మరో 4 రోజులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక

Spread the love

హైదరాబాద్ : ఓ వైపు మండుటెండ‌లు.. మరో వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు అకాల వర్షాలు.. ఇలా భిన్న‌ర‌కాల‌ వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. సాయంత్రం వేళ‌ల్లో అకాలంగా కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన ధాన్యం, వేరుశెనగ పంటలు తడిసిపోతున్నాయి

రాష్ట్రంలో సోమ‌వారం 40.3 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో 44 డిగ్రీలపైన, 6జిల్లాల్లో 43 డిగ్రీలపైన, 8 జిల్లాల్లో42 డిగ్రీలపైన, 5 జిల్లాల్లో 42 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్య‌ధికంగా ఆదిలాబాద్ జిల్లాలో..
అత్య‌ధికంగా ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు, నిజామాబాద్‌ జిల్లా తొండకూర్‌, నల్లగొండ జిల్లా కేతెపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి జిలా గ్లోరి కొత్తపల్లిలలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే రోజున పగటి ఉష్ణోగ్రతలు 36.7 నుంచి 40 డిగ్రీల మధ్యన నమోదు అయినట్లు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

రాగ‌ల 4 రోజుల్లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు బాగా పెరుగుతాయి..
రాగల నాలుగు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఈనెల 6వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.

Leave a Reply