అన్నామలై.. తమిళనాడు బీ.జే.పీ. అధ్యక్షుడు. పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన రాజీనామా విషయంగా మీడియాలో సమాచారం వస్తోంది. తాను అధ్యక్ష పదవికి పోటీలో లేను అని అన్నామలై స్పష్టం చేస్తూ “ఎవరు అధ్యక్షుడైనా నేను రాష్ట్రంలోనే తీవ్రంగా పనిచేస్తాను” అని తెలియజేశారు.
దేశ రాజకీయాల్లో అన్నామలై వంటి దార్శనికత, ఆలోచనా సరళి, పనితీరు, దక్షత, మనస్తత్వం, డయనామిసమ్ ఉన్న వారు అరుదుగా ఉంటారు. తమిళనాడు లో బీ.జే.పీ.కి ఇవాళ్టి ఉనికికి మూలకమూ, కీలకమూ అన్నామలై! అన్నామలై లేని తమిళనాడు బీ.జే.పీ. జవసత్వాలు లేనిది ఔతుంది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత డీ.ఎమ్.కె. ప్రభుత్వాన్ని ఓడించడం అన్న అతి ముఖ్యమైన బాధ్యతతో కేంద్ర బీ.జే.పీ. అధిష్టానం పని చేయాల్సి ఉంది. తమిళనాడు మరో కర్ణాటక, మరో కేరళ అయిపోకూడదు. తమిళనాడు ఇవాంజలైజేషన్ (Evangelization) అంటే క్రైస్తవీకరణం అయిపోకూడదు. ఇస్లామైజేషన్ అయిపోకూడదు. ‘స్టాలిన్ ముఖ్యమంత్రి అయింది మావల్లే’ అని ఒక క్రైస్తవ బిషప్ బహిరంగంగానే ప్రకటించాడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాజకీయ ప్రయత్నానికి వెన్నుదన్ను ఇవాంజలికల్ ఫోర్సెస్ అన్న విషయమూ బహిరంగమే. నిన్నటి రోజున స్టాలిన్ కా(ర్)ల్ మార్క్స్ విగ్రహం స్థాపిస్తానని చెప్పారు.
దీన్నిబట్టి తమిళనాడు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సామాన్య ప్రజల తిరస్కారంతో, ఏవగింపుతో ఒక సరైన పరిణామంగా దేశంలో కమ్యూనిజం (communism) చచ్చిపోయింది. కమ్యూనిస్టులను దేశ ప్రజ చీత్కరించుకుంటున్న క్షేత్ర వాస్తవం తెలిసిందే. ఈ స్థితిలో కారల్ మార్క్స్ విగ్రహం పెడతాను అని తమిళనాడు ముఖ్యమంత్రి అనడం భీతి కొలిపే విషయం. నిజానికి (కార్)ల్ మార్క్స్ విగ్రహంవల్ల డీ.ఎమ్.కె.కు ఏ లబ్దీ ఉండదు. అయినా స్టాలిన్ ఆ ప్రకటన చేశారు అంటే దేశ, సమాజ విధ్వంసకర శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు ఏ మేరకు బలంగా పనిచేస్తున్నాయో ఊహించుకోవచ్చు. స్టాలిన్ కొడుకు ఉదయనిది ఎందువల్ల, ఏ ప్రోద్బలంవల్ల సనాతనంపై విషం కక్కుతూంటాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడు రాష్ట్రాన్ని కాపాడుకునే కార్యాచరణ చేయాల్సిన బాధ్యత, దేశ అధికార పార్టీ బీ.జే.పీ.కి ఉంది. అందులో భాగంగా తమిళనాడు లో ప్రధాన ప్రతిపక్షమైన ఎ.ఐ.ఎ.డీ.ఎమ్.కె. పార్టీతో కలిసి బీ.జే.పీ. ఎన్నికలకు వెళ్లాలి. ఆ ప్రయత్నాలు మొదలైనట్టు తెలియవస్తోంది. ఏ.ఐ.ఎ.డీ.ఎమ్.కె.తో పొత్తును గతంలో అణ్ణామలై అంగీకరించలేదు. అన్నామలై కు ఎ.ఐ.ఎ.డీ.ఎమ్.కె. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి కి పొసగదు. రానున్న ఎన్నికల్లో డీ.ఎమ్.కె.ను ఓడించాలంటే.. బీ.జే.పీ. & ఎ.ఐ.ఎ.డీ.ఎమ్.కె. పొత్తు తప్పనిసరి. ఈ పరిస్థితిలో అన్నామలై పదవీ కాలం ముగుస్తోంది.
బరిలో లేదా క్షేత్రంలో అన్నామలై లేకపోతే బీ.జే.పీ.కి జ్వలనం ఉండదు. బీ.జే.పీ- ఏ.ఐ.ఎ.డీ.ఎమ్.కె. పొత్తు కుదరకపోతే, తమిళనాడు లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడదు. అందుకని నయినార్ నాగేందిరన్ కొత్త బీ.జే.పీ. అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. ఈయన ఒకప్పటి ఎ.ఐ.ఎ.డీ.ఎమ్.కె. నాయకుడే. కనుక ఆ పార్టీతో వ్యవహారాల్ని నిర్వహించగలరు. బీ.జే.పీ. ఏ.ఐ.ఎ.డీ.ఎమ్.కె. పొత్తు విషయంగా నయినార్ నాగేందిరన్ ఎంతో అవసరం.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అన్నామలై పార్టీ అధ్యక్షుడుగా ఉండనంత మాత్రాన జరిగే తేడా, నష్టం ఏమీ ఉండదు. ఎన్నికలప్పుడూ, అంతకు ముందు, తరువాత అన్నామలై కీలకం కానున్నారు. “ఎవరు అధ్యక్షుడైనా నేను రాష్ట్రంలోనే తీవ్రంగా పనిచేస్తాను” అని అన్నామలై చెప్పినదాన్ని సరిగ్గా అవగతం చేసుకోవాలి.
2004లో కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లినప్పుడు.. డీ. శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడు. అటు తరువాత కూడా డీ. శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడుగానే ఉన్నా, రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే పార్టీ నడిచింది.
కేంద్రస్థాయిలో బీ.జే.పీ. పార్టీలో నడ్డా, అమిత్ షా లు పనిచేసినట్టుగా.. తమిళనాడు లో కొత్త అధ్యక్షుడు, అన్నామలై పనిచేస్తారని గ్రహించవచ్చు. ఒక ఐ.పీ.ఎస్. అధికారి ఐన అన్నామలై ను గుర్తించి, పార్టీ అధ్యక్షుణ్ణి చేసింది అమిత్ షా. అన్నామలై పరంగా జరుగుతున్న పరిణామాలు సరైన ఆలోచనతోనే జరుగుతాయి.
అన్నామలై తమిళనాడు బీ.జే.పీ.కే. కాదు జాతీయ స్థాయిలో దేశానికే అవసరమైన రాజకీయ నాయకుడు.

9444012279