటక మరియు ఒరిస్సా రాష్ట్రాలైతే ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు ఆర్బిఐ నుండి నయా పైసా అప్పు చేయలేదు. వెనుకబడిన రాష్ట్రమైన జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సంవత్సరం ఆర్బీఐ నుండి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. కానీ మన రాష్ట్రం మాత్రం దేశంలోనే అత్యధికంగా రూ. 29,500 కోట్లు అప్పు ఒక్క ఆర్బిఐ నుండే తీసుకుంది.
దేశంలో మిగతా అనేక పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర (రూ.23,000 కోట్లు), రాజస్థాన్ (రూ.20,500 కోట్లు), తెలంగాణ (రూ.17,000 కోట్లు), పంజాబ్ (రూ.15,500 కోట్లు), కేరళ (రూ.12,500 కోట్లు), ఉత్తరప్రదేశ్ (రూ.9,500 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.6,500 కోట్లు) గుజరాత్ (రూ.5,500 కోట్లు), వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ (రూ.4,000 కోట్లు) మన రాష్ట్రం కంటే చాలా తక్కువగా నేటి వరకు ఈ సంవత్సరం ఆర్బిఐ నుండి అప్పు చేయడం జరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్.బి.ఐ మొదటి నాలుగు నెలల్లో 17 సార్లు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలం ద్వారా రాష్ట్రాలకు అప్పులిస్తే.. మన రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా 14 సార్లు ఆ అవకాశాన్ని వినియోగించుకుని భారీగా అప్పు చేసింది. మరే ఇతర రాష్ట్రాలు ఈ సంవత్సరంలో ఇన్నిసార్లు అప్పు కోసం ఆర్బిఐ గుమ్మం తొక్కలేదు.
ఉదాహరణకు తమిళనాడు 13 సార్లు, తెలంగాణ 12 సార్లు, కేరళ 9సార్లు మహారాష్ట్ర కేవలం ఆరుసార్లు ఆర్.బి.ఐ వద్దకు వెళ్లగా.. గుజరాత్ అయిదు సార్లు, ఉత్తర ప్రదేశ్ నాలుగు సార్లు, వెస్ట్ బెంగాల్ మూడుసార్లు, బీహార్ రెండుసార్లు మనకంటే చాలా తక్కువసార్లు అప్పుల కోసం ఆర్బిఐ గుమ్మం వద్దకు వెళ్లాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో మొదటి మంగళవారమే జగన్ రెడ్డి సారథ్యంలోని మన రాష్ట్రం రూ.3,000 కోట్లు అప్పుతో ఆర్.బి.ఐ వద్ద బోణి కొట్టింది. దేశంలో మరే ఇతర రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి వారంలోనే ఆర్బిఐ వద్ద అప్పు చేయలేదు. ఆ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు సృష్టించాడు. ఇది ఏ చందాన ఉందంటే ఒక వ్యాపారస్థుడు తన దుకాణం తెరిచి పైసా వ్యాపారం చేయకుండానే అప్పు కోసం తన దుకాణం బయట బొచ్చె పట్టుకున్నట్లుంది.
దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేనంత అప్పుల అవసరం మన రాష్ట్రానికి ఎందుకు వస్తోంది? దేశంలో మరే ఇతర రాష్ట్రం ఆర్.బి.ఐ గుమ్మం తొక్కనన్నిసార్లు మన రాష్ట్రం బొచ్చె పట్టుకొని ఆర్బిఐ గుమ్మం వద్దకు దేనికి వెళుతుంది? దేశంలో మరే ఇతర రాష్ట్రం ఆర్బిఐ వద్ద అప్పు బోణీ కొట్టకముందే మన రాష్ట్రం దేనికి బోణీ కొట్టాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం… ఒకటే జవాబు.. అది జగన్మోహన్ రెడ్డి భారీ అవినీతి.
విచ్చలవిడిగా దొరికిన కాడికి వేల కోట్లు అప్పుచేసి వాటిని దొడ్డి దారిన భారీగా తన సొంత ఖజానాను నింపుకోవడం జగన్ రెడ్డికి పరిపాటిగా మారింది. అందుకే నేడు దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవతరించాడు. ఒకపైసా కూడా అభివృద్ధికి ఖర్చు చేసిన పాపాన పోలేదు. అందుకే నేడు గుంతలమయమై వర్షాలకు పూర్తిగా మునిగిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. పేదవాడి జగన్ కాలనీలు చెరువులుగా మారిపోయాయి.
అసంపూర్తిగా మిగిలిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెచ్చులూడిపోతున్న స్కూల్ భవనాల పైకప్పులు మన కళ్లెదురుగా వెక్కిరిస్తున్నాయి. ప్రతి ఊరిలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నొక్కుతున్న ఉత్తుత్తి బటన్లతో, కోతలు పడ్డ సంక్షేమ పథకాలతో ప్రజలు సతమతమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులు కేవలం తన ధన దాహం తీర్చుకోవడానికే గానీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కాదని నేడు రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
దేశంలో మరే ఇతర రాష్ట్రాలకు లేనటువంటి అప్పుల కోసం ఇంతగా తహతహలాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నేడు మన రాష్ట్రానికి ఎందుకు పట్టాయో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలి. మొదటి నాలుగు నెలల్లోనే ఆర్బిఐ వద్ద ఇంత భారీగా అప్పు దేనికి చేశారు, దాన్ని ఎవరి ఖాతాలలోకి మళ్లించారో సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో, (ఏప్రిల్-జులై) వివిధ రాష్ట్రాలు ఆర్బీఐ వద్ద చేసిన అప్పుల వివరాలు :
క్ర. సంఖ్య రాష్ట్రం పేరు ఆర్బీఐ వద్ద చేసిన అప్పు
1 తమిళనాడు 40,000 కోట్లు
2 ఆంధ్రప్రదేశ్ 29,500 కోట్లు
3 మహారాష్ట్ర 23,000 కోట్లు
4 రాజస్థాన్
20,500 కోట్లు
5 తెలంగాణ 17,000 కోట్లు
6 పంజాబ్
15,500 కోట్లు
7 కేరళ
12,500 కోట్లు
8 హర్యాన 12,000 కోట్లు
9 యూపీ.
9,500 కోట్లు
10 పశ్చిమ బెంగాల్
6,500 కోట్లు
11 మధ్యప్రదేశ్
6,000 కోట్లు
12 అస్సాం
6,000 కోట్లు
13.గుజరాత్ 5,500 కోట్లు
14 బీహార్ 4,000 కోట్లు
15 ఛత్తీస్ గడ్ 3,000 కోట్లు