Suryaa.co.in

Features

గజల్ గానంలో ఎన్నదగిన‌ గాయకుడు హరిహరన్

మెహ్‌దీహసన్,‌‌‌‌ గులామ్ అలీ ఈ ఇద్దరి తరువాత గజల్ గానంలో ఎన్నదగిన‌ గాయకుడు హరిహరన్. ఎవరైనా ‘గజల్ గాయకులు’ అవాలి అంటే మెహ్‌దీహసన్, గులామ్ అలీలను అవగతం చేసుకోవాల్సిందే. ఆ కోవలో ఈ ఇద్దరి గాన విధానాల్ని పుణికిపుచ్చుకుని చక్కని, గొప్ప గజల్ గానాన్ని చేశారు హరిహరన్.

దక్షిణభారతీయుడై ఉండీ.. ఉర్దూ ఉచ్చారణను పట్టుకోవడం హరిహరన్ ఘనత‌. పీ.బీ. శ్రీనివాస్ తరువాత, ఉర్దూ ఉచ్చారణను సరిగ్గా పట్టుకోగలిగిన దక్షిణాది‌ గాయకుడు హరిహరన్. (ఆయన ముంబైలో పెరిగారు)

కర్ణాటక సంగీతంలో తర్ఫీద్ పొందిన హరిహరన్ గజల్ గాయకుడుగా రాణించడం విశేషం. 1978లో గమన్ అన్న హిందీ సినిమాలో జయదేవ్ సంగీతంలో, నేపథ్య గాయకుడుగా పరిచయమయ్యారు. అంతకు ముందు అఖిల భారతీయ‌స్థాయి‌లో జరిగిన పోటీలో ఉత్తమ గాయకుడిగా ఎన్నికయ్యారు హరిహరన్.

మనదేశ గజల్ గాయకుల్లో హరిహరన్ గొప్పవారు‌. జగ్జీత్ సింహ్ ప్రజాదరణ పొందిన మనదేశ గజల్ గాయకుడు అన్నది‌ నిజం. ప్రౌఢత్వంలో‌, సృజనాత్మకతలో హరిహరన్‌ గొప్పవారు.

సరైన‌‌ ఎఱుకతో ఉన్నతస్థాయి‌ గజల్ గానం చేశారు హరిహరన్.
“పత్తా పత్తా బూటా బూటా” గజల్ గులామ్ అలీ పాడిన దానికన్నా హరిహరిన్ పాడిందే‌ గొప్పగా ఉంటుంది!

గుల్ఫామ్, హొరెజాన్, రెఫ్లెక్షన్స్, హల్కా నషా, దిల్ కీ బాత్, కరార్, హాజిర్, సుకూన్ వంటి గొప్ప గజల్‌ ఆల్బమ్‌లను ఇచ్చారు హరిహరన్.

తెలుగులో గజల్‌‌‌ అని‌ పాడుతున్న వాళ్లు హరిహరన్ గజల్‌ గానాన్ని పది శాతమైనా అర్థం చేసుకోగలిగితే తెలుగు గజల్‌ గానం‌ ప్రస్తుతం ఉన్న వికృతమైన, హాస్యాస్పదమైన స్థితిని దాటుకుని మెఱుగుపడుతుంది.

గజల్ గానానికి‌ baritones మేలైనవి‌.‌ గాత్రంలో సాంద్రత ఉంటే గజల్ గానమూ సాంద్రంగా ఉంటుంది. Tenor-timbres లేదా sharp voices గజల్ గానానికి వన్నే తీసుకురావు. Rounded even tones గజల్ గానానికి గొప్పతనాన్ని ఇస్తాయి. గజల్ గానానికి‌‌ వన్నే తెచ్చే లేదా ఉన్నతంగా పొసిగే rounded even warm baritone హరిహరన్‌ది. గజల్ గానం అన్నది తెలుగులో ఉన్నట్టుగా లొల్లాయి గానం కాదు. గజల్ గానం ఒక ఉదాత్తమైన గానం.

గజల్ గానం అన్నది rounded even singing and singing with density and singing with musicality. ఈ జ్ఞానం ఉన్నవారు హరిహరన్. ( ఈ జ్ఞానం తెలుగుకు ఎప్పటికైనా వస్తుందా?) బాగా చిన్నప్పటినుంచీ హరిహరన్‌ గజల్‌ గానాన్ని‌ ఆస్వాదిస్తూ వస్తున్నాను. ఆయన పాడిన‌‌ ఎన్నో‌ గౙళ్లు నాకిష్టం.

నేను గజళ్లు రాయడానికి అలవాటు పడుతున్న తొలినాళ్లు‌ అవి. ఆయన పాడిన ఒక గజల్ లోని ఆహిస్తా పదానికి ఉన్న మెలమెల్లగా‌ అన్న అర్థాన్ని తెలుసుకుని, ఆ మెలమెల్లగా‌ పదాన్ని రదీఫ్ గా చేసుకుని ఓ గౙల్ రాశాను.

తెలుగు గజల్ గానం హరిహరన్ గౙల్ గానాన్ని ఆదర్శంగా తీసుకుని ఏనాటికైనా వికారస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE