– ఆసుపత్రి భవనాన్ని రూ.2 కోట్లతో నిర్మించిన సీపోర్టు లిమిటెడ్ కంపెనీ
– ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి: కాకినాడ నగరంలో ప్రజల ప్రాథమిక ఆరోగ్య అవసరాల్ని తీర్చేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(యుపిహెచ్ సి)ని మంజూరు చేశారు. ఈ కొత్త ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవనాన్ని అన్ని వసతులతో దాదాపు రూ.2 కోట్ల ఖర్చుతో కాకినాడ సీపోర్టు లిమిటెడ్ కంపెనీ నిర్మించి నగరపాలక సంస్థకు బదిలీ చేసింది. ఈ భవనంలో కొత్త యుపిహెచ్ సిని నిర్వహించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు కాకినాడ నగరంలో 14 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.
కాకినాడలోని దుమ్మాలపేటో ఈ కొత్త యుపిహెచ్ సి ఏర్పాటుతో నగరంలో ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక యుపిహెచ్ సి అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నియమాల మేరకు ప్రతి 50 వేల పట్టణ జనాభాకు ఒక యుపిహెచ్ సి ఏర్పాటు చేయాలి. అయితే, రాష్ట్రంలో ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక యుపిహెచ్‌సి సేవలందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సేవలందిస్తున్నాయి.
ప్రతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పాటు పరిశుభ్రత నిర్వహణ కోసం మరొక సిబ్బంది ఉంటారు. ప్రాథమిక వైద్య సేవల్నిఅందించేందుకు అవసరమైన పరికరాలు, ఇతర ఏర్పాట్లు కల్పించడానికి దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతుంది.