Home » ఈ ప్రపంచంలో మానవ జీవిత పతనానికి ప్రధాన కారణం క్రోధమే

ఈ ప్రపంచంలో మానవ జీవిత పతనానికి ప్రధాన కారణం క్రోధమే

మానవాళి పతన హేతువులలో ప్రధానమైంది క్రోధమే. ‘క్రోధం వల్ల మూఢత్వం కలుగుతుంది. దాన్నే ‘సమ్మోహం’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. దీనివల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమిస్తే బుద్ధి శక్తి నశిస్తుంది. అప్పుడు మనిషి పతితుడవుతాడు’. ఆఖరకు ఈ పతనమే మనిషి సర్వనాశనానికి హేతువవుతుంది. కనుక, వినాశనానికి ప్రధాన కారణం ‘క్రోధమే’ అని గ్రహించాలి.
ఒకసారి ఈ పతనం మొదలైతే అది ఆ వ్యక్తి సర్వనాశనం అయ్యేంత వరకూ ఆగదు. మనిషి నిలువునా పడిపోవడానికి ఒక్క క్రోధమనే దుర్గుణం చాలు. మానవాభ్యున్నతికి ఏ విధంగా ఆరోహణ క్రమం ఉంటుందో అదే విధంగా పతనానికీ అవరోహణ క్రమం ఉంటుంది. అదే ఒక్కొక్క మెట్టు మీదుగా మనిషిని దిగజారుస్తుంది. ‘దీనికంతటికీ మూలం క్రోధం’ అని తెలుసుకొనేలోగానే అంతా జరిగిపోతుంది. ఈ క్రోధానికి కూడా ఒక మూలం ఉంటుందని స్వామి దీని ముందటి శ్లోకంలో చెప్పాడు. ‘.. కామాత్‌ క్రోధో భిజాయతే’ (2.62). కోరికలే క్రోధానికి కారణం. అవి తీరనప్పుడు మనిషి కోపానికి గురవుతాడు.
ఇది సామాన్యులకేకాదు ఒక్కోసారి ధీమంతులనుకూడా పతనం దిశగా అడుగులు వేయిస్తుంది. ఈ క్రోధం వల్ల మొదట మూఢత్వం వస్తుంది. దీనితో మనిషి ‘స్మరణ శక్తి’ని కోల్పోయి ప్రవర్తిస్తాడు. తత్ఫలితంగానే ‘స్మృతి విభ్రమం బారిన పడతాడు’ అని భగవానుడు హెచ్చరించాడు. బుద్ధి నశించి, చెయ్యరాని పనులన్నీ చేసే దిశగా అలాంటివారు అడుగులేస్తారు. ఒక్కోసారి విచక్షణా జ్ఞానం సైతం కోల్పోయి అమానవీయంగానూ ప్రవర్తిస్తారు. ఇదే అనేక ప్రమాదాలకు దారితీస్తుంది.
ఈ విధమైన క్రోధాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం గురించి ప్రతి వ్యక్తీ చిత్తశుద్ధితో ఆలోచించాలన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా తనకు, తన వల్ల సమాజానికి ఏర్పడబోయే దుస్థితిని తప్పించవచ్చు. సకల అనర్థాలకు కారణమైన ఈ దుర్గుణం ఎల్లవేళలా పరిహరించవలసిందే. ‘కామం, క్రోధం, సమ్మోహం, స్మృతి విభ్రమం, బుద్ధి నాశనం, చివరకు సర్వనాశనం’- ఈ వరుసలో తానెక్కడున్నాడో తెలుసుకున్న మానవుడు సరైన మార్గంలోకి మళ్లి, భగవద్భావన దిశగా పయనిస్తాడు.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఎవరు, ఏ విధంగా జీవించినా తనను తాను నియంత్రించుకొంటే శుభాలు జరుగుతాయి. ఎదుటి వ్యక్తికి అడ్డు చెప్పే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. కానీ, తన స్వేచ్ఛ తన బతుకునేగాక సమాజంలోని ఇతరుల బతుకునుకూడా సర్వనాశనం చేసే దిశగా వున్నప్పుడే పెనుప్రమాదాలు పొంచి వుంటాయి. తన కోరికలు తీర్చుకోవడానికి సిద్ధమైన వ్యక్తి ఉచితానుచితాలు ఆలోచించక పోవడానికి అతనిలో ‘స్మృతి విభ్రమమే’ మూల కారణం. కనుక, జీవితంలో మనం ఆశించినవన్నీ విధిగా పొంది తీరాలన్న తీవ్ర కోరికల్ని పెంచుకోక పోవడమే మంచిది.
ఒక్కోసారి మన కోరికలు ఎండమావుల్లో నీటిని ఆశించినట్లుగా ఉంటాయి. అవి తీరే మార్గమే ఉండదు. అయినా, అవి ఉన్నట్టు కనిపించి మనల్ని భ్రమింపజేస్తుంటాయి. ఈ విషయంలో మనకు తెలియకుండానే మనలో విపరీత ధోరణులు చోటు చేసుకొని మానవీయ విలువలకూ తిలోదకాలు ఇచ్చేంత తీవ్రతర ప్రభావానికి లోను చేస్తాయి. కనుక, కోరదగిందే కోరుకొంటూ, ధర్మబద్ధంగా, కర్తవ్య నిష్ఠ, గుండె దిటవులతో జీవించగలిగితే వినాశకరమైన క్రోధాలోచనలకు ఎంతమాత్రం చోటు వుండదు.

Leave a Reply