-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
వైసీపీ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నేరస్థుల అడ్డాగా మార్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన మాటలు మీకోసం… పట్టుబడిన రూ. 72 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ బిగ్ బాస్ ఎవరంటే వైసీపీ భుజాలు తడుముకుంటోంది. డ్రగ్స్ కేసులో వైకాపా ఎందుకు ఉలిక్కి పడుతోంది. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్ పై ఎందుకు విచారణ చేయటంలేదు? రాష్ట్రంలో మైనింగ్ మాఫియాలా డ్రగ్స్ సిండికేట్ అయింది. డైరెక్టర్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు వైసీపీ తాట తీస్తారు. తాడేపల్లి నుంచి ఢిల్లీలో డీఆర్ఐ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ కోసం ఏపీ పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ ఏమైంది?. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మార్చారు. నిర్వాహక బిగ్ బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో త్వరలో తేలుతుంది.
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏపీ డ్రగ్స్ వ్యవహారమంతా తెలుసు. దేశంలో ఎప్పుడు, ఎక్కడా జరగని విధంగా వైసీపీ మద్దతుతో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం ఏపీలో నడుస్తోంది. అఫ్గానిస్తాన్ నుంచి దేశంలోకి హెరాయిన్ ని తీసుకొస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో దిగుమతి అవుతోంది. డిఆర్ఐ 9 వేల కోట్ల హెరాయిన్ ని సీజ్ చేయడం వాస్తవం కాదా? ఈ కంపెనీ ఎక్కడుంది? విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉంది. సుధాకర్ అనే ఎమ్మెల్యే బంధువు ఈ కంపెనీని నడుపుతున్నాడు. వైసీపీ కి చెందిన వ్యక్తి ఈ కంపెనీని పెట్టడం వాస్తవం కాదా? ఇదంతా వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే జరుగుతోంది. మంత్రి పేర్ని నాని గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకుంటున్నాడు. వైసీపీకి సంబంధం లేదంటున్నారు. డ్రగ్స్ కేసులో వైసీపీ ఉలిక్కి పడుతోంది. రాష్ట్రాన్ని నేరస్థుల అడ్డాగా మార్చారు.
రాష్ట్రంలో ఏం జరుగుతోంది? దీనిపై సమగ్ర విచారణ జరగాలి. తెలుగుదేశం పార్టీ డీఆర్ఐ వారికి లేఖ రాస్తుంది. రాష్ట్రంలోని పోలీసులపై, పోలీసు బాస్ పై విచారణ చేయాలి. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల కనుసన్నల్లోనే ఈ డ్రగ్స్ దందా జరుగుతోంది. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా జరుగుతుంటే నిరోధించాల్సిన బాధ్యత పోలీసులది. వారు డబ్బుల కోసం, ప్రమోషన్ల కు కక్కుర్తిపడి దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నారు. డీఆర్ఐ అధికారులు సమగ్ర విచారణ లోతుగా చేయాలి. ఈ కేసు మూలాలు తేల్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తేలిగ్గా తీసుకుంటోంది. వైసీపీ నాయకులు డ్రగ్స్ కేసు విషయంలో తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. ప్రజల, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నారు. విజయవాడని డ్రగ్ హబ్ గా మార్చి దేశంలోని 29 రాష్ట్రాలకి డ్రగ్స్ సరఫరా చేయాలనుకునే నాయకుల పన్నాగానికి అడ్డుకట్ట పడనుందని భావిస్తున్నాం. టీడీపీ తరపున ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి సంబంధిత అధికారులకు తెలుపుతాం.