– ఎంపీ విజయసాయి రెడ్డి
రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే రైతులకు సేవలందించడంలో ఏపీ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ టి మొహాపాత్ర ప్రశంసించారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్ షాప్ లో మహాపాత్ర మాట్లాడుతూ ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు ఆలోచన అద్భుతమంటూ కొనియాడారని అన్నారు. ఆర్బికే వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని విజయసాయి రెడ్డి అన్నారు. విజయవంతమైన ఫలితాలనిస్తున్న ఆర్బీకే వ్యవస్థ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి వికేంద్రీకరణే మూడు రాజధానుల ఉద్దేశం
రాష్ట్రంలో ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం ద్వారా కలిగే వ్యతిరేక ప్రభావాన్ని వరదలకు దెబ్బతిన్న బెంగుళూరు సిటీని ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములా, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని విధాలా మెరుగైనదని చెప్పారు. ఈ ఫార్ములా ద్వారా మెరుగైన నిర్వహణ సాధ్యపడుతుందని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని అన్నారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023
భారతదేశం తీసుకున్న చొరవ ఫలితంగా రాబోయే 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఆచరించనున్నట్లు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచ దేశాల ప్రజలు చిరుధాన్యాల వాడకం ఆవశ్యకత, వాటి ఉపయోగాలు అర్దం చేసుకుంటారని అన్నారు. చిరుధాన్యాలు వాడకం ద్వారా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారని అన్నారు.