Suryaa.co.in

Andhra Pradesh

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

– శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి భరత్
– రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం 4.0 పై వివరణ
– పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపు

శ్రీసిటీ : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం లో భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖా మంత్రి టి.జి.భరత్ శ్రీసిటీలోని పరిశ్రమల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

మంగళవారం శ్రీసిటీలో పరిశ్రమల ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈఓలు), ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం-4.0 తీరు తెన్నుల గురించి వివరించారు.

నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను, 10 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా కార్యాచరణను అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ విధానంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఈ), ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి, పర్యావరణ హరిత శక్తి, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.

వేగం, సామర్థ్యం, సుస్థిరత ద్వారా ఆర్థిక పరివర్తన సాధించే ప్రాథమిక సూత్రాలతో పారిశ్రామిక పాలసీ రూపకల్పన చేయబడిందన్న ఆయన, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించుకుంటూ ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్‌ని నిర్మించాలనే ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. పాలసీ క్రమబద్దీకరణలో వ్యాపారవేత్తల సూచనలు, ఆలోచనలు ఎంతో కీలకమైందన్న మంత్రి, ఈ సమావేశంలో చురుకైన చర్చల ద్వారా ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలుపాలని కోరారు.

మంత్రి వ్యాఖ్యలకు కొనసాగింపుగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ, మరింత విశ్లేషణతో ‘వేగవంతమైన వ్యాపార విధానం’ కోసం తీసుకువస్తున్న వివిధ నిర్ణయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పరిశ్రమల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల స్థాపన, అభివృద్ధి, రంగాలవారీగా ప్రోత్సాహకాలతో కూడిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల (పిఐపి) కోసం బహుళ-స్థాయి పెట్టుబడి ఫ్రేమ్‌వర్క్‌తో ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం ప్రత్యేకంగా తీర్చి దిద్దబడిందన్నారు.

ఈ విధానం సైజు (నానో నుండి మెగా) వారీగా పార్క్‌లను వర్గీకరించడంతో పాటు వివిధ పెట్టుబడి శ్రేణులకు (సబ్‌లార్జ్, లార్జ్, మెగా) ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం రాష్ట్రం లక్ష్యంలో భాగంగా వివరించారు.

ప్రత్యేకంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పర్యావరణ స్నేహపూర్వక విద్యుత్, ఎలక్ట్రానిక్స్ మరియు ఆహార శుద్ధి రంగాలకు అధిక ప్రోత్సాహకాలు, 40% వరకు సబ్సిడీలు, 6% డీకార్బనైజేషన్ సబ్సిడీ మరియు వ్యాపార నిర్వహణలో తక్కువ సమయంలో సౌలభ్యాలను కల్పించడం, ఈ విధానంలో కీలకంగా ఉన్నాయని తెలిపారు.

అంతేకాక, ఎగుమతుల లక్ష్యాన్ని 40 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఆటోమోటివ్, ఔషధం, అంతరిక్ష రంగాలలో ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” నినాదంతో రాష్ట్రంలో 175 ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక పార్కులు, MSMEలు, ఎలక్ట్రానిక్స్ కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ కల్పన, సుస్థిర వృద్ధిని సాధించడం ప్రభుత్వ లక్ష్యంలో భాగమన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పరిశ్రమల కోసం ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తూ, దీని ద్వారా స్థిరమైన పరిశ్రమాభివృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం జేశారు.

సమావేశానికి హాజరైన వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, నూతన పారిశ్రామిక విధానాన్ని హర్షిస్తూ, ముఖ్యంగా పనులు వేగవంతంగా సాగేలా చేసే (స్పీడ్ ఆఫ్ డూయింగ్బిజినెస్)విధానానికి ప్రశంసలు తెలియజేశారు. MSMEలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఉద్దేశించిన ప్రోత్సాహకాలను అభినందిస్తూ, పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను త్వరగా రీయింబర్స్‌మెంట్ చేయాలని అభ్యర్థించారు.

అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలను పరిష్కరించడానికి, ఫిర్యాదుల పరిష్కారానికి విధాన సౌలభ్యంపై వారు ప్రస్తావించారు. శ్రామికశక్తి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వృత్తి శిక్షణా కార్యక్రమాలలో పెట్టుబడిని పెంచాలని సూచించారు.

శ్రీసిటీ పారిశ్రామిక వర్గానికి నూతన పారిశ్రామిక విధానం, దాని ముఖ్య అంశాలను వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు మంత్రి, కార్యదర్శికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ చొరవ ప్రపంచ పెట్టుబడులకు రాష్ట్రాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చడంలో ప్రభుత్వ చురుకైన విధానానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.

పర్యటనలో భాగంగా మంత్రి, పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీసిటీలోని వివిధ అభివృద్ధి కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. డైకిన్ ఇండియా పరిశ్రమను సందర్శించి, ఉత్పత్తి ఇతర అంశాలను ఆరాతీశారు.

రాష్ట్ర ఆర్థిక దృక్పథాన్ని సాకారం చేయడంలో ముఖ్యమైన ముందడుగు వేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ ప్రపంచ పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రతినిధుల భాగస్వామ్య నిబద్ధతతో ఈ సమావేశం ముగిసింది

LEAVE A RESPONSE