– బాబు పథకాలను అటకెక్కించారు
– అక్రిడెటేషన్లు కూడా ఇవ్వడం లేదు
– సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
ఏపీలో జర్నలిస్టుల సమస్యలను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. జర్నలిస్టులపై జగన్ కక్షసాధింపు విధానాల వల్ల, ఎంతోమంది జర్నలిస్టులు మృతి చెందుతున్న విషాద పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కరోనా సమయంలో ఒక్క జర్నలిస్టుకూ, జగన్ సర్కారు సాయం చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఈ సంద ర్భంగా సీఎం జగన్‌కు ఎమ్మెల్యే సత్యప్రసాద్ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
14-08-2022
బహిరంగ లేఖ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,
అమరావతి
విషయం:
మూడేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మీడియా, పత్రికారంగం-ప్రభుత్వం నుంచి అందని సహాయ,సహకారాలు-అక్రిడేషన్లు లేక ఫీల్డ్ లో ఇబ్బందులు పడుతున్న ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్లు-నిలిచిన హెల్త్ కార్డుల జారీ , కొవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు నేటికీ అందని ఆర్థికసాయం, సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించని సమాచారశాఖ…..
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా, పత్రికారంగం మూడేళ్లుగా పెను సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రిడేషన్ , ఆరోగ్య బీమా మొదలుకొని ఆర్థిక సాయం వరకూ అరకొరగా అందడంతో విధి నిర్వహణలో, కుటుంబపోషణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వారి సమస్యలకు మీ నుంచి పరిష్కారం లభిస్తుందని ఈ లేఖ రాస్తున్నాను. ముఖ్యంగా కెమెరామెన్లు , ఫోటో గ్రాఫర్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందక క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, భారీ వరదలు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన ఘటనాస్థలానికి వెళ్లి ఫోటోలు, విజువల్స్ తీసేది కెమెరామెన్లు, ఫోటో గ్రాఫర్లే. వీరు విధి నిర్వహణలో గాయాలపాలవడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితులున్నాయి. ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఎందుకు సాయం చేయడం లేదు? రిస్క్ అని తెలిసి వార్త బయట ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లకు అండగా నిలవడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంవహిస్తోంది? జర్నలిస్టుల సమస్యల పట్ల మొసలికన్నీరు కార్చడం తప్ప రాష్ట్ర సమాచారశాఖ వల్ల జర్నలిస్టులకు ఒరిగిందేమీలేదు.
2019 నుంచి రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వార్తల కవరేజ్ కోసం నిత్యం ఏదో ఒక ప్రాంతానికి వెళ్లే కెమెరామెన్లకు అక్రిడేషన్లు ఇవ్వకపోవడంతో ప్రయాణఖర్చులు వారే భరించాల్సి వస్తోంది. నిత్యం ఫీల్డ్ లో పనిచేసేవారికి అక్రిడేషన్లు ఇవ్వకపోడం దేనికి సంకేతం? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 24 వేలమందికి అక్రిడేషన్ లు ఇవ్వగా.. వైసీపీ ప్రభుత్వం కేవలం 8 వేల మందికే ఇచ్చింది.
ఎన్నో కష్టనష్టాల కోర్చి పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం వారి సంక్షేమాన్ని విస్మరించి కక్షసాధింపుకు పాల్పడటం కాదా? టీడీపీ హయాంలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూలు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం జరిగింది. దాన్ని మూడేళ్లుగా అటకెక్కించారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు చంద్రబాబు గారు రూ. 10 లక్షలు ఆర్థికసాయం అందించేవారు. ఈ మూడేళ్లలో ఒక్క కుటుంబానికి సాయం అందలేదు. ఇవి చాలవన్నట్టు రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీల్లో వారి హక్కుల కోసం పోరాడే జర్నలిస్టు సంఘాలకు ప్రభుత్వం సభ్యత్వం లేకుండా చేయడం వారి హక్కులను కాలరాయడమే అవుతుంది.
తెలుగుదేశం హయాంలో జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇళ్లస్థలాలను రద్దు చేసి అన్యాయం చేశారు. కొవిడ్ సమయంలోనూ ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసిన జర్నలిస్టులకు ప్రభుత్వం అరకొర ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అర్హులైన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలి. కొవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 50 లక్షలు, పేద జర్నలిస్టులకు రూ. 5 వేల ఆర్థికసాయం అందించాలి. ఆరోగ్య బీమాను తక్షణమే పునరుద్ధరించాలి.
అనగాని సత్యప్రసాద్
– టీడీపీ శాసనసభ్యులు