November 16, 2026

నవలా సాహిత్యంలో సరికొత్త చరిత్ర “అంటు”

  • సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్

హైదరాబాద్: భారతీయ సాహిత్యంలో సరికొత్త చరిత్రను బిజివేముల రమణారెడ్డి రాసిన ‘అంటు’నవల లిఖిస్తుందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో జరిగిన ఛాయా లిటరసీ ఫెస్టివల్ లో ” నవల ఆవిష్కరణ సభ జరిగింది.

పుస్తకాన్ని రాయలసీమ అస్తిత్వ ఉద్యమకారుడు శివరాచర్ల ఆవిష్కరించి మొదటి కాపీని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ కు అందజేశారు. ప్రధాన వక్తగా హాజరైన కెంగార మోహన్ మాట్లాడుతూ.. రాయలసీమలో దళిత బతుకు ముఖచిత్రాన్ని ఈ నవల ఆవిష్కరించిందని, ఈనవల పుటలనిండా దళిత జీవితాల్లో సాగే కన్నీళ్లు నింపారని అన్నారు. కులం అనేది సామాజిక పరణామంలోని సంకుచిత భావాలనుండి పుడుతుందనే మార్కిస్ట్ అవగాహన రచయితకుందన్నారు.

సభలో ప్రముఖ కవి, విమర్శకులు జి .వెంకటకృష్ణ మాట్లాడుతూ.. రాయలసీమ పల్లెల్లో నేటికీ వివక్ష అంతర్భాగంగా ఉందని, నవలాకారుడు మాదిగ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు రాశాడన్నారు. ఆధిపత్య కులహంకారం ఈ నవలను గొప్ప శిల్పంగా తీర్చిదిద్ద బడిందన్నారు.

రచయిత వివేక్ లంకమల మాట్లాడుతూ.. వైవిధ్యమైన వస్తువు ఈ నవలకు ప్రాణమన్నారు.

ఆవిష్కర్త శివరాచర్ల మాట్లాడుతూ.. వివక్ష రూపాన్ని, స్వరూపాన్ని నవలకారుడు అక్షరబద్దం చేసాడన్నారు. అంటు నవలా రచయిత బిజి వేముల రమణారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని వివక్షను వర్తమాన సమాజానికి చూపడటమే అంటు నవల రాయడానికి ప్రేరణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఝాన్సీ పబ్లికేషన్స్ శ్రీదివ్య, ప్రముఖ సాహితీవేత్త లక్ష్మీనరసయ్య, కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ , ప్రముఖ అనువాద రచయిత,సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్య రంజన్, ప్రముఖ కవి అనిల్ డ్యానీ, ప్రముఖ సాహితీవేత్త డా. నాగసూర్ వేణుగోపాల్, కవి, విమర్శకులు శ్రీనివాసమూర్తి, రచయిత సుంకోజి దేవేంద్ర చారి, కవి మంచికంటి, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, మౌలానా అబుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా , నవల రచయిత నరేష్ కుమార్ సూఫీ తదితరులు పాల్గొన్నారు.

Total Visitors: 3,451,105