Suryaa.co.in

Features

మెడికల్ పరీక్షలలో ‘ కాపీయింగ్ , ఉదారంగా మార్కులు వేయడం ఆగేది ఎప్పుడు?

ది. 13/04/2025 న ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ లో
సిద్ధార్ధ లో ‘ శంకర్ దాదా’ లు , ది. 14/04/2025 న ఈనాడు లో పరీక్షల్లో ఉత్తీర్ణతకు అడ్డదారులు అనే శీర్షికలతో విజయవాడ లో ప్రభుత్వ వైద్యకళాశాలలో… యూనివర్సిటీ పరీక్షలలో జరుగుతున్న కాపీయింగ్ గురించి, ఇతర అవకతవకల గురించిన వార్తలు ప్రచురించారు.

నిజానికి ఆ వార్తలలో సమస్య తీవ్రత , దాని విస్తృతి , పరిష్కారాల పై మరింత వివరంగా వ్రాసుంటే బాగుండేది.

1. యూనివర్సిటీ పరీక్షలలో సీసీటీవీ కెమెరా ల పర్యవేక్షణ , రికార్డింగ్ అనేవి… పరీక్షా హాల్ లో ఉన్న యూనివర్సిటీ అబ్జర్వర్ / అధికారి , supervisor … చూడటానికి మాత్రమే . రికార్డు చేసిన సీసీటీవీ వీడియో ఫుటేజ్ ను తప్పనిసరిగా రివ్యూ చేయాల్సిన పాలసీ అంటూ ఏమీ లేదు.

2. చాలా సార్లు రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ CD లను కళాశాలల సిబ్బంది పాడుచేసి ( గీతలు గీసి ) యూనివర్సిటీ కి పంపుతారు.
సుప్రీంకోర్టు 2018 లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో… పరీక్షల్లో రికార్డు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను తప్పనిసరిగా రివ్యూ చేసి .. ఆ రిపోర్ట్ ను బహిరంగ పరచాలని ( పబ్లిక్ డొమైన్ ) తీర్పు ఇచ్చింది.

నిజానికి NTR హెల్త్ యూనివర్సిటీ.. పరీక్షలలో ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా … ఒకటి రెండు రికార్డింగ్ లు ( CD ) లు చూడడం తప్ప , విధిగా ఫుటేజ్ ను రివ్యూ చేసి …. కాపీయింగ్ ను ఉక్కుపాదంతో అణచడం అనేది లేదు. నిజానికి చేయాలన్న ఆలోచన , నిబద్ధత యూనివర్సిటీ కి లేవు.

టెక్నాలజీ లేక కాదు !

కోవిడ్ సమయం లో వైద్యఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల వార్డులు , ICU లలో CCTV లు అమర్చి 24 గంటలు స్టేట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేశారు.
అటువంటి యూనివర్సిటీ నిర్వహించే ఫైనల్ పరీక్షలను .. ఆన్లైన్ లైవ్ మానిటరింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయడానికి కంట్రోల్ రూమ్ ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ?

భవిష్యత్తు వైద్యులకు , ఇతర కోర్సులకు పరీక్షలు నిర్వహించడాన్ని అసలు ప్రాముఖ్యతేలేని, విలువలేని విషయంగా పరిగణిస్తున్నారా ? పరీక్షలలో పారదర్శకత లేకుండా ( స్ట్రిక్ట్ గా జరగకుండా ) బాగుపడిన విద్యావ్యవస్థ ప్రపంచ చరిత్ర లోనే లేదు . విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే … ప్రశ్నా పత్రాల స్థాయి , పరీక్షల నిర్వహణ , జవాబు పత్రాల మూల్యాంకనం అనేవి అత్యంత పారదర్శకం గా జరగాలి. ఇవే విద్యాసంస్థల భవిష్యత్తును నిర్దేశిస్తాయి.

అమెరికాలో ప్రైవేట్ యూనివర్సిటీ లు అత్యధికమైనా కూడా … అత్యున్నత ప్రమాణాలు ఉండటానికి ప్రధాన కారణం … అవకతవకలకు ఆస్కారం లేని అత్యంత పారదర్శకమైన పరీక్షల విధానమే !

గవర్నర్ ల మధ్య వ్యత్యాసం

చట్టబద్ధంగా గవర్నర్ అన్ని యూనివర్సిటీ లకు ఛాన్సలర్.2014-19 ల మధ్య కేరళకు జస్టిస్ పి . సదాశివం గవర్నర్ కాగా, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలకు నరసింహన్ గవర్నర్ గా ఉండేవారు.

కేరళ లోని యూనివర్సిటీ స్థాయి పరీక్షలలో … అనగా సాధారణ డిగ్రీ నుండి సాంకేతిక విద్య వరకు పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు పూర్తిగా నివారించడానికి … పరీక్షాకేంద్రాలలో సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలని జస్టిస్ సదాశివం గవర్నర్ హోదాలో ఆదేశించారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న నరసింహన్ మాత్రం … పరీక్షల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఉన్న ఔచిత్యాన్ని ఈ విధంగా వ్యతిరేకించారు. ” మన పిల్లలను భవిష్యత్తు అధికారులుగా ఇలాగేనా తయారు చేసేది. విద్యార్థులు ఏమైనా దొంగలా అని ! ” .

వినడానికి ఎంతో ఉదాత్తంగా అనిపించే ఈ మాటలు … ఇంటెలిజెన్స్ బ్యూరో ( IB ) లో సుదీర్ఘ అనుభవమున్న నరసింహన్ మాట్లాడటం చాలా వింతగానూ , ఆయన ఉద్దేశ్యాలపై అనుమానాలను కలిగించాయి.

ప్రతీ రోజూ గుడికి వచ్చే భక్తులను తనిఖీ చేస్తారు , అక్కడ కూడా CCTV కెమెరాలు తప్పనిసరిచేశారు. అంటే భక్తుల పై నమ్మకం లేకపోవడం – అగౌరవపరచడం కాదు కదా! నేరాన్ని నివారించడానికి మరియు నేరం జరిగితే సాక్ష్యంగా కూడా ఉంటుందని గుడిలో CCTV లు ఏర్పాటు చేశారు!

పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరా లు పెట్టడం విద్యార్థులను అనుమానించడం అయితే … మరి ఇన్విజిలేటర్లు , సెంటర్ సూపర్వైజర్ లు ఎందుకు ? వాళ్ళను నియమించడం విద్యార్థులకు self restraint, self respect లేదని అనుమానించి, అవమానించడం కాదా !

ఇద్దరు గవర్నర్ల నిర్ణయాల మధ్య వ్యత్యాసం … కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించాయి. ఇది ప్రస్పుటంగా తెలియడానికి చిన్న ఉదాహరణ …. జాతీయ స్థాయి మెడికల్ ఇనిస్టిట్యూట్ లలో PG స్థాయిలో తెలుగు విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా తగ్గాయి!

పరీక్షలలో ఉదారంగా మార్కులు వేయడం , అవకతవకల వలన మెడికల్ విద్యార్థుల చదివే తీరే మారిపోయింది. గైడ్ లు లాంటి పుస్తకాలు చదువుతున్నారు… ఇదేదో C కేటగిరీ విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు అనుకుంటే .. అది పిచ్చి భ్రమ !
ఓపెన్ కేటగిరీ , రిజర్వేషన్ , B కేటగిరీ , C కేటగిరి అంటూ తేడా ఏమీ లేదు. చదివే పుస్తకాల సైజు, చదివే సమయం గణనీయంగా తగ్గింది.

పైపెచ్చు స్కూల్ , ఇంటర్మీడియట్ స్థాయి నుండి చదువు అంటే పరీక్షలు, వాటికోసం బట్టీ కొట్టడమే .. అని నేర్పి మెడికల్ కాలేజీ లకు పంపుతున్నారు. ఆ పిల్లలకు self directed learning అనేది అసలు అలవాటే లేదు ( అతి కొద్ది మంది మినహాయింపు ).

పేషెంట్ ను పరిశీలన , పరీక్ష చేయడం ద్వారా వ్యాధి పై అవగాహన పెంచుకొని .. తదుపరి ఆ విషయపరిజ్ఞానాన్ని అప్లై చేయడం అనేది బాగా తగ్గింది. నిజానికి వీటికి కావలసిన బేసిక్ అబ్జర్వేషన్ , Logic , comprehension స్కిల్స్ బడిలో (15 సంవత్సరాల లోపు) నేర్పాలి.

కానీ పాఠశాల విద్యావ్యవస్థ విద్యార్థుల మెదడులను మొద్దుబార్చి , కనీసం self reading కూడా అలవాటు చేయకుండా విద్యార్థులను కాలేజీ లకు పంపుతుంది.

డిమాండ్స్ :

1. ప్రభుత్వం , యూనివర్సిటీ , ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి అన్ని పరీక్షలకు CCTV లైవ్ మానిటరింగ్ చేయాలి. రికార్డు చేసిన ఫుటేజ్ ను రివ్యూ చేసి , ఆయా రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచి … పరీక్షల నిర్వహణలో అవకతవకలు పూర్తిగా నివారించాలి.
2. నిజానికి వైద్య విద్య పరీక్షలో ఉన్న అతి పెద్ద సమస్య కాపీయింగ్ కాదు…. అది ఉదారంగా మార్కులు వేయడం. దానికి విరుగుడు గా యూనివర్సిటీ చేసిన ప్రయత్నాలు ముగ్గురు చేత వాల్యూ చేయించడం అనేది… MARKS INFLATION ను మరింతగా పెంచింది.
దీనికి నివారించడానికి ముందుగా కావలసింది ‘ SSC, ఇంటర్మీడియట్ బోర్డు ల తరహా లో principles of valuation ను ప్రచురించాలి. ప్రజాస్వామ్యం లో సమస్యలకు విరుగుడు పారదర్శకత. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలు సోషల్ ఆడిట్ చేయడం ద్వారా marks inflation ను పూర్తిగా కట్టడి చేయవచ్చు.

– డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్.

LEAVE A RESPONSE